30న రాత్రి 11.51కి ప్రయోగం
శ్రీహరికోటలో కౌంట్ డౌన్ ప్రారంభం

ప్రభాతదర్శిని,(తిరుపతి – జిల్లా ప్రతినిధి): భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో ప్రతిష్టాత్మక ప్రయోగానికి సిద్ధమైంది. అమెరికా జీపీఎస్ కు ధీటుగా మన సొంత నావిగేషన్ వ్యవస్థ అయిన నావిక్ ను బలోపేతం చేసేందుకు అక్టోబర్ 30న, శుక్రవారం అర్ధరాత్రి 11.51 గంటలకు తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ రెండో ప్రయోగ వేదిక నుంచి జీఎస్ఎల్వీ-ఎఫ్18 రాకెట్ ద్వారా ఎన్వీఎస్-03 ఉపగ్రహాన్ని నింగిలోకి పంపనున్నారు. ఇందుకు సంబంధించిన 24 గంటల కౌంట్ డౌన్ ను శాస్త్రవేత్తలు గురువారం రాత్రి 11.51 గంటలకు ప్రారంభించారు.
ఎందుకు ఈ ప్రయోగం అంత కీలకం?: భారతదేశానికి సొంతంగా దిక్సూచి లాంటి నావిగేషన్ వ్యవస్థ ఉండాలనే లక్ష్యంతో ఇస్రో నావిక్ వ్యవస్థను రూపొందించింది. ఇది భారత భూభాగంతో పాటు సరిహద్దుల నుంచి 1,500 కిలోమీటర్ల వరకు కచ్చితమైన స్థానం, వేగం, సమయాన్ని తెలియజేస్తుంది. సైనిక అవసరాలు, విమానాలు, నౌకలు, విపత్తు నిర్వహణ, మొబైల్ ఫోన్లలో లొకేషన్ సేవలకు ఇది ఎంతో కీలకం. అయితే గతంలో ప్రయోగించిన ఏడు ఉపగ్రహాలలో ప్రస్తుతం కేవలం మూడు మాత్రమే పనిచేస్తుండటం, ఈ ఏడాది జనవరిలో ప్రయోగించిన ఎన్వీఎస్-02 ఉపగ్రహం కక్ష్యలోకి చేరలేక విఫలం కావడంతో నావిక్ వ్యవస్థ బలహీనపడింది. సొంతంగా పనిచేయాలంటే కనీసం నాలుగు ఉపగ్రహాలు కావాలి. ఈ లోటును పూడ్చడానికి ఎన్వీఎస్-03 ను ప్రయోగిస్తున్నారు. అందుకే ఇది ఇస్రోకు ప్రతిష్టాత్మకమైన మిషన్.
ఎన్వీఎస్-03 ప్రత్యేకతలు ఏమిటి?: ఇది రెండో తరం నావిక్ ఉపగ్రహాలలో మూడోది. సుమారు 2,232 కిలోల బరువు, 12 ఏళ్ల జీవిత కాలం కలిగిన ఈ ఉపగ్రహంలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. మొదటిది, ఇందులో స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన రుబీడియం అటామిక్ క్లాక్ ను అమర్చారు. ఇది అత్యంత కచ్చితమైన సమయాన్ని ఇస్తుంది. రెండోది, ఇప్పటి వరకు నావిక్ ఉపగ్రహాలు ఎల్5, ఎస్ బ్యాండ్ లలో మాత్రమే సిగ్నల్స్ పంపేవి. ఇప్పుడు కొత్తగా సాధారణ మొబైల్ ఫోన్లలో కూడా అందుబాటులో ఉండే ఎల్1 బ్యాండ్ ను కూడా చేర్చారు. దీని వల్ల సామాన్యుల ఫోన్లలో, స్మార్ట్ వాచ్ లలో, వాహనాల్లో నావిక్ సేవలు సులభంగా అందుతాయి. ఇది మాస్ మార్కెట్ లోకి నావిక్ ను తీసుకెళ్తుంది.
రాకెట్ వివరాలు:ఎన్వీఎస్-03ను మోసుకెళ్లే జీఎస్ఎల్వీ-ఎఫ్18 అనేది మూడు దశల రాకెట్. ఎత్తు 51.7 మీటర్లు. దీనికి స్వదేశీ క్రయోజెనిక్ ఇంజిన్ ఉంది. గతంలో ఎన్వీఎస్-01 ను 2023 మే 29న ఇదే తరహా రాకెట్ ద్వారా విజయవంతం గా ప్రయోగించారు. ఈ ప్రయోగం విజయవం తమైతే, భారత్ అమెరికా జీపీఎస్, రష్యా గ్లోనాస్, యూరప్ గెలీలియో, చైనా బీడౌ వ్యవస్థల సరసన మరింత బలంగా నిలుస్తుంది. దేశ భద్రత, ఆత్మనిర్భరత దిశగా ఇది మరో పెద్ద ముందడుగు అవుతుంది. రేపు రాత్రి శ్రీహరికోట నుంచి దూసుకెళ్లే ఈ రాకెట్ పై దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది.