నాయుడుపేట సీఐపై విచారణ చేపట్టాలని డీజీపీకి ఎన్నికల సంఘం ఆదేశం

ప్రభాతదర్శిని, నాయుడుపేట (ప్రత్యేక ప్రతినిధి): వివాదాలకు కేంద్ర బిందువుగా ఉన్న తురక వెంకటరమణ అలియాస్ గబ్బర్ సింగ్ పనితీరుపై విచారణ జరపాలని రాష్ట్ర ఎన్నికల సంఘం డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది. నాయుడుపేట మున్సిపల్ ఎన్నికల సందర్భంగా పోలీసుల వ్యవహారశైలి తీవ్ర వివాదానికి దారితీసింది. ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించాల్సిన పోలీసులే అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్న ఆరోపణలు ఇప్పుడు రాష్ట్రస్థాయి అధికారుల దృష్టికి చేరాయి. నాయుడుపేట సీఐ తురక వెంకట రమణ వ్యవహారశైలిపై ఎన్నికైన నాయుడుపేట మున్సిపల్ చైర్ పర్సన్ తంబిరెడ్డి రాజేశ్వరమ్మ డీజీపీ, రాష్ట్ర ఎన్నికల సంఘం, మానవ హక్కుల కమిషన్ సహా పలువురు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.
పోలింగ్ నుంచి కౌంటింగ్ వరకు పోలీసుల తీరుపై ఆరోపణలు: నవంబర్ 1న జరిగిన పోలింగ్ సమయంలో పోలీసుల వ్యవహారశైలిపై వైసీపీ శ్రేణులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. సీఐ వెంకట రమణ మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యపై దాడి చేయడం, ఆయన నివాసంలో ప్రవేశించి నాయకులు, కార్యకర్తలను దుర్భాషలాడి కొట్టడం, పోలింగ్ ఏజెంట్లను బలవంతంగా బయటకు పంపించడం, కొందరిని పోలీస్ స్టేషన్ కు తరలించి నిర్బంధించడం, మరికొందరిని విధులకు హాజరు కావొద్దంటూ బెదిరించడం వంటి చర్యలకు పాల్పడ్డారని రాజేశ్వరమ్మ ఫిర్యాదులో పేర్కొన్నారు. నవంబర్ 3న జరిగిన ఓట్ల లెక్కింపు సమయంలోనూ ఏజెంట్లను బెదిరించి విధులకు ఆటంకం కలిగించారని పేర్కొన్నారు. రెండవ వార్డుకు సంబంధించి రీకౌంటింగ్ కోరేందుకు వెళ్తున్న సంజీవయ్యపై దాడి చేసి అవమానకరంగా ప్రవర్తించారని ఆరోపించారు.
కామిరెడ్డి రాజారెడ్డిపై తప్పుడు కేసు వ్యవహారం: వైసీపీ నేత కామిరెడ్డి రాజారెడ్డిపై తప్పుడు కేసు బనాయించేందుకు తురక వెంకటరమణ సినిమా స్టైల్ లో ప్రయత్నించి విఫలమయ్యారని వైసీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. పోలీసులే మద్యం బాటిళ్లను తీసుకెళ్లి రాజారెడ్డి ఇంట్లో ఉంచి, అనంతరం ఆయనపై కేసు నమోదు చేశారని ఆరోపిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీ కెమెరా దృశ్యాల్లో పోలీసుల తీరు రికార్డయిందని, వాటి ఆధారంగా విచారణ జరిపించాలని కోరుతున్నారు.
హైకోర్టును ఆశ్రయించిన నూతన చైర్ పర్సన్ రాజేశ్వరమ్మ: తురక వెంకటరమణపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో డబ్ల్యూపీ 31990/2026 పేరుతో రిట్ పిటిషన్ దాఖలైనట్లు రాజేశ్వరమ్మ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. నవంబర్ 4న రాజేశ్వరమ్మ డీజీపీ, రేంజ్ ఐజీ, మానవ హక్కుల కమిషన్, రాష్ట్ర ఎన్నికల సంఘం, తిరుపతి జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీలకు ఫిర్యాదు పంపించారు. విచారణ జరిగేంతవరకు సీఐని నాయుడుపేట నుంచి బదిలీ చేయాలని లేదా సస్పెన్షన్ ను పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. పోలీస్ స్టేషన్ సీసీ కెమెరాలు, బాడీ కెమెరా దృశ్యాలు, ఇతర ఎలక్ట్రానిక్ ఆధారాలను భద్రపరచాలని కోరారు.
ఎన్నికల సంఘం స్పందన: నవంబర్ 5న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం రాజేశ్వరమ్మ ఫిర్యాదుకు స్పందించింది. తిరుపతి జిల్లా కలెక్టర్, రాష్ట్ర డీజీపీ, తిరుపతి జిల్లా ఎస్పీకి ఫిర్యాదును పంపించి, ఆధారాలను పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించింది.
సీఐ వెంకట రమణ గత చరిత్రేంటి?: ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉన్నప్పుడు కోట, నాయుడుపేట ప్రాంతాల్లో ఎస్సైగా పనిచేస్తూ పలు వివాదాలకు కేంద్రబిందువయ్యారని స్థానికులు చెబుతున్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని తానే కోర్టులా వ్యవహరించి శిక్షలు వేశారన్న ఆరోపణలపై ఆయనపై చాలామంది ప్రైవేట్ కేసులు కూడా వేశారని సమాచారం. ఇది వైసీపీ ఆరోపణ మాత్రమే కాదు, పత్రికల్లో, జాతీయ మీడియాలో వచ్చిన వార్తల ద్వారా వివాదాలకు కేంద్ర బిందువుగా తురక వెంకటరమణకు పోలీస్ శాఖ రికార్డుల్లో చరిత్ర ఉందని చెబుతున్నారు.
అత్యంత సంచలనమైన విషయం: అత్యంత సంచలనమైన విషయం ఏంటంటే, 2026 ఏప్రిల్ లో మాచర్ల టౌన్ సీఐగా ఉన్నప్పుడు యువతి పరువు హత్య కేసులో సహకరించారన్న ఆరోపణలపై ఆయనను సస్పెండ్ చేశారని పత్రికలు రాశాయి. ఆ యువతి తండ్రి నుంచి సుమారు రూ. 6.5 లక్షలు లంచం తీసుకుని, ప్రేమ వివాహం చేసుకున్న యువతిని బలవంతంగా తల్లిదండ్రులకు అప్పగించారని, ఆ తర్వాత ఆమె హత్యకు గురైందని దర్యాప్తులో తేలిందని వార్తలు వచ్చాయి. గుంటూరు రేంజ్ ఐజీ ఆదేశాలతో ఆయనపై సస్పెన్షన్ వేటు పడింది. ఆ తర్వాత రాజధాని ప్రాంతంలో వీఆర్ లో ఉంటూ, ఎన్నికల సమయానికి నాయుడుపేట సీఐగా వచ్చారని సమాచారం. 2026 అక్టోబర్ 11న నాయుడుపేట అర్బన్ సీఐగా ఆయన బాధ్యతలు చేపట్టారని, గతంలో నాయుడుపేటలోనే ఎస్సైగా పనిచేసిన విషయం తెలిసిందే. ఇది ఒక్క నాయుడుపేట ఎన్నికల వ్యవహారం మాత్రమే కాదు, గతంలో కూడా ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొన్న అధికారే ఇక్కడికి వచ్చారన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల సమయంలో నాయుడుపేటలో నిజంగా ఏం జరిగింది? పోలీసులపై వచ్చిన ఆరోపణల్లో వాస్తవాలెంత? కామిరెడ్డి రాజారెడ్డి ఇంటి ఘటనలో సీసీ కెమెరా దృశ్యాలు ఏమి వెల్లడిస్తున్నాయి? ఈ ప్రశ్నలన్నింటికీ నిష్పక్షపాత విచారణ జరిపి, ఆరోపణలు నిర్ధారణ అయితే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపి త్వరగా సీఐ వెంకట రమణపై చర్యలు తీసుకుంటారా అన్నది ఇప్పుడు నాయుడుపేటలో చర్చనీయాంశంగా మారింది.
