కక్ష్యలోకి భారత నావిక్ – 11 శాతం లక్ష్యంతో ఇస్రో చారిత్రక విజయం

ప్రభాతదర్శిని, (శ్రీహరికోట-ప్రతినిధి): భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో ప్రతిష్టాత్మక ప్రయోగాన్ని విజయ వంతంగా పూర్తి చేసింది. అమెరికా జీపీఎస్ కు ధీటుగా మన సొంత నావిగేషన్ వ్యవస్థ అయిన నావిక్ ను బలోపేతం చేసేందుకు గురువారం రాత్రి 11.51 గంటలకు ప్రారంభమైన 24 గంటల కౌంట్ డౌన్ ముగిసిన అనంతరం, శుక్రవారం అర్ధరాత్రి 11.51 గంటలకు తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ రెండో ప్రయోగ వేదిక నుంచి జీఎస్ఎల్వీ-ఎఫ్18 రాకెట్ ద్వారా ఎన్వీఎస్-03 ఉపగ్రహాన్ని విజయవంతంగా నింగిలోకి పంపింది. ఎందుకు ఈ ప్రయోగం అంత కీలకం?: భారతదేశానికి సొంత దిక్సూచి లాంటి నావిగేషన్ వ్యవస్థ ఉండాలనే లక్ష్యంతో ఇస్రో నావిక్ వ్యవస్థను రూపొందించింది. ఇది భారత భూభాగంతో పాటు సరిహద్దుల నుంచి 1,500 కిలోమీటర్ల వరకు కచ్చితమైన స్థానాన్ని తెలియజేస్తుంది. సైనిక అవసరాలు, విమానాలు, నౌకలు, విపత్తు నిర్వహణకు ఇది ఎంతో కీలకం. గతంలో ప్రయోగించిన ఏడు ఉపగ్రహాలలో ప్రస్తుతం కేవలం మూడు మాత్రమే పనిచేస్తుండటం, ఈ ఏడాది జనవరిలో ఎన్వీఎస్-02 కక్ష్యలోకి చేరలేక విఫలం కావడంతో నావిక్ వ్యవస్థ బలహీనపడింది. సొంతంగా పనిచేయాలంటే కనీసం నాలుగు ఉపగ్రహాలు కావాలి. ఆ లోటును పూడ్చడానికి ఎన్వీఎస్-03 ప్రయోగం ప్రతిష్టాత్మకంగా మారింది. ఎన్వీఎస్-03 ప్రత్యేకతలు:ఇది రెండో తరం నావిక్ ఉపగ్రహాలలో మూడోది. 2,232 కిలోల బరువు, 12 ఏళ్ల జీవిత కాలం కలిగిన ఈ ఉపగ్రహంలో స్వదేశీ రుబీడియం అటామిక్ క్లాక్ ను అమర్చారు. ఇప్పటి వరకు ఎల్5, ఎస్ బ్యాండ్ లలో మాత్రమే సిగ్నల్స్ ఉండగా, ఇప్పుడు సామాన్యుల మొబైల్ ఫోన్లలో కూడా అందుబాటులో ఉండే ఎల్1 బ్యాండ్ ను చేర్చారు. దీని వల్ల స్మార్ట్ వాచ్ లు, వాహనాల్లో నావిక్ సేవలు సులభంగా అందుతాయి. రికార్డు వేగం: ప్రెస్ మీట్ లో ఛైర్మన్ వి. నారాయణన్ మాట్లాడుతూ “దేశ ప్రజలకు తెలియజేయడానికి చాలా సంతోషంగా ఉంది. ఉపగ్రహంలోని సౌర ఫలకాలు విజయవంతంగా విచ్చుకున్నాయి” అని ప్రకటించారు. “ఈ రోజు దేశంలో వాహనాలను ట్రాక్ చేయడం తప్పనిసరి. ప్రపంచ స్థాయికి భారతదేశం 11 శాతం వరకు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాము. గత వైఫల్యం తర్వాత మేము 3 బాక్స్ లను తెరిచి, వైబ్రేషన్ పరీక్షలు నిర్వహించి, కనీసం 1 పెద్దది మరియు 1 చిన్న పరికరాన్ని సరిచేసి ఈ విజయం సాధించాము” అని తెలిపారు. “ఈ మిషన్ కేవలం 47 రోజుల్లో పూర్తి చేశాము. గత ప్రయోగం జరిగిన 56 రోజుల్లోనే ఈ ప్రయోగాన్ని సాధించాము. 4వ దశను 37 రోజుల రికార్డు సమయంలో పూర్తి చేశాము. ఇది ఇస్రో చరిత్రలోనే అత్యంత తక్కువ టర్న్ ఎరౌండ్ సమయం” అని మిషన్ డైరెక్టర్ తెలిపారు. ప్రపంచ రికార్డు కచ్చితత్వం:కక్ష్య లెక్కలు వెల్లడిస్తూ ఛైర్మన్ “లక్ష్యం 170 కి.మీ కాగా, మేము 170.31 కి.మీ మరియు 170.36 కి.మీ కచ్చితత్వంతో ప్రవేశపెట్టాము. రెండో కక్ష్య 37247 కి.మీ కు బదులు 38080 కి.మీ. ఇది ప్రపంచంలోని ఏ పెద్ద రాకెట్ కైనా ఉన్న అత్యుత్తమ కచ్చితత్వాలలో ఒకటి” అని అన్నారు. ఈ విజయంతో 3 ఉపగ్రహాలకు పడిపోయిన నావిక్ వ్యవస్థ మళ్ళీ 4 ఉపగ్రహాల బలాన్ని పొందింది.