
వారంలో రోడ్‌మ్యాప్.. అఫిడవిట్‌లో స్పష్టమైన కాలపట్టిక ఇవ్వాలి…సూదలగుంట బకాయిల చెల్లింపుపై జిల్లా కలెక్టర్ సమీక్ష ప్రభాతదర్శిని (తిరుపతి-ప్రతినిధి): సూదలగుంట షుగర్స్ యూనిట్–1 శ్రీకాళహస్తి, యూనిట్–2 పొదలకూరు పరిధిలో చెరకు రైతులకు చెల్లించాల్సిన బకాయిలను నవంబర్ 30లోగా రెండు విడతల్లో చెల్లించాలని జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ ఆదేశించారు. సోమవారం మద్యాహ్నం స్థానిక కలెక్టరేట్ మినీ విసి హాల్ నందు సూదలగుంట షుగర్స్ యూనిట్–1 శ్రీకాళహస్తి, యూనిట్–2 పొదలకూరు పరిధిలో చెరకు రైతులకు చెల్లించాల్సిన బకాయిలపై జిల్లా కలెక్టర్ డా. ఎస్.వెంకటేశ్వర్, జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు, జాయింట్ కలెక్టర్ ఆర్.గోవిందరావు, నెల్లూరు అసిస్టెంట్ కేన్ కమీషనర్ జాన్ విక్టర్, సూదలగుంట కెన్ షుగర్ ఫ్యాక్టరీ యజమాని జయరాం చౌదరి లతో కలసి రైతులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, మౌఖిక హామీలతో కాకుండా బకాయిల చెల్లింపునకు సంబంధించిన పూర్తి ప్రణాళికను లిఖితపూర్వకంగా సమర్పించాలని స్పష్టం చేశారు. మొత్తం బకాయిలను ఎన్ని విడతల్లో, ఏ తేదీల్లో, ఏ మొత్తంలో చెల్లిస్తారో స్పష్టంగా పేర్కొంటూ రోడ్‌మ్యాప్ సిద్ధం చేయాలని సూచించారు. నోటరైజ్డ్ అఫిడవిట్‌లో 60 రోజుల్లోగా మొత్తం బకాయిల చెల్లింపు పూర్తి చేస్తామని స్పష్టంగా పేర్కొనాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. అఫిడవిట్‌తో పాటు యూనిట్–1, యూనిట్–2 వారీగా, రైతులు, హార్వెస్టింగ్ కార్మికులు, ఇతర బకాయిదారులకు చెల్లించాల్సిన మొత్తాల పూర్తి వివరాలను సమర్పించాలని సూచించారు. యూనిట్‌ల వారీగా రైతులకు, హార్వెస్టింగ్ కార్మికులకు, ఇతర వర్గాలకు చెల్లించాల్సిన బకాయిల పూర్తి వివరాలను అధికారులు, యాజమాన్య ప్రతినిధుల నుంచి జిల్లా కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. రైతులకు చెల్లించాల్సిన మొత్తాలను స్పష్టంగా విభజించి, ఏ యూనిట్‌కు ఎంత బకాయి ఉంది, రైతులకు ఎంత, హార్వెస్టింగ్ కార్మికులకు ఎంత, ఇతర బకాయిలు ఎంత ఉన్నాయనే వివరాలతో కూడిన అధికారిక నివేదికను సమర్పించాలని సూచించారు. రైతులకు తమ బకాయిలు అందడం అత్యంత ప్రధానమని, యాజమాన్యం ఎదుర్కొంటున్న ఆర్థిక, ఆస్తుల సంబంధిత సమస్యల కంటే రైతుల బకాయిల పరిష్కారానికి స్పష్టమైన చర్యలు అవసరమని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. నవంబర్ 30, 2026ను తుది గడువుగా పరిగణించి, ఆ తేదీలోగా రెండు విడతల చెల్లింపులు పూర్తి చేయాలన్నారు. అక్టోబర్ 31లోపు తొలి విడత చెల్లింపునకు అవకాశం ఉంటే వెంటనే చెల్లింపులు ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ సూచించారు. రైతుల సమస్యకు శాశ్వత పరిష్కారం లభించేలా సంబంధిత అధికారులు, యాజమాన్యం సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు. రైతులు ఇప్పటికే దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్నందున ఇకపై బకాయిల చెల్లింపులో జాప్యం లేకుండా లిఖితపూర్వక హామీలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలన్నారు. వారంలోగా రోడ్‌మ్యాప్, పూర్తి బకాయిల వివరాలతో కూడిన అధికారిక లేఖను, నిర్ణీత గడువులో నోటరైజ్డ్ అఫిడవిట్‌ను సమర్పించాలని జిల్లా కలెక్టర్ యాజమాన్యానికి స్పష్టం చేశారు. రైతుల బకాయిల చెల్లింపు పురోగతిని సంబంధిత అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. సూదలగుంట షుగర్ ఫ్యాక్టరీ యజమాని మాట్లాడుతూ, యాజమాన్య ప్రతినిధులు తమ ప్రయత్నాల మేరకు రైతుల బకాయిలను రెండు విడతల్లో చెల్లించే విధంగా చర్యలు చేపడతామని తెలిపారు. తొలి విడతగా రూ.15 కోట్లు, రెండో విడతగా మరో రూ.15 కోట్లు చెల్లించే అవకాశాలను పరిశీలిస్తున్నామని, అవసరమైన నిధుల సమీకరణపై చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. వీలైనంత త్వరగా, అక్టోబర్ చివరి నాటికే చెల్లింపులు చేస్తామని తెలిపారు. అదేవిధంగా, నవంబర్ 30 2026 (నిర్ణీత 60 రోజుల) వ్యవధిలో బకాయిలు చెల్లించలేని పరిస్థితి ఏర్పడితే, నెల్లూరులోని 50 ఎకరాల భూమి, శ్రీకాళహస్తిలో బ్యాంకు అటాచ్‌మెంట్లు లేని భూమిని విక్రయించి, ఆ మొత్తాన్ని బకాయిల చెల్లింపునకు వినియోగిస్తామని యాజమాన్య ప్రతినిధులు సమావేశంలో అంగీకరించారు. పొదలకూరు షుగర్ ప్లాంట్‌ను విక్రయించే ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. ప్లాంట్ యంత్రాలు, భూమికి సంబంధించి కొనుగోలుదారులతో చర్చలు జరుగుతున్నాయని, బ్యాంకు అనుమతులు, ఇతర ప్రక్రియలు పూర్తయిన అనంతరం విక్రయం ద్వారా నిధులు సమకూర్చుకునే ప్రయత్నం చేస్తున్నామని వివరించారు. ప్లాంట్ విక్రయం ద్వారా వచ్చే నిధుల్లో ముందుగా రైతుల బకాయిలను చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇప్పటికే బ్యాంకుకు రూ.2 కోట్ల అడ్వాన్స్ చెల్లించినట్లు కూడా యాజమాన్య ప్రతినిధులు సమావేశంలో వెల్లడించారు. తదుపరి ప్రక్రియలో బ్యాంకు నుంచి అవసరమైన అనుమతులు పొందేందుకు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న రైతులు తమ బకాయిల పరిష్కారం కోసం జిల్లా యంత్రాంగం చొరవ తీసుకుని యాజమాన్యంతో సమావేశం నిర్వహించడంపై సంతృప్తి వ్యక్తం చేశారు. తమ సమస్యలను నేరుగా జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చే అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ సమావేశంలో అడిషనల్ ఎస్.పి. రవి మనోహరా చారి, రైతులు, తదితరులు పాల్గొన్నారు.
