ప్రభాతదర్శిని, నాయుడుపేట-ప్రతినిధి: మొన్నటి వరకు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అపారమైన అనుభవం సంపాదించిన తంబిరెడ్డి మోహన్ రెడ్డి, తన మాతృమూర్తి నాయుడుపేట మున్సిపల్ చైర్ పర్సన్ ఎన్నికలో పోటీ చేసే అవకాశం ఊహించని విధంగా రావడంతో రాత్రింబవళ్లు కష్టించి తన మాతృమూర్తి తంబిరెడ్డి రాజేశ్వరమ్మను చైర్ పర్సన్ చేసుకోగలిగారు. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం. రాజకీయ విభేదాలు, పొరపొచ్చులు చోటు చేసుకోవడం ఉంటుంది. ఈ క్రమంలో ఏదో ఒక సందర్భంలో ఆయా విభేదాలు బయటపడటం, రాజకీయ కోణంలో అవి పెద్దవి కావడం జరుగుతూ ఉంటుంది. రాజకీయ విభేదాలు పెద్దవి అవుతాయని గానీ, కావని గానీ వీటిని ఎవరూ ఖండించలేరు. కొందరైతే వీటికి ఆజ్యం పోసి చిన్నవి పెద్దవిగా చేస్తారన విషయం తెలిసిందే. నాయుడుపేటలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో నువ్వా నేనా అనే తీరులో అధికార, ప్రతిపక్ష పార్టీల రాజకీయ ఎత్తుగడలు, రాజకీయ ఆవేశాలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం, తప్పుడు కేసులు పెట్టుకోవడం, పోలీసుల ద్వారా వేధించడం వంటి అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. వీటినన్నిటికీ స్వస్తి పలుకుతూ తంబిరెడ్డి మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారని చెప్పవచ్చు. ఎన్నికల సమయంలోను, ఎన్నికల అనంతరం కూడా ఎవరినీ పల్లెత్తు మాట అనకుండా మోహన్ రెడ్డి శుక్రవారం జరిగిన కౌన్సిలర్ల పరిచయ వేదికలో వ్యూహాత్మకంగా వ్యవహరించి పరిణితి చెందిన రాజకీయవేత్తగా గెలిచిన వాళ్లే, ఓటమి చెందిన వారు మనవారే అంటూ హుందాగా వ్యాఖ్యానించడం, ఆ వ్యాఖ్యానంలో మనకంటే కొద్దిగా వెనుకబడిన వారు అని సంబోధించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయంగా మారింది. అదేవిధంగా 74 సంవత్సరాల తన మాతృమూర్తి చైర్ పర్సన్ గా ఎన్నికవ్వడం, నాయుడుపేట సమగ్ర అభివృద్ధికి అందరం కలిసికట్టుగా పనిచేద్దామని పిలుపునివ్వడం ఆయన రాజకీయ పరిణితికి నిదర్శనంగా వ్యాఖ్యానించవచ్చు. తద్వారా తన తండ్రి తంబిరెడ్డి జనార్దన్ రెడ్డి రాజకీయ వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నారని చెప్పవచ్చు. తంబిరెడ్డి జనార్దన్ రెడ్డి గతంలో టీడీపీలో ఉన్నప్పుడు గానీ, ప్రస్తుతం వైసీపీలో ఉన్నప్పుడు గానీ, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఉన్నప్పుడు గానీ ఆయన హుందాగా వ్యవహరించి రాజకీయాలకు అతీతంగా అందరి వాడిగా ఖ్యాతిని పొందారని చెప్పవచ్చు. తండ్రి లక్షణాలను పుణికిపుచ్చుకున్న మోహన్ రెడ్డి తన మొదటి రాజకీయ ప్రసంగంలోనే హుందాగా వ్యవహరించడంపై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.