–గెలిచి ఓడిన అధికార పార్టీ – చైర్ పర్సన్ ఓటమికి బాధ్యులు ఎవరు?
ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): నాయుడుపేట మున్సిపల్ ఎన్నికలు రాష్ట్ర రాజకీయాల్లోనే పెద్ద చర్చకు దారితీశాయి. అంగట్లో అన్నీ ఉన్నాయి… అల్లుడు నోట్లో శని అన్నట్లు అయింది కూటమి పరిస్థితి. కౌన్సిలర్లు ఎక్కువ మంది గెలిచినా, అసలైన కుంభస్థలం లాంటి చైర్ పర్సన్ పీఠం చేజారిపోయింది. అధికార పార్టీకి ఇది మింగుడు పడని ఓటమి. ప్రతిపక్షానికి ఇది ఊహిం చని విజయం. మొత్తం 32 వార్డులకు జరిగిన ఈ ఎన్నికల్లో 72.77 శాతం పోలింగ్ నమోదైంది. ప్రజలు ఎంతో ఉత్సా హంతో ఓటు వేశారు. చెల్లని ఓట్లు 561, నోటాకు 179 ఓట్లు పడ్డాయి. కౌన్సిలర్ల ఫలితం చూస్తే కూటమిదే పైచేయిగా కనిపించింది. టీడీపీ 14 స్థానాలు, బీజేపీ 4 స్థానాలు గెలుచుకున్నాయి. అంటే కూటమికి మొత్తం 18 మంది కౌన్సిలర్లు ఉన్నారు. వైఎస్ ఆర్సీపీ 13 స్థానాల్లో, స్వతంత్ర అభ్యర్థి ఒక స్థానంలో గెలిచారు. లెక్క ప్రకారం చూస్తే చైర్ పర్సన్ పీఠం కూటమిదే కావాలి. కానీ అసలు కథ చైర్ పర్సన్ ఎన్నిక దగ్గరే తారుమారైంది. చైర్ పర్సన్ ఎన్నికలో వైఎసఆర్సీపీ అభ్యర్థి తాంబిరెడ్డి రాజేశ్వ రమ్మ 13,787 ఓట్లతో ఘన విజయం సాధిం చారు. టీడీపీ అభ్యర్థికి 12,600 ఓట్లు మాత్రమే వచ్చాయి. 1,187 ఓట్ల మెజారిటీతో రాజేశ్వరమ్మ గెలిచారు. అంటే కౌన్సిలర్ ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేసిన ఓటరు, చైర్పర్సన్ ఎన్నికల్లో మాత్రం వైఎస్ ఆర్సీపీకి ఓటు వేశాడు. ఇదే క్రాస్ ఓటింగ్. ఇదే ఇప్పుడు కూటమి నాయకులకు నిద్ర పట్టకుండా చేస్తోంది. ఈ ఓటమిని ఏ కోణంలో చూడాలి? మొదటి కోణం పొత్తు ధర్మం. అధిష్టానం చెప్పినంత సులువుగా క్షేత్రస్థాయిలో టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్య కర్తలు ఒక్కటి కాలేదు. పైనుండి పొత్తు అని చెప్పినా, కింద గ్రామాల్లో, వార్డుల్లో పాత కక్షలు, వ్యక్తిగత విభేదాలు అలాగే ఉన్నాయి. ఒకరిని ఒకరు సమన్వయం చేసుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారు. ఫలితంగా చైర్ పర్సన్ అభ్యర్థిని గెలిపించుకో లేకపోయారు.
రాజకీయ కోణం అధికార యంత్రాంగం: సహజంగా అధికార పార్టీ అంటే ప్రభుత్వ యంత్రాంగం 75 శాతం అధికార పార్టీకి సహకరి స్తుంది. నాయుడుపేటలో కూడా అదే జరిగిందని ప్రజలు చెప్పుకుంటున్నారు. కాకపోతే అధికారులు అధికార పార్టీ కండువా వేసుకోలేదు గానీ, మిగతాదంతా ఆ పార్టీ నాయకులు చేసినట్లుగానే యంత్రాంగం పనిచేసిందని అపకీర్తిని మూట కట్టుకున్నారు. ఇం దులో వాస్తవం కూడా లేకపోలేదు. ప్రతిపక్ష నాయకులను ఇబ్బం దులకు గురిచే యడం, లేనిపోని కేసులు బనాయించడం వంటి పనుల్లో తీవ్రంగా కృషి చేసి ప్రజల చీదరింపులకు గురయ్యారు. కానీ చైర్పర్సన్ గెలుపులో వారి పన్నాగాలు ఫలించలేదు.
గత రాజకీయ పరిస్థితులు:చైర్పర్సన్ పదవిని పూర్తి కాలం కాకుండానే రాజకీయ విభేదాలు ఏర్పడినప్పుడు, లేదా రాజకీయ ఫిరాయి ంపు చోటు చేసుకున్నప్పుడు అవిశ్వాస తీర్మానం పెట్టి తొల గించడం ద్వారా నేటి ప్రభుత్వం రాజకీయ సంక్షోభానికి శ్రీకారం చుట్టింది. అభివృద్ధి ఆగిపోయింది. ఈ విషయాన్ని ప్రజలు మర్చి పోలేదు. అందుకే ఈ ఎన్నికల్లో తమ తీర్పును స్పష్టంగా చెప్పారు. 19-10-2026 నాడు జరిగిన నామినేషన్ల పరిశీలన తర్వాత 166 నామినేషన్లు దాఖలు కాగా, 152 చెల్లుబాటు అయ్యాయి. అప్పటి నుండే పోటీ రసవత్తరంగా మారింది. అధికార పార్టీలో జరుగుతున్న సం’కులసమరం’, అంతర్గత యుద్ధాన్ని (కోల్డ్ వార్) ప్రతిపక్ష పార్టీ నాయకులు అంచనా వేసి చైర్పర్సన్ అభ్యర్థిని గెలిపించు కోవడంలో వేసిన ఎత్తుగడతో విజయవంతమై ఆపార్టీ అభ్యర్థి చైర్‌పర్సన్‌గా గెలుపొందారు. చైర్పర్సన్ ఎన్నిక ప్రత్యక్షం కాకుండా పరోక్ష పద్ధతిలో జరిగి ఉంటే పొత్తు ధర్మాన్ని ప్రతి ఒక్కరు పాటించి తీరాల్సిందే. కానీ ప్రత్యక్ష ఎన్నిక కావడంతో ప్రజలే నేరుగా తీర్పు ఇచ్చారు. ఇది కేవలం నాయుడుపేట సమస్య కాదు. రాష్ట్రంలో పలుచోట్ల ఇలాంటి సంఘటనలు జరిగాయి. భవిష్యత్తులో ఏపీలో కూటమి ఐక్యతపై ఈఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయో వేచి చూడా ల్సిందే. అధిక స్థానాలు గెలిచి చైర్‌పర్సన్‌ను కోల్పోవడం అంటే గెలిచి ఓడిపోవడమే అని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యాని స్తున్నారు.
