ప్రభాతదర్శిని, అమరావతి – ప్రతినిధి: అలలతో పోరాటం.. ఆటుపోట్లతో సహవాసం.. ప్రాణాలను పణంగా పెట్టి సాగించే వేట.. రెక్కల కష్టాన్నే నమ్ముకుని జీవించే గంగపుత్రుల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర వ్యవసాయ, పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని మత్స్యకారులు, ఆక్వా రైతులు, మత్స్యరంగంపై ఆధారపడిన కుటుంబాలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రానికి ఉన్న 1053 కిలోమీటర్ల సముద్ర తీరం అపారమైన మత్స్య సంపదకు నిలయమని, లక్షలాది కుటుంబాలకు జీవనాధారమని చెప్పారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మత్స్యకారుల సంక్షేమం, ఆక్వా రంగ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు.
వేట నిషేధ సమయంలో రూ.268.60 కోట్ల ఆర్థిక భరోసా: వేట నిషేధ కాలంలో ఉపాధి కోల్పోయే మత్స్యకారులకు గతంలో రూ.10 వేలుగా ఉన్న సహాయాన్ని రూ.20 వేలకు పెంచామని మంత్రి తెలిపారు. మత్స్యకారుల సేవలో పథకం ద్వారా 2026-27లో తొలి విడతగా 128388 కుటుంబాలకు రూ.256.776 కోట్లు విడుదల చేయగా, రెండో విడతలో మరో 5910 కుటుంబాలకు రూ.11.82 కోట్లు మంజూరు చేశామన్నారు. మొత్తంగా 134298 కుటుంబాలకు రూ.268.60 కోట్ల మేర ఆర్థిక సహాయం అందించేలా చర్యలు చేపట్టామని వివరించారు. సంప్రదాయ మత్స్యకారుల హక్కులను దెబ్బతీసిన జీవో 217ను రద్దు చేసి సహకార సంఘాల ప్రయోజనాలను పరిరక్షించామని చెప్పారు.
ఆక్వా రైతులకు విద్యుత్ రాయితీ: రాష్ట్రంలో సుమారు 2.16 లక్షల మంది రైతులు 5.79 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు చేస్తున్నారని మంత్రి తెలిపారు. అర్హులైన నమోదిత రైతులకు జోన్, నాన్ జోన్ పరిమితులతో సంబంధం లేకుండా యూనిట్ విద్యుత్‌ను రూ.1.50కే అందించే నిర్ణయం తీసుకున్నామన్నారు. మత్స్యకారుల పడవలకు లీటరు డీజిల్‌పై రూ.9 రాయితీ అందిస్తున్నామని, 2026-27 బడ్జెట్‌లో ఇందుకోసం రూ.52 కోట్లు కేటాయించామని చెప్పారు. 200 యాంత్రిక పడవలను 60 శాతం రాయితీతో అందించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించిన నిర్ణయాన్ని కార్యరూపంలోకి తీసుకొచ్చే దిశగా చర్యలు చేపడుతున్నామన్నారు.
ప్రధానమంత్రి మత్స్య సంపద యోజనతో అభివృద్ధి: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద రాష్ట్రంలో రూ.2328.89 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ఆమోదం లభించిందని మంత్రి తెలిపారు. ఇందులో కేంద్ర ప్రభుత్వ వాటా రూ.681.38 కోట్లని చెప్పారు. పథకంలోని 41 రకాల కార్యక్రమాల ద్వారా 523269 యూనిట్లు మంజూరు కాగా, 458139 యూనిట్ల అమలు ప్రారంభమైం దన్నారు. మత్స్య ఉత్పత్తుల నిల్వ, రవాణా, మార్కెటింగ్ కోసం 3 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు, 16 కోల్డ్ స్టోరేజీ, ఐస్ ప్లాంట్లు, 5 మేత తయారీ ప్లాంట్లు, ఒక సమగ్ర ఆక్వా పార్కు వంటి ప్రాజెక్టులకు ఆమోదం లభించిందన్నారు.
చిన్న మత్స్య పరిశ్రమలకు రూ.2 కోట్ల వరకు గ్రాంట్: ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహ యోజన కింద దేశవ్యాప్తంగా రూ.6 వేల కోట్ల అంచనా వ్యయంతో మత్స్యరంగ అభివృద్ధికి ప్రోత్సాహం అందిస్తున్నారని మంత్రి తెలిపారు. అర్హత కలిగిన సూక్ష్మ పరిశ్రమలకు 25 శాతం లేదా గరిష్ఠంగా రూ.35 లక్షలు, ఎస్సీ, ఎస్టీ, మహిళల యాజమాన్యంలోని సూక్ష్మ పరిశ్రమలకు 35 శాతం లేదా రూ.45 లక్షల వరకు, చిన్న పరిశ్రమలకు కేటగిరీని బట్టి రూ.75 లక్షల నుంచి రూ.కోటి వరకు, మత్స్య సహకార సంఘాలు, స్వయం సహాయక సంఘాల సమాఖ్యలు, మత్స్య రైతు ఉత్పత్తిదారుల సంస్థలకు గరిష్ఠంగా రూ.2 కోట్ల వరకు గ్రాంట్ పొందే అవకాశం ఉందని వివరించారు.
మత్స్యకారుల ప్రాణాలకు బీమా భద్రత: వేట సమయంలో మరణించిన మత్స్యకారుల కుటుంబాలకు రూ.10 లక్షల వరకు ఎక్స్‌గ్రేషియా అందించే విధానం అమల్లో ఉందన్నారు. 2026-27లో 284888 మంది మత్స్యకారులకు గ్రూప్ ప్రమాద బీమా రక్షణ కల్పించేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు. ప్రమాద మరణం లేదా పూర్తిస్థాయి శాశ్వత వైకల్యానికి రూ.5 లక్షలు, పాక్షిక శాశ్వత వైకల్యానికి రూ.2.50 లక్షల వరకు బీమా ప్రయోజనం లభిస్తుందన్నారు. గోదావరి, కృష్ణా డెల్టాలు, కోరింగ మడ అడవులు, పులికాట్, కొల్లేరు సరస్సులు మత్స్య సంపద వృద్ధికి కీలకమని, మత్స్యరంగాన్ని లాభసాటిగా తీర్చిదిద్ది ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అగ్రగామిగా నిలబెడతామని మంత్రి స్పష్టం చేశారు.