విలేకరులపై కర్రతో దాడి కేసులో సెక్షన్లు ఎందుకు మార్చారు?50 వేలు దోపిడీ చేస్తే 1000 రూపాయల జరిమానా సెక్షన్!ఫోటోలు, వీడియోలు సాక్ష్యాలకు పనికి రావా? నాన్-కాగ్నిజబుల్ సమాచారం ఇచ్చారు… కాగ్నిజబుల్ సమాచారం దాచారు!చేతివాటం ప్రదర్శించిన పెళ్లకూరు ఎస్ఐ ఆదిలక్ష్మి?ప్రభాతదర్శిని,(ప్రత్యేక-ప్రతినిధి):పెళ్లకూరు మండలంలో విలేకరులపై కర్రతో దాడి చేసి, 50,000 రూపాయలు లాక్కొని, సెల్ ఫోన్లు పగలగొట్టిన ఘటనలో పోలీసుల వైఖరి పలు అనుమానాలకు తావిస్తోంది. బలమైన సాక్ష్యాలు ఉన్నా కేవలం 1000 రూపాయల జరిమానా పడే బలహీన సెక్షన్లతో ఎఫ్ఐఆర్ నమోదు చేసి నిందితులకు సహకరిస్తున్నారని విలేకరులు ఆరోపిస్తున్నారు.
ఎఫ్ఐఆర్ నం 116/2026 లో ఏం జరిగింది? :29/09/2026 న అర్లపాడు ప్రభుత్వ పాఠశాలలో ఎస్ఎంసి ఎన్నికల అవకత వకలపై వార్త సేకరణకు వెళ్లిన ‘ప్రభాతదర్శిని’ విలేకరి గుంజి సుధాకర్, ‘సూర్య’ విలేకరి ఇల్లుపూరి నాని జితేంద్రలపై వాటం బేటి చంద్రశేఖర్, వాటంబేటి నాగరాజు, నరేంద్ర అనే వ్యక్తులు దాడి చేసి వారి వద్ద ఉన్న సెల్ ఫోన్లను పగలగొట్టారు. ఆ రోజే పెళ్లకూరు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. దీంతో బాధితులతో పాటు మండల విలేకరులు 07/10/2026 న జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు పెళ్లకూరు పోలీసులు ‘115(2), 292, 3(5) బిఎన్ఎస్’ కింద కేసు పెట్టారు. నిందితుడు చంద్రశేఖర్ చేతిలో పొడవాటి కర్రతో దాడికి ప్రయత్నిస్తున్న దృశ్యం ఫోటో, వీడియోలలో స్పష్టంగా ఉన్నా పోలీసులు పరిగణనలోకి తీసుకోలేదు. ఒరిజినల్ ఫోటోలో స్థానిక మహిళ, వృద్ధుడు అతన్ని ఆపుతున్నా పట్టించుకోలేదు. ఇది ‘118(1) బిఎన్ఎస్ – ప్రమాదకర ఆయుధంతో దాడి’. దీనికి 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంటుంది. కానీ పోలీసులు 115(2) – ఖాళీ చేతులతో కొట్టారని ఎఫ్ఐఆర్ నమోదు చేయడం విశేషం. అలాగే ఎఫ్ఐఆర్ లోనే పేర్కొన్నట్లు, సుధాకర్ జేబులో ఉన్న ట్రాక్టర్ ఫైనాన్స్ కు చెందిన 50వేల రూపాయలు, ఇద్దరి సెల్ ఫోన్లు, బైక్ కీలు బలవంతంగా లాక్కున్నారు. దీనికి 303(2) – దొంగతనం, 309(4) – దోపిడీ, 324(4) – ఫోన్ పగలగొట్టి ఆస్తి నష్టం, 351(2) – బెదిరింపు సెక్షన్లతో కేసు కట్టాలి. కానీ పోలీసులు దీనిని గొడవ కింద మార్చివేశారు.
“నాన్-కాగ్నిజబుల్ సమాచారం ఇచ్చారు… కాగ్నిజబుల్ సమాచారం దాచారు!” :చిన్న నేరాలు జరిగితే పోలీసులు కోర్టు అనుమతి లేకుండా కేసు నమోదు చేయకూడదు. ముందు మెజిస్ట్రేట్ అనుమతి తెచ్చుకోవాలి. దీనిని ‘నాన్-కాగ్నిజబుల్ అఫెన్స్ – నాన్ కాగ్నిజబుల్’ అంటారు. పెళ్లకూరు ఎస్ఐ ఆదిలక్ష్మి ఈ కోవకు చెందిన ‘115(2), 292’ సెక్షన్లకు 06/10/2026 న నాయుడుపేట జె ఎఫ్ ఎం సి కోర్టు నుండి అనుమతి తెచ్చుకున్నారు. కానీ పెద్ద నేరాలు జరిగితే పోలీసులు కోర్టు అనుమతి లేకుండానే ఎఫ్ ఐ ఆర్ పెట్టి అరెస్ట్ చేయవచ్చు. దీనిని ‘కాగ్నిజబుల్ అఫెన్స్ – కాగ్నిజబుల్’ అంటారు. విలేకరులపై జరిగిన ‘కర్రతో దాడి – 118(1), 50 వేల రూపాయల దోపిడీ – 309(4)’ అనేవి కాగ్నిజబుల్ సెక్షన్లు. వీటిని ఎస్ఐ కోర్టుకు ఇచ్చిన లెటర్ లో ఎక్కడా ప్రస్తావించలేదు. ఎస్ఐ దురుద్దేశంతో నిందితులను కాపాడే ఉద్దేశంతో వీటిని దాచి, కేవలం ‘292 బిఎన్ఎస్ – పబ్లిక్ న్యూసెన్స్ – 1000 రూపాయలు జరిమానా’ పడే చిన్న సెక్షన్లకు అనుమతి అడిగారని, చట్టంలోని లొసుగును ఉపయోగించి పరోక్షంగా నిందితులకు స్టేషన్ బెయిల్ వచ్చేలా సహకరించారని జర్నలిస్టు లు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై జిల్లా ఎస్పీకి, కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు.

