పేట మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మాజీ ఎమ్మెల్యే కిలివేటి
ప్రభాత దర్శిని (నాయుడుపేట-ప్రతినిధి): అధికారం కోసం కూటమి ప్రభుత్వం మోసపూరితమైన హామీలను ఇస్తుందని వాటిని నమ్మొద్దని సూళ్లూరుపేట మాజీ శాసనసభ్యులు సంజీవయ్య అన్నారు. శనివారం ఆయన నాయుడుపేట మున్సిపాలిటీ చైర్పర్సన్ అభ్యర్థి తమ్మిరెడ్డి రాజేశ్వరమ్మ గెలుపు కోరుతూ ఆయన స్థానిక నాయకులతో కలిసి విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాసేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చామని, ప్రజలకు సేవ చేయడమే తంబిరెడ్డి రాజేశ్వరమ్మ ఏకైక ధ్యేయమని అన్నారు. ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, కామిరెడ్డి రాజారెడ్డి,కలికి మాధవరెడ్డి, తంబిరెడ్డి మోహన్ రెడ్డి, కామరెడ్డి మోహన్ రెడ్డి తదితర నాయకులతో కలిసి ఆమె ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. స్థానిక ఎల్ ఏ సాగరం,అగ్రహార పేట,భూపయ్య కాలనీ,బీడీ కాలనీ, లోతువానిగుంట లలో సాగిన ఈ ప్రచారానికి స్థానిక ప్రజల నుండి అపూర్వ స్పందన లభించింది.అడుగడుగునా ప్రజలు నీరాజనాలు పడుతూ హారతి పళ్లాలతో ఘన స్వాగతం పలకడంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం వెల్లివిరిసింది.అమలుకాని హామీలతో ప్రజలను మోసం చేశారని అధికార పార్టీపై కిలివేటి సంజీవయ్య ధ్వజం ఎత్తారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో పేదలకు అందిన సంక్షేమ పథకాలన్నీ నేడు కూటమి ప్రభుత్వ హయాంలో కనుమరుగయ్యాయని మండిపడ్డారు.గతంలో 40 సంవత్సరాలు దాటిన మహిళలకు ‘చేయుత ద్వారా 18,750 రూపాయలు,ఆరోగ్యశ్రీ పథకం కింద రూ. 20 లక్షల రూపాయలు కార్పొరేట్ వైద్యాన్ని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అందించారని తెలిపారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఆరోగ్యశ్రీని గాలికొదిలేశారని ధ్వజమెత్తారు. నిరుద్యోగ భృతి చదువుకున్న ఆడబిడ్డలకు ఇస్తామన్న హామీలు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు.ప్రజలను కల్లబొల్లి మాటలతో మోసగించి అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకుల మాటలను నమ్మొద్దని పిలుపునిచ్చారు. చెప్పింది చేసి చూపించిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన చైర్మన్ అభ్యర్థి తంబిరెడ్డి రాజేశ్వరమ్మ తోపాటు కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.ఏదైనా వాగ్దానం చేస్తే దాన్ని నిలబెట్టుకునేది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అని,ఆలోచించి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలంటూ ప్రజలకు పిలుపునిచ్చారు.వైయస్సార్సీపీ అభ్యర్థి తంబిరెడ్డి రాజేశ్వరమ్మకు ఫ్యాన్ గుర్తుపై ఓట్లు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన ఓటర్లను అభ్యర్థించారు. .ఈ ప్రచార కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ కటకం దీపిక, 22 వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి ధారా రవి, వైసిపి నాయకులు బైనా మల్లికార్జున్ రెడ్డి,ముత్యాల రెడ్డి, షేక్ రహంతుల్లా,పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రచారం నిర్వహించారు.
