చట్టంపై మీ అవగాహన ఆశ్చర్యం కలిగించిందన్న సీజేఐ
న్యూఢిల్లీ: ఎఫ్ఐఆర్ నమోదుకు ఇచ్చిన ఆదేశాలను పాటించని కారణంగా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ)ను దోషిగా ఖరారు చేసిన బిహార్‌కు చెందిన ఒక జడ్జి అనిల్ కుమార్‌కు సుప్రీంకోర్టు సోమవారం చీవాట్లు పెట్టింది. ‘బాహుబలిలా ప్రవర్తించవద్దు’ అని హెచ్చరించింది. చట్టానికి సంబంధించి ఆ జడ్జి జ్ఞానం దారుణంగా ఉందంటూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చి, జస్టిస్ వి. మోహనల బెంచ్ వ్యాఖ్యానించింది. ‘చట్టంపై మీకున్న అవగాహన మాకు ఆశ్చర్యం కలిగించింది. మీరు ముందు బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 384 పరిధి, విస్తృతి గురించి అర్థం చేసుకోవాలి. సీఆర్పీసీ సెక్షన్ 345 గురించి కూడా. ఎవరైనా ఇంకొకరిని చెంపదెబ్బ కొట్టినా న్యాయస్థానాన్ని అవమానించినా లేదా చెప్పినప్పుడు కోర్టు వదిలి వెళ్లకపోయినా అది కోర్టు ముందు జరిగిన నేరం. కానీ మనం ఎఫ్ఐఆర్ నమోదు చేయమని ఇతరులను ఆదేశించి వారు ఆ పని చేయకపోతే అది కోర్టు సమక్షంలో నేరం జరిగినట్లు కాదు’ అని వివరించింది. ఆ జడ్జి అదే రోజు ఎస్పీని కోర్టుకు పిలిపించి దూకుడు వైఖరిని ప్రదర్శించి నేరస్తుడిగా ప్రకటించడం సరికాదని జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చి మౌఖికంగా వ్యాఖ్యానించారు. ‘ఇన్వెస్టిగేటింగ్ జడ్జి జోక్యంపై జడ్జి అనిల్ అత్యుత్సాహం వ్యక్తం చేయడాన్ని ప్రశ్నిస్తూ…. జిల్లా మెజిస్ట్రేట్‌ను, ఎస్పీని కోర్టుకు పిలిపించి, వారు హాజరు కాకపోడాన్ని ‘కోర్టు సమక్షంలో జరిగిన నేరంగా’ పరిగణించి, దోషిగా నిర్ధారిస్తూ శిక్ష విధించినప్పుడు మీరు మీ అధికార పరిధిలోనే వ్యవహరించారా? మీరు కాస్త సంయమనం పాటించాల్సి ఉండాల్సింది. ఇప్పటివరకు చేసిన అత్యుత్సాహం చాలు’ అని జస్టిస్ బాగ్చి వ్యాఖ్యానించారు. ‘న్యాయాధికారాలను వినియోగించుకునే సమయంలో మీ క్లయింట్ (జడ్జి అనిల్‌ను) బాహుబలిలా ప్రవర్తించడం ఆపమని చెప్పండి’ అని న్యాయస్థానం తెలిపింది.
