ప్రభాతదర్శిని, ప్రతినిధి: పంచాయతీ ఎన్నికల సందడి ప్రతి గ్రామంలో మొదలైంది, ప్రతి వీధిలో అభ్యర్థులు తిరుగుతున్నారు, ఇంటింటికీ వెళ్లి నమస్కారాలు చేస్తున్నారు, హామీలు ఇస్తున్నారు, గ్రామాభివృద్ధి గురించి పెద్ద పెద్ద మాటలు చెబుతున్నారు, కానీ గ్రామస్తుల మనసులో మాత్రం ఒక్కటే ప్రశ్న మెదులుతోంది, ఎన్నికలప్పుడు కనిపించే ఈ నాయకులు గెలిచాక కూడా కనిపిస్తారా, ప్రజలకు అందుబాటులో ఉంటారా, ఫోన్ చేస్తే స్పందిస్తారా, సమస్య చెబితే పరిష్కరిస్తారా అని, ఎందుకంటే గతంలో చాలా గ్రామాల్లో చూసిన అనుభవం ఇదే, ఎన్నికలప్పుడు ఇంటింటికీ తిరిగిన నాయకుడు గెలిచాక ఫోన్ కూడా ఎత్తని నాయకుడిగా మారిపోయాడు, పని కోసం పంచాయతీ కార్యాలయానికి వెళితే సర్పంచ్ గారు ఊళ్ళో లేరు అనే సమాధానమే వినిపించింది, రోడ్డులో గుంత పడినా, తాగునీటి ట్యాంక్ ఖాళీ అయినా, వీధి దీపం వెలగకపోయినా, వృద్ధుల పింఛన్ ఆగిపోయినా, రైతుకు రోడ్డు కావాలన్నా, విద్యార్థికి స్కూల్లో మరుగుదొడ్డి కావాలన్నా, మహిళకు వీధిలో భద్రత కావాలన్నా ఎవరిని అడగాలో తెలియని పరిస్థితి వచ్చింది, అందుకే ఈసారి గ్రామం కోరుకుంటోంది పదవి కోసం వచ్చేవాడిని కాదు, ప్రజా సేవ కోసం అందుబాటులో ఉండేవాడిని, కులం చూసి, బంధుత్వం చూసి, డబ్బు చూసి ఓటు వేస్తే గెలిచినవాడు వాళ్ళకే పని చేస్తాడు, గ్రామానికి పని చేయడు, అందుకే ఓటరు ఈసారి ఆలోచించాలి, నాకు ఏం ఇస్తాడు అని కాదు, గ్రామానికి ఏం చేస్తాడు అని, అభ్యర్థి గెలిచాక ఎన్ని రోజులు గ్రామంలో ఉంటాడు, ప్రజలు ఎప్పుడు కలవచ్చు, పంచాయతీ డబ్బు ఎక్కడ ఖర్చు పెడతాడు, ఐదేళ్ళలో గ్రామాన్ని ఏ స్థాయికి తీసుకెళ్తాడు అని ప్రశ్నించాలి, ఎన్నికల్లో గెలవడం ఒక రోజు పని, గ్రామాన్ని గెలిపించడం ఐదేళ్ళ పని, అందుకే ఓటు వేసే ముందు ఒక్కసారి ఆలోచించండి, ఓట్ల కోసం వచ్చినవాడా, ప్రజా సేవకు అందుబాటులో ఉండేవాడా అని, సరైన నిర్ణయం తీసుకుంటేనే గ్రామ భవిష్యత్తు మారుతుంది, తప్పుడు నిర్ణయం తీసుకుంటే ఐదేళ్ళు గ్రామం నష్టపోతుంది, కాబట్టి ఈ ఎన్నికల్లో గెలవాల్సింది వ్యక్తులు కాదు, గ్రామ అభివృద్ధి కావాలి అని గ్రామస్తులు కోరుకుంటున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామీణ పల్లెల అభివృద్ధి కోసం లక్షలాది రూపాయలు పంచాయతీలకు కేటాయిస్తున్నా ఏ ఒక్క పంచాయతీ కూడా నేటికీ పూర్తిస్థాయిలో మౌలిక వసతులతో అభివృద్ధి చెందలేదని చెప్పవచ్చు, ఇందుకు రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి, ఒకటి పంచాయతీ ఎన్నికలలో లక్షలాది రూపాయలను వెదజల్లి ఓట్లు కొనుక్కుని సర్పంచ్ పదవి దక్కించుకున్న వ్యక్తి తాను ఖర్చుపెట్టిన మొత్తాన్ని ఏదో ఒక రూపంలో తిరిగి పొందే క్రమంలో అడ్డదారులు తొక్కడం, రెండవది సర్పంచ్ ఒక వర్గానికి, వార్డు మెంబర్లు మరో వర్గానికి రావడం లేదా ప్రత్యర్థులకు సమానంగా మెంబర్లు రావడంతో పెత్తందారులు తమ స్వార్థం కోసం తమ మాటే చెల్లాలని వేసే రాజకీయ పాచికలతో గ్రామాలు అభివృద్ధికి నోచుకోవడం లేదు, దానికి తోడు ఎన్నికల రోజు అభ్యర్థుల ప్రలోభాలకు లొంగి తీసుకున్న ఓటర్లు ఆ తర్వాత గెలిచిన ప్రతినిధులను గట్టిగా నిలదీయలేకపోతున్నారు, మీరు ఇచ్చారు కదా అని ప్రతినిధులు ఓటర్ల నోటికి తాళం వేయడంతో అభివృద్ధి విషయంలో ప్రశ్నించే ధైర్యం లేకుండా పోయింది, ఫలితంగా గ్రామాల్లో అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా కనబడుతుంది, ముఖ్యంగా వర్షాకాలంలో క్షేత్రస్థాయిలో చూస్తే మురికి వాడల వీధుల్లో పశువులు, పందులు తిష్టవేసి తిరుగుతూ, మురికి నీరు, వర్షపు నీరు వీధుల్లో చేరి నీటి గుంటలుగా మారి దుర్వాసన వెదజల్లుతూ ప్రజలను అసౌకర్యానికి, అనారోగ్యానికి గురి చేస్తున్నాయి, అతిసారం వంటి వ్యాధులు ప్రబలితేనే అధికారులు, ప్రతినిధులు హడావుడిగా బ్లీచింగ్ చల్లించడం, వీధులు శుభ్రం చేయడం, మెడికల్ క్యాంపు పెట్టడం చేస్తున్నారు, పంచాయతీని పరిరక్షించాల్సిన పంచాయతీ కార్యదర్శి పెత్తందారుల కనుసన్నల్లో పనిచేస్తూ సచివాలయంలో, ఎంపీడీవో కార్యాలయంలో సెల్ ఫోన్ చాటింగ్ లతో కాలక్షేపం చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి, నిజాయితీగా పనిచేయాలనుకునే కార్యదర్శులను కూడా పెత్తందారులు పాలేరులా భావించి అసభ్యంగా మాట్లాడుతూ, పై అధికారుల ద్వారా ఇబ్బంది పెడుతున్నారని, అలాగే సేవ చేయాలని వచ్చిన సర్పంచ్ లపైనా అవినీతి ఆరోపణలతో ప్రత్యర్థులు ఇబ్బంది పెడుతున్నారని గ్రామస్తులు వాపోతున్నారు, పంచాయతీ అంటే ప్రజల అభివృద్ధి, అందరం రాజకీయాలకు అతీతంగా పనిచేయాలనే భావన లేకపోవడం ఈ పరిస్థితికి ప్రధాన కారణం, వాస్తవానికి రాజ్యాంగంలోని 73వ సవరణ, ఆర్టికల్ 243-ఎ ప్రకారం గ్రామసభకు రాజ్యాంగబద్ధ హోదా ఉంది, ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం 1994 లోని సెక్షన్ 6 ప్రకారం గ్రామసభ ఏర్పాటు తప్పనిసరి, ఆ చట్టం ప్రకారం ప్రతి గ్రామ పంచాయతీ సంవత్సరానికి కనీసం రెండు సార్లు ఏప్రిల్ 14, అక్టోబర్ 3 తేదీలలో గ్రామసభ పెట్టాలి, అంతేకాకుండా ప్రభుత్వం జారీ చేసిన జీవో ఎంఎస్ నంబర్ 791, తేదీ 07-11-2013 ప్రకారం, రాజీవ్ గాంధీ పంచాయత్ సశక్తీకరణ్ అభియాన్ కింద గ్రామసభలను సంవత్సరానికి 4 సార్లు జనవరి 2, ఏప్రిల్ 14, జూలై 1, అక్టోబర్ 3 తేదీలలో నిర్వహించాలి, కేంద్ర ప్రభుత్వం సూచించిన తేదీలు కూడా ఉన్నాయి, జనవరి 26 గణతంత్ర దినోత్సవం, మే 1 కార్మిక దినోత్సవం, ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం, అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజులలో గ్రామసభలు పెట్టాలని సూచించింది, ఇలాంటి స్పష్టమైన జీవోలు, చట్టాలు ఉన్నా వాటిని పట్టించుకునే వారే లేరు, కేంద్ర ప్రభుత్వం సూచించిన ఇలాంటి నిబంధనలు ఉన్నాయని కూడా చాలామందికి తెలియదంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే పంచాయతీ పదవి అంటే రాజకీయంగా పోటీ పడటమే అని మాత్రమే అనుకుంటుండగా, బాధ్యతలు, వాటికి ఉన్న నియమ నిబంధనలు తెలియకపోవడం కూడా అభివృద్ధికి అడ్డుకట్టగా మారింది, విచిత్రం ఏమిటంటే పంచాయతీ ఎన్నికలలో అప్పటివరకు కనిపించని బంధుత్వాలు, చుట్టాలు, మామ, బావ, అన్న, అక్క అంటూ తుంటరి పలకరింపులతో ఎక్కడలేని ప్రేమ, ఆప్యాయతలు కురిపించడం ఈ ఎన్నికల ప్రత్యేకతగా చెప్పవచ్చు, ఎన్నికలు అయిపోయాక ఆ బంధుత్వాలు, ఆ ప్రేమ మళ్ళీ కనిపించవు, ఓటు కోసం వచ్చిన ఆప్యాయత నిజమైనదా, ఎన్నికల నాటకమా అని ఓటర్లు గుర్తించాల్సిన సమయం వచ్చింది, ఈ గ్రామసభలు నిర్వహిస్తే గ్రామాల్లో నెలకొన్న సమస్యలు పాలకులకు, అధికారులకు స్పష్టంగా తెలుస్తాయి, తద్వారా ఐదు సంవత్సరాలలో సంవత్సరానికి 4 చొప్పున 20 గ్రామసభలు నిర్వహిస్తే సమస్యలు ఏవి పెండింగ్ లో ఉన్నాయో, ఎలాంటి అభివృద్ధి చేశారో స్పష్టత వస్తుంది, ఇలాంటి మార్పులు వచ్చినప్పుడే గ్రామాలు అభివృద్ధి చెంది దేశానికి పట్టుకొమ్మలని భావించిన మహాత్మా గాంధీ ఆశలు నెరవేరుతాయని భావించవచ్చు.