విశ్లేషకులు: నన్నూరు శ్రీనివాసరావు, (సీనియర్ జర్నలిస్ట్, నెల్లూరు)

కొణిదెల కళ్యాణ్ బాబు అలియాస్ పవన్ కళ్యాణ్ – మెగా కుటుంబంలో పుట్టి, అన్నయ్య చిరంజీవి నీడలో కాకుండా తనదైన శైలితో హీరోగా ఎదిగి, ఆ ఇమేజ్ తోనే రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి. ఆయన ప్రజా జీవితంలో ఉన్నాడు కాబట్టే, ఆయన వ్యక్తిగత జీవితం ప్రజా చర్చ అవుతోంది. పవన్ జీవితంలో మూడు వివాహాలు జరిగాయి. అవి ఆయన వ్యక్తిగత నిర్ణయాలే అయినా, ప్రత్యర్థులు ఎన్నికల సమయంలో “మూడు పెళ్లిళ్లు” అని ప్రస్తావించి, “కుటుంబాన్ని నడపలేని వ్యక్తి రాష్ట్రాన్ని ఎలా నడుపుతాడు?” అని విమర్శించారు. దానికి పవన్ అన్ స్టాపబుల్ షోలో – “నేను ఒకేసారి ముగ్గురిని పెళ్లి చేసుకోలేదు, విడాకుల తర్వాతే మళ్లీ పెళ్లి చేసుకున్నాను, నా బంధాలు అనుకూలత లేకపోవడం వల్లే విడిపోయాయి” అని సూటిగా సమాధానం చెప్పాడు. దాచుకోవడం కంటే నిజం చెప్పడమే ఆయనకు ప్లస్ అయ్యింది.

తాజాగా మూడో వివాహం రద్దుపై వచ్చిన సంయుక్త ప్రకటన – “మేము స్నేహితులుగా ఉంటాం, పిల్లలకు మంచి తల్లిదండ్రులుగా ఉంటాం” – అందరినీ ఒకే ప్రశ్న అడిగేలా చేసింది. మంచి భార్యాభర్తలుగా ఉండలేని వారు, మంచి స్నేహితులుగా ఎలా ఉండగలరు? భార్యాభర్తల బంధంలో అంచనాలు, బాధ్యతలు, అహం ఉంటాయి, స్నేహితుల బంధంలో అవి తక్కువ. అందుకే విడిపోయిన తర్వాతే కొందరు మంచి స్నేహితులుగా మారగలుగుతారని చెబుతారు, కానీ భార్యాభర్తలుగా ఉన్నప్పుడు లేని పరిణతి, స్నేహితులుగా మారిన తర్వాత వస్తుందా? అనేదే సవాలక్ష ప్రశ్న. ఇది సినిమాలపై పెద్దగా ప్రభావం చూపలేదు – ప్రేక్షకుడు థియేటర్ కు వచ్చేది ఆయన నటన కోసం, స్క్రీన్ ఇమేజ్ కోసం. రాజకీయాలపై మాత్రం మూడు కోణాలు కనిపిస్తాయి – ప్రభావం పడదు, ఎందుకంటే 2014 నుంచి 2024 వరకు ఎన్ని విమర్శలు వచ్చినా 2024 ఎన్నికల్లో జనసేన 100% స్ట్రైక్ రేట్ తో గెలిచింది, ప్రజలు ఓటు వేసేది పవన్ పెళ్లికి కాదు, ఆయన నిజాయితీకి, పోరాటానికి; కొంత ప్రభావం పడుతుంది, ఎందుకంటే యువత, మహిళా ఓటర్లలో కొంతమంది “పవన్ కుటుంబ విలువలకు ప్రాధాన్యం ఇవ్వడం లేదా?” అని ప్రశ్నించవచ్చు; సానుభూతి పెరుగుతుంది, ఎందుకంటే “ఇంత పెద్ద స్టార్ అయినా, డిప్యూటీ సీఎం అయినా, వ్యక్తిగత జీవితంలో ఎన్ని బాధలు పడుతున్నాడో” అని అభిమానుల్లో సానుభూతి పెరుగుతుంది. అంటే వ్యక్తిగత జీవితం తాత్కాలికంగా చర్చకు వస్తుంది, కానీ శాశ్వతంగా ప్రభావం చూపదు. ఆంధ్రాలో తెలుగు ప్రజలు చాలా వరకు స్వల్ప దృష్టి గలవారు, ఆయన కుల నాయకుడిగా ఉన్నంత వరకు ఆయన కుటుంబ జీవితాన్ని, వ్యక్తిత్వాన్ని, ప్రవర్తనను పట్టించుకోరు. దీనికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి.

తల్లిదండ్రులు విడిపోతే పిల్లల్లో భయం, అభద్రతా భావం వస్తుంది, స్కూల్లో “మీ అమ్మా నాన్న విడిపోయారా?” అని అడిగితే సమాధానం చెప్పలేక ఇబ్బంది పడతారు, పెద్దయ్యాక పెళ్లి అంటే భయం ఏర్పడుతుంది, ఇది ఏ సెలబ్రిటీ పిల్లలకైనా ఒకటే. అయితే పవన్ కు అనారోగ్యం చేసినప్పుడు, రష్యాలో పుట్టి, విదేశాల్లో పెరిగి, పుట్టుకతో క్రిస్టియన్ అయిన అన్నా, అన్నా లెజ్నేవా నుంచి అన్నా కొణిదెలగా మారి, కాలినడకన తిరుమలకు వెళ్లి తలనీలాలు సమర్పించింది – తలనీలాలు అంటే అహాన్ని వదులుకోవడం, “స్వామీ, నా అహాన్ని తీసుకో, నా భర్తను కాపాడు” అని వేడుకోవడం, అది మతం కాదు, ప్రేమ. అంత ప్రేమ ఉన్నవారు ఎందుకు విడిపోతున్నారు? సమాధానం ఒక్కటే – ప్రేమ ఉండడం వేరు, కలిసి బతకడం వేరు. కానీ జీవిత చరమాంకంలో ఇరువురికి ఎవరో ఒకరు తోడు నీడగా ఉండాలి. ఆ వయసులో వీళ్లకు తగిన వాళ్లు ఉండకపోవచ్చు, అప్పటి వీరి జీవన పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు, భవిష్యత్తును ముందుగా ఊహించడం ఎవరికైనా కష్టమే. ఆ కష్టాన్ని అధిగమించుకునేందుకు ఇప్పుడు తీసుకున్న నిర్ణయాలను మరొకసారి పునః పరిశీలన చేసి జీవించడం ద్వారా వివాహ బంధాలు ప్రతిష్టాత్మకంగా, బలంగా, సమాజానికి ఆదర్శవంతంగా ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ ఒక్క అంశంలో ఇరువురు ఆలోచించగలిగితే, సమాజంలో వారి గౌరవం పెరగడంతోపాటు పిల్లల భవిష్యత్తుకు భరోసా ఇచ్చిన వారవుతారు. అలాగే జీవిత చరమాంకంలో వీరు శేష జీవితం సంతోషంగా ఉంటుందని భావించినప్పుడే, ఇలాంటి అర్థం పర్థం లేని చర్చలు, వ్యక్తిగత అంతర్ జీవితంపై విశ్లేషణకు చోటు ఉండదు. ప్రజా ప్రతినిధిగా, డిప్యూటీ సీఎంగా ప్రజా జీవనంలో పవన్ కళ్యాణ్ ఉన్నారు కనుకనే, ప్రజా జీవితం అనే కోణంలో జర్నలిస్టుగా దీనిని విశ్లేషించే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ ప్రజా జీవితంలో లేనప్పుడు, దీనిని విశ్లేషించే అవకాశమే లేదని భావించాలి. రాజ్యాంగం ద్వారా సంక్రమించిన పత్రికా స్వేచ్ఛ ద్వారా ఈ విశ్లేషణను రాయడం జరిగింది.

గమనిక: ఈ విశ్లేషణ పవన్ కళ్యాణ్ వివిధ సందర్భాలలో స్వయంగా చెప్పిన పబ్లిక్ ప్రకటనలు, మీడియాలో వచ్చిన వార్తల ఆధారంగానే రాయబడింది. ఈ విశ్లేషణ ద్వారా పత్రికా స్వేచ్ఛను కాలరాయడం గానీ, పత్రికా స్వేచ్ఛ పేరుతో ఎవరి పరువు ప్రతిష్టలకు భంగం కలిగించాలని ఉద్దేశం గానీ విశ్లేషకులకు లేదని భావించాలి. ప్రజాజీవితంతో ముడిపడిన వ్యక్తులకు సంబంధించిన అంశాలను ప్రజల ముందుకి తీసుకొని రావడం ద్వారా వాళ్లలో నెలకొన్న అపోహాలను తొలగించేందుకు మాత్రమే ఈ విశ్లేషణాన్ని భావించగలరు.