నాయుడుపేటలో ఖాకీల రాజకీయ కుట్ర…?…రాజకీయ తొత్తులు అనే అపకీర్తికి బాధ్యులు ఎవరు? ప్రభాతదర్శిని, (ప్రత్యేక – ప్రతినిధి): నాయుడుపేట పురపాలక ఎన్నికల్లో 32 వార్డుల సమరం ఒక ఎత్తు అయితే, తెర వెనుక జరుగుతున్న రాజకీయ కుట్ర మరో ఎత్తు. ప్రత్యర్థిని ఓటుతో ఎదుర్కోలేక, ఖాకీల ద్వారా తప్పుడు కేసుతో అడ్డుకోవాలనుకునేంతగా రాజకీయ వ్యవస్థ భ్రష్టుపట్టిందా? కష్టపడి చదివి ఉద్యోగం తెచ్చుకున్న పోలీసులు, 5 ఏళ్ల రాజకీయ భవిష్యత్తు కోసం వెంపర్లాడే చిన్న నాయకుల ఉచ్చులో పడి తమ ఆత్మాభిమానాన్ని, శాఖ గౌరవాన్ని తాకట్టు పెడుతున్నారా? అనే ప్రశ్నలు ఇప్పుడు పట్టణంలో పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ఉన్నత చదువులు చదువుకుంది… ఊడిగం చేసేందుకా? : కష్టపడి ఉన్నత చదువులు చదువుకొని చట్టాలపై అవగాహన కలిగిన వ్యక్తులు ఇలా రాజకీయ నాయకుల మెప్పు పొందేందుకు లేదా వారి నుండి ఏదో ఒకటి తమ స్వలాభాల కోసం ఆశించేందుకు ఊడిగం చేయాలా అని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఉన్నత చదువులు చదువుకుని చట్టాలపై అవగాహన కలిగి ఉన్న అధికారులు, రాజకీయ స్వార్థం కోసం, రాజ్యాంగం, చట్టాలపై అవగాహన లేని వ్యక్తులు అజమాయిషీ చేయడం పట్ల వ్యవస్థల మీద చదువుకున్న యువతకు నమ్మకం సన్నగిల్లుతుంది. రాజ్యాంగాన్ని పరిరక్షించే వ్యక్తులుగా కీర్తించాలా? రాజకీయ నాయకుల కనుసన్నలలో పనిచేసే రాజకీయ తొత్తులు అని సంబోధించాలా? అనేది ప్రజల నుండి వస్తున్న ప్రశ్న. ఎవరో రాజకీయ పదవిని అలంకరించేందుకు పోలీసులు ఆత్మాభిమానాన్ని చంపుకొని మరి ఇంతగా దిగజారి పోవాలా? ఇలా దిగజారి పోవడం వల్ల వారికి వచ్చే లాభం ముందు విలువలు లేని జీవితం అవసరమా? అని కొందరు ప్రశ్నిస్తున్నారు. కామిరెడ్డి రాజారెడ్డి పై అసలు ఆరోపణ ఏమిటి?: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి నెల్లూరు జిల్లా కార్యనిర్వహణ కార్యదర్శి, నాయుడుపేట మున్సిపాలిటీలో చైర్మన్ అభ్యర్థి గెలుపు కోసం కీలకంగా వ్యవహరిస్తున్న సీనియర్ నేత కామిరెడ్డి రాజారెడ్డిని ఎన్నికల వేళ అడ్డుకోవడమే లక్ష్యంగా ఈ కుట్ర జరిగిందని వైయస్సార్ కాంగ్రెస్ నాయకుల ప్రధాన ఆరోపణలు చేస్తున్నారు. వారి వాదన ప్రకారం జరిగిన అధికార పార్టీకి చెందిన ఒక నాయకుడి మద్యం దుకాణం నుండి మద్యం సీసాలను పోలీసులే తీసుకొచ్చి రాజారెడ్డిని కేసులో ఇరికించాలని కుట్ర పన్నినట్లు ఆరోపిస్తున్నారు. మద్యం బాటలో ఉన్న స్టిక్కర్ల ద్వారా ఆ బాటిళ్లు ఏ షాపులో ఎప్పుడు అమ్ముడుపోయాయి అన్న విషయాలను ఆన్ లైన్ లో తెలుసుకుంటే వాస్తవాలు తెలుస్తాయని వారు అంటున్నారు. నిజంగా రాజారెడ్డి మద్యం బాటిళ్లు కలిగి ఉంటే గౌరవంగా ప్రధాన ద్వారం ద్వారా రావాల్సిన పోలీసులు దొంగల వలె గోడలు దూకి, పక్క భవనంలో ఏర్పాటు చేసిన నిఘా కెమెరాలను పక్కకు జరిపి, వాటి తీగలను తెంపే ప్రయత్నం చేశారని ప్రశ్నిస్తున్నారు. ఆ సీసాలను రాజారెడ్డి ఇంటి వాహనాలు నిలిపే స్థలంలో ఉంచి, సినిమా తరహాలో దృశ్యాలను చిత్రీకరించి, ఆ తర్వాత పట్టణ సీఐ పరిశీలకులు, సిబ్బంది వచ్చి అక్రమ మద్యం నిల్వ అంటూ కేసు నమోదుకు యత్నించారని విమర్శిస్తున్నారు. నిఘా కెమెరా దృశ్యాలలో ఏముంది?: ఈ కుట్రను బయటపెట్టే కీలక సాక్ష్యంగా ఒక నిఘా కెమెరా దృశ్యం లభించింది. దానిని పరిశీలించగా ఆ ప్రదేశంలో రాత్రి 9 గంటల ప్రాంతం, తే:30-10-2026 దిన ఒక ఇంటి వాహనాలు నిలిపే స్థలం, అందులో 2 తెల్ల కార్లు, ఒక బూడిద రంగు కారు ఉన్నాయి. అనుమానాస్పద ప్రవేశంలో మొదటి వ్యక్తి ఖాకీ దుస్తుల్లో ద్వారం నుండి హడావుడిగా వచ్చి పరిసరాలను పరిశీలిస్తున్నాడు. తలుపు తట్టడం, యజమానికి సమాచారం ఇవ్వడం, పంచనామా సాక్షులను పిలవడం వంటి కనీస నిబంధనలు పాటించకపోవడం పై పోలీసుల తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీడియోలో అత్యంత కీలకమైన 15 సెకన్ల దృశ్యం చివర్లో ఇద్దరు వ్యక్తులు చేతిలో తెల్లటి సంచులతో వచ్చి, ఒక తెల్ల కారు పక్కన నేలపై ఉంచడం స్పష్టంగా కనిపిస్తోంది. ఒక వ్యక్తి చేతిలో ఉన్న ఫోన్ తో చిత్రీకరిస్తుండగా, మరొకరు ఆ సంచులను అక్కడ పెట్టడం జరుగుతోంది. నిపుణుల పరిశీలనలో వాస్తవాలు తేలాల్సి ఉంది. సొంత ఇంటి ముందు మద్యం పెట్టుకుంటారా?: ఇక్కడే అసలు కథ అర్థమవుతుంది. ఎన్నికల సమయంలో నాయకులు డబ్బు, మద్యం పంపిణీ చేస్తారనేది బహిరంగ రహస్యమే. కానీ ఏ రాజకీయ నాయకుడైనా, అదీ కామిరెడ్డి రాజారెడ్డి లాంటి సీనియర్ నేత, తన సొంత ఇంటి ముందు, తన కార్ల పక్కన, నిఘా కెమెరాల నిఘా మధ్య మద్యం సీసాలను దర్జాగా పెట్టుకుని పోలీసులకు దొరికిపోతాడా? దొంగ చాటుగా, అర్ధరాత్రి, రహస్యంగా జరగాల్సిన పంపిణీని ఎవరైనా తన ఇంటి ముందు పెట్టుకుంటారా? ఇది రాజకీయంగానే జరిగిన కుట్రని ఆ పార్టీ శ్రేణులు మండిపడుతున్నారు.ఆత్మహత్యతో సమానం. ఎన్నికల వేళ మద్యం పంపిణీ జరగవచ్చు. కానీ ఏ నాయకుడూ తన సొంత ఇంటి ముందు, తన కార్ల పక్కన, నిఘా కెమెరాల మధ్య మద్యం సీసాలను బహిరంగంగా నిల్వ ఉంచి పోలీసులకు ఆహ్వానం పలకడు. దొంగ చాటుగా జరగాల్సిన చోట, దర్జాగా ఇంటి ముందు పెట్టడం సహజ న్యాయ సూత్రాలకు, ఇంగిత జ్ఞానానికి విరుద్ధం. ఈ ఒక్క అంశమే తేలుస్తుంది. ఇది పట్టుబడిన కేసు కాదు, పన్నిన కేసు అనే అనుమానానికి బలం చేకూర్చే విధంగా ఉంది. చట్టం ఏం చెబుతోంది?: ఒకవేళ ఈ ఆరోపణలు నిజమైతే, ఇది సాధారణ ఎన్నికల తప్పిదం కాదు, తీవ్రమైన నేరం అవుతుందా అనడంలో సందేహం లేదు. రాజ్యాంగ ఉల్లంఘన: 21 వ అధికరణం జీవించే హక్కు, వ్యక్తిగత గౌరవం, 22 వ అధికరణం అక్రమ అరెస్టు నుండి రక్షణ లకు విరుద్ధం. పోలీసు పద్ధతి ఉల్లంఘన: భారతీయ నాగరిక సురక్ష సంహిత 103 వ విభాగం ప్రకారం ఏ ఇంటిని సోదా చేయాలన్నా ఇద్దరు స్వతంత్ర పంచనామా సాక్షులు ఉండాలి, యజమానికి నోటీసు ఇవ్వాలి, సోదా జాబితా ఇవ్వాలి. ఈ దృశ్యంలో ఆ పద్ధతి ఎక్కడా కనిపించడం లేదు. ఇది సోదా కాదు, అమర్చడం అనే అనుమానానికి దారితీస్తోంది. భారతీయ న్యాయ సంహిత ప్రకారం నేరం. తప్పుడు సాక్ష్యం సృష్టించడం 228, 229 విభాగాల కింద, అమాయకుడిపై తప్పుడు కేసు పెట్టడం 246 వ విభాగం కింద శిక్షార్హం. ఉన్నత న్యాయస్థానం ఆదేశాల ఉల్లంఘన: ప్రకాశ్ సింగ్ కేసులో పోలీసు వ్యవస్థ రాజకీయ జోక్యం నుండి స్వతంత్రంగా ఉండాలని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసిన ఈ కేసులు పోలీసులు పట్టించుకోకపోవడం. వాస్తవాలు తెలియాలంటే ఆ నిఘా కెమెరా దృశ్యాన్ని నిపుణుల ప్రయోగశాలకు పంపి వాస్తవాన్ని నిర్ధారించాలి. జిల్లా పోలీసు అధిపతి లేదా స్వతంత్ర ఉన్నతాధికారితో విచారణ జరిపించాలి. ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులపై శాఖాపరమైన విచారణతో పాటు, నిజమైతే నేరపూరిత కేసు నమోదు చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజం. కానీ గెలవడం కోసం రాజ్యాంగ వ్యవస్థను, ఖాకీ గౌరవాన్ని బలిపెట్టడం అనేది ప్రజాస్వామ్యానికే ప్రమాదమని ప్రజాస్వామ్యవాదులు అంటున్నారు.