- నెల్లూరు గ్రంథాలయాన్ని పరిశీలించిన మంత్రి నారాయణ
- పుస్తకాలతో పాటు డిజిటల్ వ్యవస్థ రెండింటికీ వర్కౌట్ చేయమన్నాం
- నెల్లూరు జిల్లా గ్రంథాలయానికి అనుబంధంగా 61 శాఖలు ఉన్నాయి
- కొత్త భవన నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని సూచన
ప్రభాతదర్శిని, నెల్లూరు – ప్రతినిధి: నెల్లూరు నగరంలోని స్టోన్ హౌస్ పేట గ్రంథాలయాన్ని మంత్రి నారాయణ ప్రత్యక్షంగా పరిశీలించారు. 1952లో ఏర్పాటైన ఈ గ్రంథాలయం సుమారు 120 ఏళ్లకు పైగా పురాతన నిర్మాణంతో కూలిపోయే స్థితికి చేరడం, ఇటీవల పెచ్చులు ఊడిపడటంతో భవన పరిస్థితిపై మంత్రి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా గ్రంథాలయ కార్పొరేషన్ చైర్ పర్సన్ శాంతికుమారి, కమిషనర్, మేయర్ అభ్యర్థి విజేతతో కలిసి పలు అంశాలపై చర్చించినట్లు మంత్రి నారాయణ తెలిపారు. జిల్లాలో మున్సిపాలిటీలు, పంచాయతీలలో గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3లుగా ఈ గ్రంథాలయానికి అనుబంధంగా మొత్తం 61 శాఖలు ఉన్నాయన్నారు. ఇక్కడ పోటీ పరీక్షల కోసం చదివే విద్యార్థుల సంఖ్య పెరుగుతుండగా, గత ఏడాది వివిధ పోటీ పరీక్షల్లో 41 మంది అభ్యర్థులు సెలెక్ట్ అయ్యారని, వీరిలో 22 మంది టీచర్లు, 17 మంది పోలీసులు, ఇద్దరు గ్రూప్ 2, ముగ్గురు ఎస్ ఎస్ సి కి ఎంపికయ్యారని వెల్లడించారు. చైర్ పర్సన్ అభ్యర్థన మేరకు డెమాలిషన్ స్టేజ్ కు చేరిన భవనాన్ని పరిశీలించామని, దీన్ని కూల్చివేయాలా లేక వినియోగించవచ్చా అనే దానిపై రోడ్లు మరియు భవనాల శాఖ అధికారులు స్ట్రెంత్ స్టడీ చేసి సర్టిఫై చేయాలని ఆదేశించామన్నారు. గూడూరు, కావలి మున్సిపల్ ఎన్నికల తర్వాత తనిఖీ చేస్తారని, భవనం పనికిరాని పక్షంలో డెమాలిష్ చేసి వెనుక వైపు అసంపూర్తిగా ఉన్న స్ట్రక్చర్ ను తక్షణమే పూర్తి చేయాలని సూచించారు. ప్రతి ఒక్కరూ పుస్తకాలతో పాటు చరిత్రను తెలుసుకుని మంచిని తీసుకుని చెడును పక్కన పెట్టగలగాలని, నేటి యువత అంతా డిజిటల్ వైపు ఉన్నందున పుస్తకాలతో పాటు గ్రంథాలయంలో డిజిటలైజేషన్ వ్యవస్థను కూడా అభివృద్ధి చేయాలని ఆదేశించినట్లు మంత్రి నారాయణ తెలిపారు. ఈ కార్యక్రమంలో మేయర్ అభ్యర్థి విజేత రూప్ కుమార్ యాదవ్, కమిషనర్ నందన్, మాజీ జెడ్పిటిసి విజేత రెడ్డి, 16వ డివిజన్ కార్పొరేటర్ కమ్మ కళ్యాణి, పలువురు కార్పొరేటర్లు, గ్రంథాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
