ప్రభాతదర్శిని, తిరుపతి: న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా స్వచ్ఛ సర్వేక్షణ్ 2025-26 జాతీయ పురస్కారాన్ని మంత్రి నారాయణ, ప్రధాన కార్యదర్శి సురేష్ కుమార్, తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్. జయకృష్ణ బుధవారం అందుకున్నారు. కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఈ సర్వేలో తిరుపతికి వరుసగా నాల్గవసారి కూడా జాతీయ స్థాయిలో అవార్డు దక్కింది. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ జాతీయ పురస్కారాన్ని అందుకోవడం ఎంతో ఆనందంగా ఉందని, ఈ విజయం నగర ప్రజల సహకారం, పారిశుద్ధ్య కార్మికుల కష్టానికి, అధికారుల సమష్టి కృషి వల్లే దక్కిందని తెలిపారు. భవిష్యత్తులో నగరాన్ని మరింత సుందరంగా, శుభ్రంగా ఉంచేందుకు సహకరించాలని పిలుపునిచ్చారు. ఇంటింటి చెత్త సేకరణ, మరుగుదొడ్ల నిర్వహణ, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, డంపింగ్ యార్డుల్లో చెత్త నిల్వల్ని తగ్గించడం, ప్రభుత్వ గోడలపై బొమ్మలు, సుందరీకరణ, వ్యర్థాల నుంచి పరికరాల తయారీ, ఈ-వేస్ట్ సేకరణ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని స్వచ్ఛత పోటీల్లో అధికారులు చేసిన కృషి ఫలితంగా ఈ అవార్డు దక్కింది. రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకోవడం తమ బాధ్యత మరింత పెంచిందని కమిషనర్ జయకృష్ణ చెప్పారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ శారదా దేవి, డి.ఈ. రమణ, మస్తాన్ తదితరులు పాల్గొన్నారు.