ఇదేక్కడ న్యాయం? ఆత్మవంచ చేసుకుంటున్న టిడిపి నాయకులు
ప్రభాతదర్శిని, ప్రత్యేక – ప్రతినిధి: సూళ్లూరుపేట మున్సిపాలిటీలో కూటమి గెలిచింది. నాయుడుపేట మండల పరిషత్ లో కూటమి గెలిచింది. ఈ రెండు గెలుపులను ఎవరూ ఎమ్మెల్యేకు ఆపాదించలేదు. గెలిస్తే స్థానిక నాయకుల బలం అన్నారు. ఓడితే మాత్రం ఎమ్మెల్యే బలహీనత అన్నారు. పెళ్లకూరు జడ్పీటీసీ ఓటమి, నాయుడుపేట ఛైర్ పర్సన్ ఓటమి వచ్చినప్పుడు ఎమ్మెల్యేపై నెపం వేసిన వారే, సూళ్లూరుపేట, నాయుడుపేట మండల పరిషత్ గెలుపు వచ్చినప్పుడు ఎమ్మెల్యే పేరు ఎందుకు చెప్పలేదు? ఈ ప్రశ్న ఇప్పుడు నియోజకవర్గంలో బలంగా వినిపిస్తోంది.
సూళ్లూరుపేట – మున్సిపాలిటీ, మండల పరిషత్ రెండూ గెలుపు: సూళ్లూరుపేట మున్సిపాలిటీలో మొత్తం 32 వార్డులు ఉన్నాయి. అందులో టీడీపీకి 26 వార్డులు వచ్చాయి. వైఎస్ఆర్సీపీకి 3, బీజేపీకి 2, జనసేనకు 1 వచ్చాయి. ఛైర్ పర్సన్ ఎన్నికలో టీడీపీ అభ్యర్థి పిట్ల సుహాసిని 8,784 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఇది నియోజకవర్గంలో కూటమికి వచ్చిన అత్యంత భారీ గెలుపు. సూళ్లూరుపేట మండల పరిషత్ లో కూడా ఇదే పరిస్థితి. 9 ఎంపీటీసీ స్థానాల్లో టీడీపీకి 8, వైఎస్ఆర్సీపీకి 1 వచ్చాయి. జడ్పీటీసీ స్థానంలో బీజేపీ అభ్యర్థి అరని కిషన్ రెడ్డి 10,418 ఓట్లతో గెలిచారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి 6,849 ఓట్లు మాత్రమే వచ్చాయి. మెజారిటీ 3,569 ఓట్లు. అంటే సూళ్లూరుపేటలో పట్టణంలోనూ, గ్రామాల్లోనూ కూటమి స్పష్టంగా గెలిచింది. ఈ గెలుపు వచ్చినప్పుడు స్థానిక నాయకులు మేమే గెలిపించాం, మా బలం వల్లే గెలిచాం అని చెప్పుకున్నారు. ఎమ్మెల్యే వల్లే గెలిచామని ఒక్కరు కూడా అనలేదు. గెలుపును తమ ఖాతాలో వేసుకున్నారు.
నాయుడుపేట మండల పరిషత్ – ఇక్కడా కూటమి గెలుపే: నాయుడుపేట మండల పరిషత్ లో మొత్తం 9 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. అందులో టీడీపీకి 7, వైఎస్ఆర్సీపీకి 2 వచ్చాయి. పోలింగ్ జరిగిన 5 స్థానాల్లో 3 టీడీపీ గెలిచింది. జడ్పీటీసీ స్థానంలో కన్నెమ్మ తుపాకుల టీడీపీ నుంచి ఏకగ్రీవంగా గెలిచారు. అంటే నాయుడుపేట మండల పరిషత్ లో కూడా కూటమిదే పైచేయి. ఈ గెలుపును కూడా స్థానిక నాయకులు తమ బలంగా చెప్పుకున్నారు. ఎమ్మెల్యే పాత్ర గురించి ఎవరూ మాట్లాడలేదు. గెలిచిన చోట ఎమ్మెల్యే లేడు, ఓడిన చోట మాత్రం ఎమ్మెల్యే ఉన్నాడా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
పెళ్లకూరు, నాయుడుపేట మున్సిపాలిటీ – ఓడితే మాత్రం ఎమ్మెల్యేదే తప్పు: పెళ్లకూరులో 8 ఎంపీటీసీలు ఏకగ్రీవం అయ్యాయి. జడ్పీటీసీలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి 10,862 ఓట్లతో గెలిచారు. టీడీపీ అభ్యర్థికి 9,143 ఓట్లు మాత్రమే వచ్చాయి. మెజారిటీ 1,719 ఓట్లు. నాయుడుపేట మున్సిపాలిటీలో 18 మంది కౌన్సిలర్లు గెలిచినా, ఛైర్ పర్సన్ ఎన్నికలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి 13,787 ఓట్లతో గెలిచారు. టీడీపీ అభ్యర్థికి 12,600 ఓట్లు మాత్రమే వచ్చాయి. మెజారిటీ 1,187 ఓట్లు. ఈ రెండు ఓటములు వచ్చినప్పుడు మాత్రం కొందరు కూటమి నాయకులు ఎమ్మెల్యే సరిగా పని చేయలేదని, ఎమ్మెల్యే వల్లే ఓడిపోయామని అన్నారు. గెలిచినప్పుడు తమది, ఓడినప్పుడు ఎమ్మెల్యేది అనే విధంగా మాట్లాడారు. ఇదే ఇప్పుడు చర్చకు దారితీసింది.
ఈ రెండు తీరులను పోల్చి చూస్తే ఏమి అర్థమవుతుంది?: మొదటి విషయం – గెలుపుకు ఒక న్యాయం, ఓటమికి మరో న్యాయం. సూళ్లూరుపేటలో గెలిస్తే స్థానిక నాయకుల బలం అన్నారు. నాయుడుపేట మండల పరిషత్ లో గెలిస్తే స్థానిక నాయకుల బలం అన్నారు. పెళ్లకూరులో ఓడితే ఎమ్మెల్యే బలహీనత అన్నారు. నాయుడుపేట మున్సిపాలిటీలో ఓడితే ఎమ్మెల్యే బలహీనత అన్నారు. గెలుపు, ఓటమికి ఒకే కొలమానం ఉండాలి కదా. గెలుపు అందరిదీ అయితే, ఓటమి కూడా అందరిదే కావాలి. స్థానిక నాయకుల పాత్ర. సూళ్లూరుపేటలో గెలుపుకు స్థానిక నాయకుల పాత్ర ఉందని ఒప్పుకుంటే, పెళ్లకూరులో ఓటమికి కూడా స్థానిక నాయకుల పాత్ర ఉందని ఒప్పుకోవాలి. సూళ్లూరుపేటలో అభ్యర్థి ఎంపిక సరిగా జరిగింది కాబట్టి గెలిచారు. పెళ్లకూరులో అభ్యర్థి ఎంపిక సరిగా జరగలేదు కాబట్టి ఓడారు. అభ్యర్థిని ఎంచుకున్నది స్థానిక నాయకులే. దానికి ఎమ్మెల్యేను బలి చేయడం ఎలా న్యాయం అవుతుంది? కూటమిలో ఐక్యత. సూళ్లూరుపేటలో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పని చేశాయి కాబట్టి గెలిచాయి. నాయుడుపేట మున్సిపాలిటీలో కూటమి నేతల మధ్య పొత్తు ధర్మం బెడిసికొట్టింది కాబట్టి ఓడారు. పెళ్లకూరులో 8 ఎంపీటీసీలు వచ్చాయని తేలికగా తీసుకున్నారు కాబట్టి ఓడారు. నాయకుల మధ్య ఐక్యత లేకపోవడానికి ఎమ్మెల్యే ఒక్కరే ఎలా బాధ్యులు అవుతాడు?
ఇదేక్కడ న్యాయం? : గెలిస్తే అందరూ కలిసి గెలిచాం అనాలి. ఓడితే అందరం కలిసి ఓడాం అనాలి. గెలుపును తమ ఖాతాలో వేసుకుని, ఓటమిని ఎమ్మెల్యే ఖాతాలో వేయడం రాజకీయం కాదు, పలాయనం. సూళ్లూరుపేట గెలుపులో ఎమ్మెల్యేకు భాగం లేకపోతే, పెళ్లకూరు ఓటమిలో కూడా ఎమ్మెల్యేకు భాగం ఉండకూడదు. సూళ్లూరుపేట గెలుపులో ఎమ్మెల్యేకు భాగం ఉంటే, పెళ్లకూరు ఓటమిలో కూడా అందరికీ భాగం ఉండాలి. ఓటరు ఇప్పుడు అన్నీ గమనిస్తున్నాడు. ఎవరు పని చేశారు, ఎవరు పేరు చెప్పుకుంటున్నారు, ఎవరు తప్పించుకుంటున్నారు అనేది ఓటరుకు తెలుసు. గెలుపు వచ్చినప్పుడు ముందుకు వచ్చి, ఓటమి వచ్చినప్పుడు వెనక్కి తగ్గే నాయకులను ఓటరు నమ్మడు. గెలుపు, ఓటమి రెండింటికీ బాధ్యత వహించే నాయకులనే ఓటరు నమ్ముతాడు.