నిబంధనలను పట్టించుకోని ఎక్సైజ్ శాఖ..!
ప్రభాతదర్శిని (ప్రత్యేక-ప్రతినిధి): నాయుడుపేట ఎక్సైజ్ పరిధిలో సిండికేట్ జోరుతో మద్యం ప్రియులు బేజారుకు గురవుతున్నారు. ప్రభుత్వం ఎమ్మార్పీ రేట్లకే మద్యం విక్రయించాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ లిక్కర్ సిండికేట్ మాయాజాలంతో మద్యం ప్రియులను యధేచ్చగా దోచుకుంటున్నారు. ప్రభుత్వ నిబంధనలను అమలు చేయవలసిన ప్రొహిబిషన్ ఎక్సైజ్ అధికారులు మౌనవ్రతం చేయడం విశేషం.
అధికార పార్టీ చెడ్డ పేరు చేస్తున్న వైనం: త్వరలో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల సమరానికి సన్నాహాలు ముమ్మరమవుతున్న వేళ, అధికార పార్టీకి చెందిన కొందరు నేతల లిక్కర్ ధరల పెంపుతో అడ్డగోలు వ్యవహారాలు చేస్తుండంతో ఈ ప్రభావం రానున్న ఎన్నికలలో అధికార పార్టీని కొంపముంచేలా తయారయ్యాయి. గతంలో అధికారంలో ఉన్న గత పాలకులు చేసిన తప్పులనే తాము చేయబోమని, ప్రజలకు మెరుగైన పాలన అందిస్తామని ప్రస్తుత అధికార పార్టీ అధినేతలు గొప్పలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత క్షేత్రస్థాయిలో మాత్రం ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారు. నేడు బాటిల్‌పై అదనంగా రూ. 10 నుండి రూ. 20 వరకు వసూలు చేస్తూ సామాన్యుల నడ్డి విరుస్తున్నారు.
నిబంధనలకు పట్టించుకునే వారేరి? ​నాయుడుపేట ఎక్సైజ్ శాఖ పరిధిలో నాయుడుపేట మండలంలో ఒక బార్ , 14 షాపులున్నాయి.ఈ దుకాణాలన్నీ అధికార పార్టీ నేతల కనుసన్నల్లోనే సిండికేట్‌గా మారి యథేచ్ఛగా ధరలు పెంచి గా దందా సాగిస్తున్నాయి. పట్టించుకునే నాధుడే కరువయ్యారు.
జాతీయ పర్వదినాల్లో కూడా అమ్మకాలు: నిబంధనల ప్రకారం మహాత్మా గాంధీ జయంతి,అక్టోబర్ 2 స్వాతంత్ర్య దినోత్సవం,ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం, జనవరి 26 గణతంత్ర దినోత్సవం వంటి జాతీయ పర్వదినాల్లో ప్రభుత్వం మద్యం విక్రయాలు పూర్తిగా అమ్మకాలు నిషేధం. కానీ ఇక్కడ నిబంధనలు కేవలం కాగితాలకే పరిమితమయ్యాయి. ఇది కాకుండా మద్యం షాపులు 24 గంటలు అర్ధరాత్రి,అపరాత్రి అనే తేడా లేకుండా ఎలాంటి ఆంక్షలు లేకుండా దర్జాగా అమ్మకాలు సాగుతున్నాయి. ​ఈ అక్రమ తతంగం అంతా ఎక్సైజ్ అధికారులకు తెలిసినా, అధికార పార్టీ నేతల ప్రలోభాలకు లేదా రాజకీయ ఒత్తిడిలకు దాసోహమై నోరు మెదపడం లేదని అపకీర్తిని మూట కట్టుకుంటున్నారు.
ధరల మోత లో అధికారుల మూట ఎంత…!: ​రోజువారీ కూలీ నాలి చేసుకునే కార్మికులు, మధ్యతరగతి ప్రజలు తమ కష్టార్జితంలో కొంతభాగాన్ని మద్యం కోసం వెచ్చిస్తుంటారు. మద్యం ప్రియుల బలహీనతను ఆసరాగా చేసుకుని, బాటిల్‌పై 10 నుంచి 20 రూపాయలు అదనంగా వసూలు చేయడం పట్ల ప్రొఫెషన్ అండ్ ఎక్సైజ్ అధికారులు నోరు మెదపటం లేదు. అదనపు ధర అమ్మకాలలో అధికారులకు వాటాలు అందుతుండడంతో మౌనవహిస్తున్నారని విమర్శలు లేకపోలేదు. దీంతో మద్యానికి బానిసైన మద్యం ప్రియులు గత్యంతరం లేక మౌనంగానే జేబులు కాళీ చేసుకుంటున్నారు. దీని ప్రభావం రానున్న ఎన్నికలలో అధికార పార్టీ నాయకుల పై తీవ్ర ప్రభావ చూపడం ద్వారా ఎన్నికల పై ఈ ప్రభావం పడుతుందని విశ్లేషకుల అంచనా. ఇదే జరిగితే ​​తప్పు ఎవరు చేసినా,ఆ పాపం మాత్రం చివరికి ప్రభుత్వానికే, పార్టీ అభ్యర్థులపై శాపంగా మారుతుందని నిజాయితీగల నాయకులను వెంటాడుతోంది. ఈ వ్యవహారంపై ఎక్సైజ్ అధికారులు కొరడా ఝలిపిస్తారా? లేక అధికార పార్టీ నేతల ముసుగులో సాగుతున్న ఈ దోపిడీని చూసి చూడనట్లు తమ వాటాలను పంచుకుంటారా? వేచి చూడాల్సిందే.