నాయుడుపేట గెలుపు సంజీవయ్యకు రాజకీయంగా ఊపిరి పోసిందా?
సూళ్లూరుపేట ఓటమిపై ఆత్మ విమర్శ చేసుకునేనా?
ప్రభాతదర్శిని, అమరావతి బ్యూరో:
రాజకీయాలలో ఎప్పుడు ఏమి జరుగుతుందో, అనుకూల, ప్రతికూల పరిస్థితులు ఎప్పుడు ఉంటాయో తెలియని విషయాలు ఏ అంచనాలకు అందవు అన్న విషయం తెలిసిందే. ఈరోజు అనుకూలంగా ఉన్న పరిస్థితులు, పరిణామాలు రేపటికి ప్రతికూలంగా మారిపోతాయని కాదనే వారు ఎవరూ ఉండరు. ఇలాంటి విషయాలు విశ్లేషణకు కూడా అందనంత దూరంగా ఉంటాయి. ఇలాంటి పరిస్థితి ఉమ్మడి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ మాజీ శాసనసభ్యుడి రాజకీయ ప్రయాణంలో చోటు చేసుకున్న వింత విశేషాలు, రాజకీయ పరిణామాలపై “ప్రభాతదర్శిని ప్రత్యేక కథనం”. సూళ్లూరుపేట మాజీ శాసనసభ్యుడు కిలివేటి సంజీవయ్య రెండోసారి శాసనసభ్యుడిగా గెలిచిన తర్వాత పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ నాయకులను, కార్యకర్తలను పట్టించుకోలేదనే ఆరోపణలు ఉన్నాయి. ఇసుక, గ్రావెల్, మట్టి మాఫియాల ఆగడాలను పట్టించుకోలేదని, నిజమైన కార్యకర్తలకు అన్యాయం చేశాడని కొందరు నాయకులు చెప్పినట్లు నడుచుకున్నారనే విమర్శలు వచ్చాయి. పార్టీ కార్యకర్తలు, నాయకులపై తప్పుడు కేసులు బనాయించాడనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఫలితంగా 2024 ఎన్నికలలో సంజీవయ్య ఓటమి చెందారు. మరోపక్క వైఎస్సార్ సీపీ కొఠారి నాయకులు తమ వ్యక్తిగత కక్షలను రాజకీయాలకు ముడిపెట్టి సంజీవయ్య ద్వారా కక్ష సాధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. తప్పుడు కేసులు కట్టించడం, వాస్తవాలు ఏమిటో తెలుసుకోకుండా పోలీసులు, రెవెన్యూ అధికారుల ద్వారా ఇబ్బంది పెట్టడం, వేధించడం వంటి చర్యలకు పూనుకోవడం కూడా సంజీవయ్యకు శాపంగా మారాయి. ముఖ్యంగా మండల స్థాయి వైఎస్సార్ సీపీ నాయకులపై తప్పుడు కేసులు పెట్టించడం, పార్టీకి సానుభూతిపరులుగా ఉన్న వ్యక్తులను లక్ష్యంగా చేసుకోవడం, తన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తుల చెప్పుడు మాటలు విని ఇతర సామాజిక వర్గాలకు చెందిన వారిపై తప్పుడు కేసులు పెట్టించడం వంటి విషయాలు సంజీవయ్య గెలుపు, ఓటమిపై తీవ్ర ప్రభావం చూపాయి. ఎన్నికల ముందు సూళ్లూరుపేటలో సంజీవయ్య అధికారాన్ని అడ్డుపెట్టుకుని కన్ను మిన్ను తెలియకుండా వ్యవహరించాడనే ఆరోపణలు ఉన్నాయి. అప్పటి ప్రతిపక్ష పార్టీ అయిన తెలుగుదేశం సంజీవయ్య అవినీతి, అవకతవకలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. మరోపక్క వైఎస్సార్ సీపీలో విభజించు పాలించు అనే రీతిలో నాయకులు, కార్యకర్తల మధ్య తీవ్ర స్థాయిలో విభేదాలు చోటు చేసుకున్నాయి. ఎన్నికల ప్రచారంలో ఈ విభేదాలు తారాస్థాయికి చేరుకుని పరస్పర దాడులు చేసుకునే వరకు వెళ్లాయి. మొదటిసారి శాసనసభ్యుడిగా గెలిచిన సంజీవయ్య రెండోసారి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీనియర్ నాయకులను, కార్యకర్తలను పట్టించుకోకుండా తన చుట్టూ ఉండే, చాడీలు చెప్పే వ్యక్తులకు, ఓటు బ్యాంకు లేని నాయకులకు, వసూళ్ల రాజకీయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం విభేదాలకు ప్రధాన కారణంగా చెబుతున్నారు. ఈ క్రమంలో వైఎస్సార్ సీపీ నాయకత్వం ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఎవరికి వారే యమునా తీరే అన్న రీతిలో పార్టీ పరిస్థితి దాపురించింది. ఈ నేపథ్యంలో స్థానిక ఎన్నికలు రావడంతో వైఎస్సార్ సీపీ పరిస్థితి ముందు నుయ్యి, వెనక గొయ్యిగా మారింది. అయితే నాయుడుపేట మున్సిపాలిటీ ఓసీ మహిళలకు కేటాయించడం, వైఎస్సార్ సీపీ చైర్ పర్సన్ అభ్యర్థిగా తంబిరెడ్డి రాజేశ్వరమ్మ తెరపైకి రావడం సంజీవయ్యకు కలిసొచ్చిన అదృష్టంగా చెప్పవచ్చు. నియోజకవర్గ కేంద్రమైన సూళ్లూరుపేటను పట్టించుకోకుండా కేవలం నాయుడుపేట మున్సిపాలిటీ మాత్రమే ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం గమనార్హం. ఇక్కడ బలమైన రెడ్డి సామాజిక వర్గ నాయకులు, ప్రజలతో మమేకమైన విధానం, వివాదరహితులుగా ఉన్న అభ్యర్థి కుటుంబీకులు ఉండటం వైఎస్సార్ సీపీకి పెద్ద కలిసొచ్చిన అంశంగా మారింది. దీనిని సంజీవయ్య తనకు అనుకూలంగా మలుచుకుని చైర్ పర్సన్ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా రాజకీయ పావులు కదపడంతో విజయం కలిసి వచ్చింది. వైఎస్సార్ సీపీని అణచివేయాలని, చైర్ పర్సన్ విజయం కోసం కృషి చేస్తున్న నాయకులపై తప్పుడు కేసులు పెట్టించే ప్రయత్నం చేయడం, పోలీసులు మితిమీరిన ధోరణితో వ్యవహరించడం, కామిరెడ్డి రాజారెడ్డి లాంటి వ్యక్తులపై తప్పుడు కేసులు కట్టించే ప్రయత్నంలో విఫలం కావడం వంటి అంశాలు సంజీవయ్య మీద ఉన్న రాజకీయ వ్యతిరేకతను గాలిలో కొట్టుకుపోయేలా చేశాయి. ఫలితంగా సంజీవయ్య పేరు వైఎస్సార్ సీపీలో మారుమ్రోగింది. రానున్న ఎన్నికలలో తన రాజకీయ భవితవ్యం ఏమిటనే ఆలోచన తొలగిపోయింది. అయితే ఒక్క మున్సిపాలిటీ విజయంతో గత మరకలన్నీ తొలగిపోయాయా అనేదే ఇప్పుడు సూళ్లూరుపేటలో చర్చనీయాంశంగా మారింది. రానున్న ఎన్నికలలో సంజీవయ్య గతంలో చోటు చేసుకున్న పొరపాట్లను, గ్రహపాట్లను సరిచేసుకుని పార్టీ అభివృద్ధికి, పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేస్తారా, లేదా కొఠారి నాయకులను మరింతగా ప్రోత్సహించి తన రాజకీయ భవిష్యత్తును రెండోసారి ఓటమి చెందిన విధంగా తయారు చేసుకుంటారా అనేది ప్రస్తుతం జరుగుతున్న పెద్ద చర్చగా చెప్పవచ్చు.