• అల్లూరు రూపురేఖలు మారుస్తాం, కూటమి అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించండి: మంత్రి నారాయణ పిలుపు
  • అల్లూరు బాధ్యత నాదే, సకల మౌలిక సదుపాయాలతో ఆదర్శంగా తీర్చిదిద్దుతాం: మంత్రి నారాయణ
  • 2028 నాటికి నెల్లూరుతో సమానంగా అల్లూరు అభివృద్ధి: మంత్రి నారాయణ భరోసా
  • అల్లూరుకు ఇప్పటికే 47 కోట్ల నిధులు, నెలకు ఒకసారి నేనే వచ్చి పర్యవేక్షిస్తా: మంత్రి నారాయణ
    ప్రభాతదర్శిని అల్లూరు – ప్రతినిధి: అల్లూరు నగర పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం కూటమి చైర్మన్ అభ్యర్థి తోటకూర సునీల్ కుమార్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని రాష్ట్ర మంత్రి నారాయణ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అల్లూరు తెలుగుదేశం కార్యాలయంలో శాసనమండలి సభ్యుడు బీద రవిచంద్ర, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్, కావలి శాసనసభ్యురాలు కావ్య కృష్ణారెడ్డిలతో కలిసి నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు తానే స్వయంగా ప్రతి వార్డులో పర్యటిస్తూ ఎన్నికల ప్రచారాన్ని ముందుండి నడిపిస్తానని స్పష్టం చేశారు. అల్లూరు అభివృద్ధికి ఇప్పటికే 47 కోట్ల నిధులు మంజూరు చేశామని, 2028 జూన్ నాటికి నాణ్యమైన రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, పార్కులు, పాఠశాలలు వంటి సకల మౌలిక సదుపాయాలతో నెల్లూరుతో సమానంగా అల్లూరును కూడా సమగ్రాభివృద్ధి చేస్తామని భరోసా ఇచ్చారు. అంతేకాకుండా నెలకు ఒకసారి కచ్చితంగా అల్లూరుకు వచ్చి పనులను పర్యవేక్షిస్తానని హామీ ఇచ్చిన మంత్రి, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి కూటమి అభ్యర్థిని చారిత్రాత్మక మెజారిటీతో గెలిపించాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.