- ఓజిలిలో దట్టంగా కమ్ముకున్న మంచు
- చలికి వణుకుతున్న ప్రజలు, కనిపించని రోడ్లు
- ఎల్ నినోతో వర్షాభావం, బెంగలో రైతులు
- ఎల్ది సాగుపై ఆశలు, వర్షం కోసం ఎదురుచూపు
ప్రభాతదర్శిని, ఓజిలి – ప్రతినిధి: మండల కేంద్రమైన ఓజిలిలో ఆదివారం తెల్లవారుజామున మంచు చుట్టేసింది. దీంతో చలి కుమ్మేసింది. ఉదయం నుంచి ఊరంతా మంచుతో కప్పేసినట్లు కనిపించింది. ఇళ్లు, చెట్లు, రోడ్లు అన్నీ మసక మసకగా మారాయి. వాహనదారులు హెడ్ లైట్లు వేసుకుని నెమ్మదిగా ప్రయాణించారు. ప్రకృతి పరంగా ఈ దృశ్యం అందంగా ఉన్నప్పటికీ, రైతులకు మాత్రం ఈ పరిస్థితి చిరాకుగా కనిపిస్తుందని చెప్పవచ్చు. వర్షాభావ పరిస్థితులు ఎదుర్కొంటున్న ఓజిలి మండల రైతులకు ఈ మంచు వింతగా, విశేషంగా కనిపిస్తుంది. ఎల్ నినో ప్రభావంతో వర్షాలు సక్రమంగా కురవకపోవడంతో రైతులు వ్యవసాయం చేయలేక బెంగ పెట్టుకున్నారు. ఈ క్రమంలో గత నెలలో తుఫాన్ తో కురిసిన వర్షాలతో కేవలం వర్షాధారం మీద ఆధారపడి సాగించే ఎల్ది సేద్యానికి రైతులు శ్రీకారం చుట్టారు. అప్పులు చేసి మరీ చల్లకాలు చేశారు. అక్వాన్ తుఫాన్ తో వర్షాలు కురుస్తాయని ఆశించిన రైతులకు నిరాశే మిగిలింది. ఇప్పటికే 10-15 రోజులుగా వరి విత్తనాలు మొలకెత్తి పైరుగా విస్తరిస్తున్నాయి. ఇంకొక వారం పది రోజులు భూమిలో ఉన్న తేమతో ఈ పైరు బతికే అవకాశం ఉంది. ఆ తర్వాత వర్షాలు లేకపోయినా, నీరు లేకపోయినా పైరు ఎండి మాడిపోయే ప్రమాదం ఉంది. ప్రభుత్వం వరి సాగుకు ప్రత్యామ్నాయంగా ఇతర పంటలు వేయాలని ప్రకటించింది. కానీ ఇక్కడి భూముల్లో వరితర పంటలు సాగుకు అనుకూలమో కాదో రైతులకు నేటికీ సరైన అవగాహన లేదు. సంవత్సరాలు తరబడి ఇక్కడ వరి ఒక్కటే సాగు చేస్తున్నారు. మెట్ట ప్రాంతాల్లో నిమ్మ, జామాయిల్ వంటి వాణిజ్య పంటలు సాగు చేస్తున్నారు. ఈ ప్రాంతంలో పప్పు దినుసుల సాగు పూర్తిగా లేదని చెప్పవచ్చు. కొన్ని ప్రాంతాల్లో కేవలం కూరగాయలు మాత్రమే సాగు చేస్తున్నారు. ఎల్ నినో ప్రభావం రైతులపైనే కాకుండా దానిపై ఆధారపడే వ్యవసాయ కార్మికులపై కూడా తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ పరిస్థితుల్లో ప్రకృతి వర్షం కురిపించాలని రైతులు ఎదురుచూస్తున్నారు.

