వైసీపీ నాయకులకు జనసేన నాయకులు మిద్దిల హరి హెచ్చరిక
ప్రభాతదర్శిని (శ్రీకాళహస్తి – ప్రతినిధి ): వైసీపీ ఆవిర్భావం నుంచి వివిధ హోదాల్లో పని చేశానని కొత్తగా జనసేనఅధినేత డిప్యుటీ సిఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరిన మిద్దిల హరి అన్నారు.జనసేనలో చేరిన ఆయన తొలిసారిగా శ్రీకాళహస్తికి విచ్చేసిన సిద్దార్థ లాడ్జిలోని ఆయన కార్యాలయంలో సత్రవాడ ప్రవీణ్ తో కలిసి సోమవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆప్కో డైరెక్టర్ గా, మున్సిపల్ ప్లోర్ లీడర్ గా, ఆర్టీసీ వైస్ చైర్మన్ గా పనిచేసానని తెలిపారు. అధికారంలో వున్నప్పుడు, ప్రతిపక్షంలో వున్నప్పుడు వైసీపీలో కొన్ని క్షుద్ర శక్తులు రాజ్యమేలుతున్నాయన్నారు.నియోజకవర్గం వైసీపీ ఇంచార్జి ఆయన దుష్ట శక్తులను కట్టడి చేయడంలో విఫలం చెందారన్నారు. అందువల్ల తాను ఆయన దుష్ట శక్తుల ఆగడాలు భరించలేక ఆయన పార్టీకి ఈ నెల 25 వ తేదీ రాజీనామా చేసి పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరానన్నారు. అయితే కొంత మంది వైసీపీచోటా నాయకులు తన కుటుంబ సభ్యులు, అనుచరులపై వ్యక్తిగత దూషణలు చేశారని పేర్కొన్నారు. ఇలాంటి చర్యలు పునరావృతం అయితే వైసీపీ నాయకులకు తగురీతిలో బుద్దిచెబుతామని హెచ్చరించారు. ఇదిలా ఉంటే జనసేనలో నాయకత్వ లోపం స్పష్టంగా కనిపించిందని తెలిపారు. తమ రాకతో జనసేన క్షేత్ర స్థాయిలో బలోపేతం చేస్తామని, ఆదినుంచి జనసేనలో వున్న నాయకులతో కలిసి పార్టీ సిద్దాంతాలు, పవన్ కళ్యాణ్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళతామన్నారు. శ్రీకాళహస్తిలో భారీ బహిరంగ సమావేశం ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఆ లోపు విజయవాడకు శ్రీకాళహస్తిలోని అన్నీ గ్రూప్ ల్లో వున్న జనసేన నాయకుల సమన్వయ సమావేశం ఏర్పాటు చేయనున్నామన్నారు.శ్రీకాళహస్తిలో ఏర్పాటు చేయనున్న భారీ బహిరంగ సమావేశంకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లేదా ఎమ్మెల్సీ నాగబాబు, పలువురు మంత్రులు హాజరు కానున్నారని తెలిపారు. అదేవిధంగా ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ లతో కలిసి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొంటామన్నారు. ఈ సమావేశంలో దావాలా గిరి, వెంకటేష్, మాజీ కౌన్సిలర్ జయదేవన్ గిరి, మునిశేఖర్ గౌడ్, గణేష్ లీలాధర్,కరుణాకర్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.