మహిళల భాగస్వామ్యమే నిజమైన అభివృద్ధి
ముగింపు సదస్సులో సీఎం చంద్రబాబు నాయుడు

ప్రభాతదర్శిని, విశాఖపట్నం – ప్రతినిధి): వేగవంతమైన అభివృద్ధి కోసం జాతీయ స్థాయిలో పెట్టుబడుల భద్రతా చట్టాన్ని తీసుకురావాలని సీఎం చంద్రబాబు కేంద్రాన్ని కోరారు. విశాఖపట్నంలో నవంబర్ 12, 13 తేదీల్లో జరిగిన 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సు శుక్రవారం ఘనంగా ముగిసింది. రెండు రోజుల్లో మొత్తం 100 ఒప్పందాలు, ప్రభుత్వ ఉత్తర్వుల ద్వారా రూ.7,25,940 కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలు వచ్చాయి. వీటి ద్వారా 1,18,612 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని అధికారులు తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలోనే ఈ ఒప్పందాలు జరిగాయి. సదస్సు ముగింపు సందర్భంగా ఒప్పందాలను శంకుస్థాపనలకు, ప్రారంభోత్సవాలకు మార్చాలని, ప్రతి పెట్టుబడికి ప్రారంభ తేదీ నిర్ణయించాలని ముఖ్యమంత్రి పారిశ్రామికవేత్తలను కోరారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ పెట్టుబడిదారులకు భద్రత ఉంటేనే పెట్టుబడులు వస్తాయని, ప్రభుత్వాలు మారినా ఒప్పందాలు కొనసాగాలని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రాల్లో అనుమతులు వేగంగా ఇవ్వడం, భూమి, మౌలిక వసతులు సమయానికి అందించడం ద్వారా పెట్టుబడిదారుల్లో నమ్మకం పెరుగుతుందని చెప్పారు. ఏకగవాక్ష విధానం ద్వారా పరిశ్రమలకు 21 రోజుల్లో అనుమతులు ఇస్తున్నామని తెలిపారు. మహిళలు రాజకీయంగా, ఆర్థికంగా అన్ని రంగాల్లో సమాన భాగస్వాములుగా ఎదిగినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇస్తున్నామని, మహిళా స్వయం సహాయక సంఘాలను పారిశ్రామిక రంగంలోకి తీసుకువస్తున్నామని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధిలో మహిళల పాత్ర కీలకమని, వారికి నైపుణ్య శిక్షణ, పెట్టుబడి సహాయం అందిస్తామని చెప్పారు. విశాఖ సీఐఐ సదస్సుకు శాశ్వత వేదిక: విశాఖ నగరం సీఐఐ భాగస్వామ్య సదస్సుకు శాశ్వత వేదికగా మారుతోందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ప్రతి ఏటా ఈ సదస్సును విశాఖలోనే నిర్వహించేలా చూస్తామని ఆయన ప్రకటించారు. భారత్ లోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటని, విశాఖ ఆర్థిక రాజధానిగా ఎదుగుతోందని అన్నారు. పోర్టు ఆధారిత పరిశ్రమలు, గ్రీన్ ఎనర్జీ, డేటా సెంటర్లకు విశాఖ అత్యంత అనుకూలమని చెప్పారు. తొలి రోజు మొత్తం 88 ప్రతిపాదనలకు సంబంధించిన ఒప్పందాలు, ప్రభుత్వ ఉత్తర్వుల మార్పిడి జరిగింది. 73 అవగాహన ఒప్పందాల ద్వారా రూ.5,35,113 కోట్లు, 15 ప్రభుత్వ ఉత్తర్వుల ద్వారా రూ.49,242 కోట్లు కలిపి మొత్తం రూ.5,84,355 కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలు వచ్చాయి. 1,07,693 మందికి ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. తొలి రోజున రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ.2,73,000 కోట్లతో అగ్రస్థానంలో నిలిచింది. తూర్పు గోదావరి జిల్లాలో ఈ ప్రాజెక్టు చేపట్టనుంది. గ్రీన్ కో ఎనర్జీస్ రూ.45,000 కోట్లు, క్లీన్ మ్యాక్స్ ఎన్విరో ఎనర్జీ సొల్యూషన్స్ రూ.41,000 కోట్లు, మేఘా ఇంజినీరింగ్ రూ.36,000 కోట్లు పెట్టుబడి పెట్టనున్నాయి. జనరల్ మాన్యుఫ్యాక్చరింగ్ రంగంలో 23 ఒప్పందాలు, 5 ప్రభుత్వ ఉత్తర్వుల ద్వారా రూ.3,57,386 కోట్లు వచ్చాయి. శ్రీకాకుళంలో రష్మి మెటలర్జికల్ ఇండస్ట్రీస్ రూ.18,500 కోట్లు, కడపలో జేఎస్ డబ్ల్యూ గ్రూప్ రూ.15,000 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నాయి. ఆటోమొబైల్ రంగంలో శ్రీ సత్యసాయి జిల్లాలో కియా ఇండియా రూ.18,878 కోట్లు, తిరుపతి జిల్లాలో హీరో మోటోకార్ప్ రూ.1,457 కోట్లు, ప్రకాశం జిల్లాలో ఎంఎన్ఎల్ సొల్యూషన్స్ రూ.750 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నాయి. రసాయనాల రంగంలో శ్రీకాకుళంలో గెయిల్ ఇండియా రూ.13,500 కోట్లు, నెల్లూరులో ఎన్ఎఎన్ మ్యాగ్నెటెక్ రూ.3,000 కోట్లు, తిరుపతిలో ఎన్ఎఎన్ సిలోక్స్ గ్రీన్ మెట్ రూ.1,800 కోట్ల ప్రాజెక్టులకు ముందుకు వచ్చాయి. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో నాయుడుపేటలో ఎస్ఎల్ఎన్ కాఫీ, హిందుస్థాన్ కోకాకోలా బెవరేజెస్, అనంతపురంలో శ్రీ వసుధ ఫుడ్స్ ఒప్పందాలు చేసుకున్నాయి. ఏరోస్పేస్, రక్షణ రంగంలో సత్యసాయి జిల్లాలో ఆస్ట్రోబేస్ స్పేస్ టెక్నాలజీస్, నెల్లూరులో వజ్రశక్తి వెంచర్స్, ఆదిత్య ప్రెసిటెక్ పెట్టుబడి ప్రతిపాదనలు చేశాయి. ఎలక్ట్రానిక్స్ రంగంలో ఫ్యాబ్రిక్యూ సంస్థ రూ.4,300 కోట్ల పెట్టుబడితో ముందుకు వచ్చింది.

రెండో రోజు, ముగింపు రోజున 11 అవగాహన ఒప్పందాలు, 1 ప్రభుత్వ ఉత్తర్వు ద్వారా రూ.1,41,585 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 10,919 మందికి ఉద్యోగాలు వస్తాయని అధికారులు తెలిపారు. అత్యధిక పెట్టుబడి డేటా సెంటర్ల రంగంలో వచ్చింది. 1,400 మెగావాట్ల సామర్థ్యంతో డేటా సెంటర్ క్యాంపస్, టెలికాం సెంటర్ల ఏర్పాటుకు ఎయిర్ ట్రంక్ ఇండియా – జేసీకే ఇన్ ఫ్రా సంస్థలు రూ.1,03,018 కోట్ల పెట్టుబడి పెట్టనున్నాయి. దీని ద్వారా 3,120 మందికి ఉద్యోగాలు వస్తాయి. ప్రకాశం జిల్లా కందుకూరులో మైనింగ్ కార్యకలాపాల కోసం జేఎస్ డబ్ల్యూ స్టీల్స్ రూ.15,000 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. 2,500 మందికి ఉద్యోగాలు వస్తాయి. పునరుత్పాదక ఇంధన రంగంలో గ్రీన్ జోన్ రెన్యూవబుల్ ఎనర్జీ రూ.8,000 కోట్లు, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ రూ.6,600 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నాయి. ఏరోస్పేస్, రక్షణ రంగంలో తిరుపతి జిల్లాలో అగ్నికుల్ కాస్మోస్ రూ.510 కోట్లు, హాథోర్ రాకెట్స్ రూ.250 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నాయి. తిరుపతిని స్పేస్ సెక్టార్ గా అభివృద్ధి చేసేందుకు 5,000 ఎకరాలు కేటాయించినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. పోర్టులు, షిప్ బిల్డింగ్ రంగంలో కాకినాడ సీపోర్ట్స్ రూ.6,452 కోట్లు, రసాయనాల రంగంలో హిందాల్కో ఇండస్ట్రీస్ విస్తరణకు రూ.880 కోట్లు, ఐటి, ఎలక్ట్రానిక్స్ రంగంలో డిక్సన్ టెక్నాలజీస్ రూ.700 కోట్లు, పర్యాటక రంగంలో ఈఐహెచ్ లిమిటెడ్ రూ.175 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నాయి. మంత్రి నారా లోకేశ్ సమక్షంలో మరో 24 సంస్థలు రూ.1,05,634 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకున్నాయి. వీటిలో పంచశీల్ రియాల్టీ రూ.37,000 కోట్లతో హైపర్ స్కేల్ డేటా సెంటర్, ఏఎం ఏఐ ఫ్యాక్టరీ రూ.31,387 కోట్లతో ఇంటిగ్రేటెడ్ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుకు ముందుకు వచ్చాయి. లోకేశ్ తో ఎస్ఎల్ఎన్ కాఫీ ప్రతినిధుల భేటీ: విశాఖలో ఎస్ఎల్ఎన్ కాఫీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎన్. శతప్పన్ తో మంత్రి నారా లోకేశ్ సమావేశమయ్యారు. రాష్ట్రంలో కాఫీ ప్రాసెసింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల విస్తరణ, నాయుడుపేటలో కొత్త యూనిట్ ఏర్పాటు, స్థానిక యువతకు ఉపాధి కల్పనపై ఈ సందర్భంగా చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇస్తోందని, కాఫీ పరిశ్రమకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని లోకేశ్ హామీ ఇచ్చారు. పి 4 కార్యక్రమం: సదస్సులో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పి 4 కార్యక్రమానికి సంబంధించి కూడా ఒప్పందాలు జరిగాయి. హీరో గ్రూప్ కు చెందిన బ్రిజ్ మోహన్ లాల్ ముంజల్ ఫౌండేషన్ 28 జిల్లాల్లోని 1,120 మంది విద్యార్థులకు స్కాలర్ షిప్ లు ఇవ్వనుంది. పదో తరగతి పాసై ఐఐటిల్లో చేరే విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.2.9 లక్షల చొప్పున మొత్తం రూ.32.48 కోట్లు ఇవ్వనుంది. సదస్సు వివరాలు: నవంబర్ 12, 13 తేదీల్లో రెండు రోజుల పాటు ఆంధ్ర విశ్వవిద్యాలయ ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో ఈ సదస్సు జరిగింది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అధ్యక్షతన, ముఖ్యమంత్రి చంద్రబాబు సహ అధ్యక్షతన సదస్సు జరిగింది. 66 దేశాల నుంచి సుమారు 1,850 మంది ప్రతినిధులు హాజరయ్యారు. వారిలో 450 మంది అంతర్జాతీయ ప్రతినిధులు ఉన్నారు. ముఖ్యమంత్రి ప్రకటన ప్రకారం ఈ సదస్సులో 303 కొత్త ఒప్పందాల ద్వారా రూ.9.89 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని, దీంతో 2024 జూన్ నుంచి ఇప్పటివరకు రాష్ట్రానికి వచ్చిన మొత్తం పెట్టుబడి ప్రతిపాదనలు రూ.32.49 లక్షల కోట్లకు చేరతాయని తెలిపారు. 2024 జూన్ నుంచి 714 ప్రాజెక్టులకు రూ.22.6 లక్షల కోట్ల ప్రతిపాదనలు వచ్చాయని, వాటిలో 74 శాతం అమలు దశకు చేరాయని తెలిపారు.