క్షేత్రస్థాయి విచారణ వేగవంతం :జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్
ప్రభాతదర్శిని (తిరుపతి – ప్రతినిధి) : తిరుపతి పట్టణం, తిరుపతి గ్రామీణ మండలాల పరిధిలోని అనధికార, అనుమతి లేని గృహాల క్రమబద్ధీకరణ ప్రక్రియను వేగవంతం చేసేందుకు జిల్లా యంత్రాంగం విస్తృత కార్యాచరణను చేపట్టిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు, స్థానిక శాసనసభ్యులు, ప్రజాప్రతినిధుల ప్రత్యేక చొరవతో ఈ సర్వే ప్రక్రియను చేపడుతున్నట్లు కలెక్టర్ తెలిపారు. గతంలో ప్రకటించిన ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందని అర్హులైన గృహ యజమానులకు ఈసారి న్యాయం జరిగేలా సమగ్రంగా పరిశీలించి చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఈ రోజు మంగళం ప్రాంతంలో ఉప తహసీల్దార్ ఆధ్వర్యంలో రెవెన్యూ అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యటించి ఇంటింటికీ వెళ్లి గృహాల వివరాలపై విచారణ చేపట్టారు. గృహాలకు సంబంధించిన పత్రాలు, అందుబాటులో ఉన్న రెవెన్యూ రికార్డులు, భూమి స్వభావం, నివాసానికి సంబంధించిన ఆధారాలు తదితర అంశాలను అధికారులు పరిశీలించారు. ప్రభుత్వ నిబంధనలు, అందుబాటులో ఉన్న రెవెన్యూ రికార్డులు, భూమి స్వభావం, అర్హతలు, ఇతర చట్టపరమైన అంశాలను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం అర్హత కలిగిన కుటుంబాలకు ప్రభుత్వ నిబంధనల మేరకు చట్టబద్ధమైన హక్కులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. సర్వే అధికారులు, రెవెన్యూ సిబ్బంది తమ ఇళ్లను సందర్శించిన సమయంలో ప్రజలు నివాసానికి సంబంధించిన పత్రాలు, ఆధారాలు, ఇతర ధృవీకరణ పత్రాలను అందుబాటులో ఉంచి అధికారులకు పూర్తి సహకారం అందించాలని కలెక్టర్ సూచించారు. ప్రజా సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా, అర్హులైన వారికి వారి నివాసాలకు చట్టబద్ధమైన గుర్తింపు, హక్కులు కల్పించే దిశగా జిల్లా యంత్రాంగం పూర్తి పారదర్శకతతో ఈ ప్రక్రియను కొనసాగిస్తోందని కలెక్టర్ స్పష్టం చేశారు. సంబంధిత ప్రాంతాల ప్రజలు ఈ సర్వేను సద్వినియోగం చేసుకుని అధికారులకు అవసరమైన సమాచారం, పత్రాలు అందించి సహకరించాలని తెలిపారు.
