అత్యాధునిక ఫుడ్ అనాలసిస్ ల్యాబ్‌ ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు
ప్రభాతదర్శిని, (తిరుపతి-ప్రతినిధి): తిరుమలలో భక్తుల నమ్మకానికి చిన్నపాటి విఘాతం కూడా కలిగించకూడదని.. వారి నమ్మకాన్ని కాపాడేలా నిరంతరం కృషి చేస్తూనే ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టీటీడీ అధికారులను ఆదేశించారు. భక్తులకు నాణ్యమైన ప్రసాదాన్ని, తాగునీటిని అందించేందుకు టెక్నాలజీని వినియోగిస్తూ చిత్తశుద్ధితో పని చేయాలని సీఎం సూచించారు. కలియుగ వైకుంఠం తిరుమలకు వచ్చే కోట్లాది మంది భక్తుల నమ్మకం, విశ్వాసాలను మరింత పెంచేలా… ఆరోగ్య భద్రతే ధ్యేయంగా టీటీడీ మరో చారిత్రాత్మక అడుగు వేసింది. స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ, FSSAI సంయుక్తంగా టీటీడీ సహకారంతో రూ.25 కోట్ల వ్యయంతో నిర్మించిన అత్యాధునిక వాటర్ – ఫుడ్ అనాలసిస్ ల్యాబ్‌ను సీఎం చంద్రబాబు శనివారం ప్రారంభించారు. దేశంలోనే ఒక ఆలయం కోసం ఏర్పాటు చేసిన మొట్టమొదటి అత్యున్నత ప్రమాణాలు కలిగిన ల్యాబ్ ఇదే కావడం విశేషమని సీఎం చంద్రబాబు ఈ సందర్బంగా అభిప్రాయపడ్డారు. ల్యాబ్ ప్రారంభోత్సవం అనంతరం ముఖ్యమంత్రి ల్యాబ్ లోని ప్రతి విభాగాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. ల్యాబ్ పనితీరు, సామర్థ్యం గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రసాదాల తయారీలో వాడే ముడి పదార్థాల నాణ్యతను ఏ స్థాయిలో విశ్లేషించవచ్చని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. 12 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో కెమికల్, మైక్రోబయాలజీ విభాగాలుగా దీనిని నిర్మించామని, ఇందులో e-tongue, e-nose వంటి అత్యాధునిక సౌకర్యాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. ఇవి ఆహార పదార్థాల రుచి, వాసనను డిజిటల్ పద్ధతిలో ఖచ్చితంగా విశ్లేషించగలవని అధికారులు సీఎంకు వివరించారు. 1981లో నీటి పరీక్షల కోసం చిన్నదిగా ప్రారంభమైన ఈ విభాగం, ఇప్పుడు నెలకు 1,000 నుండి 1,500 శాంపిళ్లను విశ్లేషించే స్థాయికి చేరడం పట్ల సీఎం సంతృప్తి వ్యక్తం చేశారు.
కల్తీ నివారణే లక్ష్యం : సీఎం ఆదేశాలు: శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో వాడే నెయ్యి, ఇతర పదార్థాల కల్తీ నివారణకు తీసుకుంటున్న చర్యలపై ముఖ్యమంత్రి ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు. కల్తీ జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారని అధికారులను ప్రశ్నించారు. 2024 నవంబరులో NDDB సంస్థ విరాళంగా అందించిన ఆధునిక GC/HPLC యంత్రాల ద్వారా నెయ్యి స్వచ్ఛతను అత్యంత శాస్త్రీయంగా ఇక్కడే నిర్ధారించవచ్చని అధికారులు వెల్లడించారు. 2025 జూలై నుంచి నెయ్యి నాణ్యతపై విస్తృత స్థాయిలో పరీక్షలు నిర్వహిస్తున్నామని, దీనివల్ల కల్తీకి ఏమాత్రం అవకాశం ఉండదని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. ముడి పదార్థాల్లో ఉండగలిగే పురుగు మందుల అవశేషాలు, యాంటీ బయోటిక్స్, లెడ్, ఆర్సినిక్ వంటి హెవీ మెటల్స్ కనుగొనే సామర్థ్యం ఉన్న పరికరాలను కూడా ఈ ల్యాబులో ఏర్పాటు చేసినట్లు అధికారులు వివరించారు.
తిరుమలలో ల్యాబ్ దేశానికే ఆదర్శం: బ్యాక్టీరియా గుర్తింపు కోసం ప్రత్యేకంగా క్లీన్ రూమ్, ఎయిర్ హ్యాండ్లింగ్ సిస్టమ్ వంటి భద్రతా ప్రమాణాలను చూసి ముఖ్యమంత్రి అభినందించారు. శ్రీవారి ప్రసాదాల పట్ల భక్తులకు ఉన్న అపారమైన నమ్మకాన్ని కాపాడటమే తమ ప్రభుత్వ ప్రథమ కర్తవ్యంగా అధికారులు పని చేయాలని స్పష్టం చేశారు. కేవలం ల్యాబ్ పరీక్షలకే పరిమితం కాకుండా, అన్నప్రసాద కేంద్రాల్లోని వంటశాలల శుభ్రతపై నిరంతర తనిఖీలు నిర్వహించి పరిశుభ్రతను నిర్ధారించాలని ఆదేశించారు. టీటీడీ తీసుకున్న ఈ చర్యలు శ్రీవారి ప్రసాదాల పట్ల మరింత నమ్మకాన్ని, విశ్వాసాన్ని పెంచాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. భక్తుల ఆరోగ్య రక్షణకు మాత్రమే కాకుండా, తిరుమలలో చేపట్టిన ఫుడ్ సేఫ్టీ చర్యలు దేశానికే ఒక ఆదర్శంగా నిలుస్తాయని ముఖ్యమంత్రి కొనియాడారు. ఈ కార్యక్రమంలో మంత్రి సత్య కుమార్ యాదవ్, టీటీడీ పాలకమండలి సభ్యులు, ఉన్నతాధికారులు, ఫుడ్ – సేఫ్టీ ల్యాబ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.