ముగిసిన విజయకుమార్ నాయుడు జీవిత ప్రస్థానం
ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): ఎల్ఐసీలో సాధారణ క్లర్క్ గా ఉద్యోగాన్ని ప్రారంభించి, ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులున్న ఆధ్యాత్మిక సామ్రాజ్యాన్ని నిర్మించిన కల్కి భగవాన్ (విజయ్ కుమార్ నాయుడు – 77) కన్నుమూశారు. చెన్నై ప్రైవేట్ ఆసుపత్రిలో మంగళవారం తుదిశ్వాస విడిచారు. ఆయన కుమారుడు కృష్ణాజీతో పాటు దాసాజీలు ఆసుపత్రి వద్ద ఉన్నారు. ఆయన పార్థివదేహాన్ని బుధవారం నుండి శుక్రవారం వరకు వరదయ్యపాలెం బత్తలవల్లంలోని ఏకం ఆలయంలో భక్తుల సందర్శనార్థం ఉంచుతారు. కల్కి భగవాన్ పార్థివదేహాన్ని బుధవారం ఉదయం 11 గంటలకు తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండలం బత్తలవల్లంలోని ఏకం ఆలయానికి (గోల్డెన్ సిటీ) తరలించారు. బుధవారం ఉదయం 11.30 గంటల నుండి శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల వరకు భక్తుల సందర్శనార్థం ఉంచనున్నారు. శనివారం ఏకం ఆలయ ప్రాంగణంలోనే అంత్యక్రియలు నిర్వహించి సమాధిని నిర్మించనున్నట్లు ట్రస్ట్ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం సమాధి నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. ఉమ్మడి చిత్తూరు వరదయ్య పాలెం వద్ద రూ.200 కోట్లతో తెల్లని పాలరాతితో అద్భుతంగా ఏకం ఆలయాన్ని నిర్మించారు. 1949 మార్చి 7న తమిళనాడులోని నాథం గ్రామంలో వరదరాజులు నాయుడు, వైదర్భి దంపతులకు విజయ్ కుమార్ గా జన్మించారు. చెన్నైలో విద్యాభ్యాసం పూర్తి చేసి తొలినాళ్లలో ఎల్ఐసీలో క్లర్క్ గా, ఉపాధ్యాయుడిగా పనిచేశారు. 1977లో పద్మావతిని వివాహం చేసుకున్నారు. తర్వాత ఉద్యోగాలకు రాజీనామా చేసి ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకున్నారు. మిత్రుడు శంకర్ తో కలిసి చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం శాంతిపురంలో జీవాశ్రమం పేరుతో రెసిడెన్షియల్ పాఠశాలను ప్రారంభించారు. 1992లో తాను విష్ణుమూర్తి పదవ అవతారమైన కల్కి అవతారమని ప్రకటించుకుని కల్కి భగవాన్ గా ప్రపంచానికి పరిచయమయ్యారు. సతీమణి పద్మావతి అమ్మ భగవాన్ గా భక్తులకు సుపరిచితురాలయ్యారు. తర్వాత తమిళనాడులోని నేమం, ఆ తర్వాత వరదయ్యపాలెం గోవర్ధనపురంలో కల్కి గ్రామీణాభివృద్ధి ట్రస్ట్ పేరుతో కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఆధ్యాత్మిక బోధనలతో పాటు ధ్యానం, ముక్తి దీక్ష వంటి కార్యక్రమాలతో ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులను సంపాదించుకున్నారు. కల్కి భగవాన్ ఇక్కడ ఏకం ఆలయం నిర్మాణం ద్వారా ఆధ్యాత్మిక కేంద్రంగా మార్చడంతో ఈ ప్రాంతం ప్రపంచ చిత్రపటంలో చోటు సంపాదించుకుంది. అలాగే ఈ ప్రాంతంలో భూములకు గిరాకీ పెరిగింది. దేశాల నుంచి వచ్చే ప్రతినిధులతో ఈ ప్రాంతం పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందింది. అలాగే ఈ ప్రాంతంలో అభివృద్ధికి నోచుకోని చాలా గ్రామాలు కల్కి భగవాన్ తన సేవా సంస్థల ద్వారా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. లోకా ఫౌండేషన్, వన్నెస్ హ్యూమన్, ముక్తి వంటి అనేక ట్రస్టుల ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహించారు.
ఏకం శకానికి తెరపడిందా? – కల్కి తర్వాత ఏం జరగబోతుంది? కల్కి భగవాన్ మరణం కేవలం ఒక వ్యక్తి మరణం కాదు, ఒక శకానికి ముగింపు. తిరుపతి జిల్లా వరదయ్యపాలెంను ప్రపంచ ఆధ్యాత్మిక పటంలో నిలబెట్టిన వ్యక్తి ఆయన.
ఓ వెలుగు వెలిగి: ఒక క్లర్క్ స్థాయి నుండి రూ.వేల కోట్ల ట్రస్ట్ ను నిర్మించడం, అమెరికా, యూరప్ నుండి భక్తులను రప్పించడం ఆయన వ్యాపార చతురతకు నిదర్శనం. ఏకం ఆలయం వల్ల ఆ ప్రాంత భూముల ధరలు, ఉపాధి పెరిగాయి.
నీడ: అదే సమయంలో 2019 ఐటీ దాడులు, అక్రమాస్తుల ఆరోపణలు ఆయన ఇమేజ్ పై మచ్చలుగా మిగిలాయి. విశ్వాసం, వివాదం రెండూ కలిసే సాగింది ఆయన ప్రయాణం. తర్వాత ఏమిటి?: ఇప్పుడు అందరి దృష్టి కుమారుడు కృష్ణాజీ పైనే ఉంది. తండ్రి నిర్మించిన సామ్రాజ్యాన్ని ఆయన నిలబెట్టగలరా? సమాధి నిర్మాణంతో ఏకం క్షేత్రం మరో తిరుపతిలా మారుతుందా? అనేది వేచి చూడాలి.
