తిరుపతి ఆర్థిక ప్రాంత ప్రణాళిక–2047 పై ప్రణాళికను రూపొందించడమే సమగ్రంగా అభివృద్ధి ప్రధాన ఉద్దేశ్యం
ప్రభాతదర్శిని,(తిరుపతి – ప్రతినిధి): స్వర్ణాంధ్ర @ 2047 లక్ష్య సాధనలో భాగంగా తిరుపతి ఎకనామిక్ రీజియన్ (TER) ప్రణాళిక–2047 రూపకల్పనకు క్షేత్రస్థాయి భాగస్వాముల సూచనలు, సలహాలు ఎంతో కీలకమని తిరుపతి ఎకనామిక్ రీజియన్ సి ఈ ఓ ముఖేష్ కుమార్ మీనా పేర్కొన్నారు. బుధవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ విసి హాల్ నందు తిరుపతి ఎకనామిక్ రీజియన్ సీఈఓ ముఖేష్ కుమార్ మీనా, ప్లానింగ్ శాఖ జాయింట్ సెక్రటరీ అనంత శంకర్, జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్, చిత్తూరు, SPSR నెల్లూరు జిల్లాల కలెక్టర్లు సుమిత్ కుమార్, హిమాన్షు శుక్లా, ఎం.ఎల్ సి కంచర్ల శ్రీకాంత్, తిరుపతి, నగరి, సూళ్ళురుపేట, సత్యవేడు ఎం ఎల్ ఎ లు ఆరణి శ్రీనివాసులు, గాలి బాను ప్రకాష్, నెలవల విజయశ్రీ, ఆదిమూలం, నగరపాలక సంస్థ కమీషనర్ ఎం. జయకృష్ణ, లతో కలసి తిరుపతి ఎకనామిక్ రీజియన్ అభివృద్ధి పై తిరుపతి, చిత్తూరు, SPSR నెల్లూరు జిల్లాల భాగస్వాముతో ఒక రోజు సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో స్పెషల్ డిప్యూటి కలెక్టర్ శివ శంకర్ నాయక్, జిల్లా రెవిన్యూ అధికారి జి.నరసింహులు, సీపీఓ రాజశేఖర్, వివిధ శాఖల జిల్లా అధికారులు, సీనియర్ అధికారులు, పారిశ్రామికవేత్తలు, విద్యావేత్తలు, నిపుణులు, KPMG ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు. తిరుపతి ఎకనామిక్ రీజియన్ (TER) సీఈఓ మాట్లాడుతూ* ప్రాంతీయ ఆర్థిక ప్రణాళికను కేవలం డేటా సేకరణ, నివేదిక తయారీగా కాకుండా ప్రజాప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, విద్యావేత్తలు, సిటీ ప్లానర్లు, ప్రభుత్వ అధికారులు తదితర భాగస్వాముల ప్రత్యక్ష సూచనల ఆధారంగా రూపొందించాలనే ఉద్దేశంతో ఈ సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజాప్రతినిధులకు ప్రజల సమస్యలు, స్థానిక అవసరాలపై ప్రత్యక్ష అవగాహన ఉంటుందని, పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు, ఉపాధి అవకాశాల సృష్టిలో కీలక పాత్ర పోషిస్తారని, విద్యావేత్తలు, నిపుణులకు ప్రణాళికా పరమైన సాంకేతిక అవగాహన ఉంటుందని, ప్రభుత్వ అధికారులు విధానాలను క్షేత్రస్థాయిలో అమలు చేస్తారని వివరించారు. ఈ విభిన్న వర్గాల సూచనలను సమన్వయం చేస్తేనే ప్రాంతానికి ఉపయోగపడే సమగ్ర ప్రణాళిక రూపొందుతుందని చెప్పారు. ప్రభుత్వ అధికారులు ఎక్కువగా మాట్లాడటం కంటే క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలు, అభివృద్ధి లోటుపాట్లు, పరిష్కారాలు, భవిష్యత్ అవకాశాలపై భాగస్వాముల నుంచి అభిప్రాయాలు సేకరించడమే ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో స్పేస్, డిఫెన్స్ రంగాలను సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు పరిశోధన–అభివృద్ధి (R&D), తయారీ, పరీక్షలు, లాంచ్ సదుపాయాలను పరస్పరం అనుసంధానించాలని తెలిపారు. తిరుపతి–నెల్లూరు ప్రాంతాల్లో అభివృద్ధి చేస్తున్న స్పేస్, డిఫెన్స్ క్లస్టర్లను అనుసంధానం చేసి ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించేలా అవసరమైన విధానపరమైన వెసులుబాట్లు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. సుమారు 2,500 ఎకరాల్లో స్పేస్ సిటీ అభివృద్ధి జరుగుతోందని, ఇందులో పరిశ్రమలకు భూమి కేటాయింపులు ప్రారంభమయ్యాయని తెలిపారు. IIT, IISERల భాగస్వామ్యంతో R&D పార్క్ ఏర్పాటు చేయడంతో పాటు రాష్ట్రంలో R&D నుంచి తయారీ, టెస్టింగ్, లాంచ్ వరకు సమగ్ర స్పేస్ ఎకోసిస్టమ్‌ను అభివృద్ధి చేయాలని పేర్కొన్నారు. స్పేస్, డిఫెన్స్ రంగాల్లో పెట్టుబడులు పెట్టే సంస్థలకు అవసరమైన భద్రతా నిబంధనలు, బఫర్ జోన్, భూమి కేటాయింపులపై అనుకూల విధానాలను రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. పోర్టులు, విమానాశ్రయాలు, పారిశ్రామిక ప్రాంతాలను అనుసంధానించే సింగిల్ బాండెడ్ కారిడార్ విధానాన్ని పరిశీలించడం ద్వారా లాజిస్టిక్స్ సామర్థ్యాన్ని పెంచవచ్చని తెలిపారు. పోర్టులు, ఎయిర్‌స్ట్రిప్‌లు, కార్గో, రీప్యాకింగ్, పంపిణీ సదుపాయాలను సమన్వయం చేసి తీర ప్రాంత పారిశ్రామిక, లాజిస్టిక్స్ వ్యవస్థను బలోపేతం చేయాలని సూచించారు. తదుపరి చర్యలుగా, స్పేస్–డిఫెన్స్ క్లస్టర్ల అనుసంధానం, R&D పార్క్ అభివృద్ధి, పరిశ్రమలకు అవసరమైన మౌలిక వసతులు, బఫర్ జోన్ విధానం, సింగిల్ బాండెడ్ కారిడార్ సాధ్యాసాధ్యాలపై సంబంధిత శాఖలు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని TER CEO సూచించారు. ఈ రంగాలను లాజిస్టిక్స్, పోర్టులు, విమానాశ్రయాలతో అనుసంధానం చేయడం ద్వారా పెట్టుబడులు, పరిశ్రమలు, ఉపాధి అవకాశాలను పెంచేలా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. ప్లానింగ్ శాఖ జాయింట్ సెక్రటరీ* మాట్లాడుతూ తిరుపతి ఎకనామిక్ రీజియన్‌లోని తొమ్మిది జిల్లాల ప్రాథమిక సమాచారం, ఆర్థిక పరిస్థితులు, వృద్ధి అవకాశాలు, తలసరి ఆదాయ పరిస్థితులను మండల స్థాయి వరకు అధ్యయనం చేసినట్లు తెలిపారు. తొమ్మిది జిల్లాలు రాష్ట్ర వైశాల్యంలో సగానికి పైగా విస్తరించి ఉన్నప్పటికీ రాష్ట్ర GSDPలో వాటి వాటా సుమారు మూడో వంతు మాత్రమే ఉందని, అందువల్ల ఈ ప్రాంతంలోని సహజ వనరులు, మౌలిక సదుపాయాలు, మానవ వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవడం ద్వారా “స్వర్ణాంధ్ర” లక్ష్య సాధనలో TER కీలక పాత్ర పోషించే అవకాశం ఉందన్నారు. విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ ప్రణాళికలో గుర్తించిన అభివృద్ధి అవకాశాలు, ప్రాజెక్టుల తరహాలోనే తిరుపతి, అమరావతి ఎకనామిక్ రీజియన్లకు కూడా సమగ్ర ప్రణాళికలను రూపొందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. తిరుపతి జిల్లా కలెక్టర్* మాట్లాడుతూ తిరుపతి ప్రాంతంలో సుమారు 15 వేల ఎకరాల విస్తీర్ణంలో పారిశ్రామిక పర్యావరణ వ్యవస్థ అందుబాటులో ఉందని తెలిపారు. ఇప్పటికే అనేక పరిశ్రమలు ఏర్పాటై ఉన్న నేపథ్యంలో పారిశ్రామిక అభివృద్ధికి అవసరమైన బలమైన రహదారి అనుసంధానాలపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. చిత్తూరు – తచ్చూరు ఎక్స్‌ప్రెస్‌వే, బెంగళూరు – చెన్నై ఎక్స్‌ప్రెస్‌వే, శ్రీ సిటీ, కోల్‌కతా – చెన్నై జాతీయ రహదారిలను అనుసంధానించే లింక్ రోడ్డు ఏర్పాటైతే పారిశ్రామిక రవాణా మరింత సులభతరం అవుతుందని పేర్కొన్నారు. అదేవిధంగా శ్రీకాళహస్తి – తడ రహదారిను అభివృద్ధి చేయడం కూడా అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశమని తెలిపారు. ఈ రెండు రహదారులు ప్రాంతీయ పారిశ్రామిక అభివృద్ధి, లాజిస్టిక్స్ వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు జిల్లాల మధ్య ఆర్థిక అనుసంధానాన్ని మరింత మెరుగుపరుస్తాయని కలెక్టర్ వివరించారు. నెల్లూరు జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ*…నెల్లూరు, తిరుపతి, ప్రకాశం జిల్లాల్లో అభివృద్ధి చెందుతున్న పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను స్థానిక యువతకు అందించేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని తెలిపారు. బీపీసీఎల్, పునరుత్పాదక ఇంధనం, రక్షణ తయారీ, పోర్టు కార్యకలాపాల్లో ఏర్పడే ఉపాధి అవకాశాలకు అనుగుణంగా వెల్డింగ్, సోలార్ ఇంగోట్స్–వేఫర్స్ తయారీ, డ్రోన్ టెక్నాలజీ, గాంట్రీ క్రేన్ ఆపరేషన్ వంటి ప్రత్యేక నైపుణ్యాలపై శిక్షణ ఇవ్వాలని సూచించారు. బీపీసీఎల్ ఆధునిక నైపుణ్య శిక్షణ కేంద్రం ఏర్పాటుకు ముందుకు వచ్చిందని, తొలుత భూసేకరణ జరిగిన గ్రామాల్లో నైపుణ్య సర్వే నిర్వహించి స్థానిక యువతకు శిక్షణ అందిస్తామని, అనంతరం నెల్లూరు, తిరుపతి, ప్రకాశం జిల్లాలకు విస్తరిస్తామని తెలిపారు. పరిశ్రమలు ఏర్పాటు కావడానికి ముందే అవసరమైన నైపుణ్యాలను గుర్తించి శిక్షణ ఇవ్వడం ద్వారా స్థానిక ఉపాధిని పెంచవచ్చన్నారు. పారిశ్రామిక వృద్ధికి అనుగుణంగా విద్యుత్ మౌలిక వసతులను ముందుగానే విస్తరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కృష్ణపట్నం, రామాయపట్నం ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు గ్రీన్ హైడ్రోజన్, డేటా సెంటర్లు వంటి అధిక విద్యుత్ అవసరమయ్యే భవిష్యత్ పరిశ్రమల అవసరాలను ముందుగానే అంచనా వేయాలని సూచించారు. పరిశ్రమల విద్యుత్ అవసరాలపై ముందస్తు ఫిజిబిలిటీ పరిశీలన చేసి, అవసరమైన సబ్స్టేషన్లు, విద్యుత్ లైన్లు, భూసేకరణ వంటి మౌలిక వసతులను సమయానుకూలంగా ఏర్పాటు చేయాలని తెలిపారు. పరిశ్రమల పెట్టుబడులకు అనుగుణంగా నైపుణ్యాభివృద్ధి, విద్యుత్, నీరు, రవాణా, లాజిస్టిక్స్ మౌలిక వసతులను సమన్వయంతో అభివృద్ధి చేయడం ద్వారా స్థానిక ఉపాధి, ప్రాంతీయ ఆర్థిక వృద్ధిని పెంచేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. చిత్తూరు జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ* జిల్లాలో పరిశ్రమల స్థాపనకు అందుబాటులో ఉన్న భూమిని సమర్థవంతంగా వినియోగించుకుని పెట్టుబడులను ఆకర్షించేందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని తెలిపారు. చెన్నైకి సమీపం, రహదారి అనుసంధానం, పరిశ్రమలకు అనుకూలమైన సమతల భూమి వంటి భౌగోళిక ప్రయోజనాలను వినియోగించుకుని పారిశ్రామిక అభివృద్ధిని వేగవంతం చేయాలని పేర్కొన్నారు. జిల్లాలో పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు సుమారు 2,000–2,500 ఎకరాల భూమి అందుబాటులో ఉందని, గత రెండేళ్లలో అదనంగా 476 ఎకరాల భూమిని సేకరించినట్లు తెలిపారు. APIIC ఆధ్వర్యంలో మరో రెండు ప్రాంతాల్లో భూసేకరణ పూర్తయి కేటాయింపు ప్రక్రియ కొనసాగుతోందన్నారు. పరిశ్రమలకు అవసరమైన విద్యుత్, నీరు, రహదారులు తదితర మౌలిక వసతులను ముందుగానే కల్పించాలని సూచించారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా స్థానిక యువతకు నైపుణ్య శిక్షణ అందించేందుకు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, ఐటీఐలు, పరిశ్రమల భాగస్వామ్యంతో శిక్షణా కార్యక్రమాలను అమలు చేయాలని కలెక్టర్ తెలిపారు. గార్మెంట్, ఫుడ్ ప్రాసెసింగ్, పౌల్ట్రీ తదితర రంగాల్లో పరిశ్రమలే తమ అవసరాలకు అనుగుణంగా స్థానికులకు శిక్షణ ఇచ్చే విధానాన్ని ప్రోత్సహించాలని పేర్కొన్నారు. అందుబాటులో ఉన్న పారిశ్రామిక భూమి, మౌలిక వసతులపై సమగ్ర వివరాలను సిద్ధం చేసి రాబోయే పారిశ్రామిక సదస్సులో పెట్టుబడిదారులకు అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు. పెట్టుబడిదారులను గుర్తించి నిరంతర ఫాలోఅప్ నిర్వహించడంతో పాటు APIIC, పరిశ్రమల శాఖ, నైపుణ్యాభివృద్ధి శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా భూమి, మౌలిక వసతులు, నైపుణ్య మానవ వనరులను సమకూర్చేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలన్నారు. ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ మాట్లాడుతూ TER ప్రాంతంలో పరిశ్రమలు, సేవా రంగాల్లో పెరుగుతున్న ఉపాధి అవకాశాలను యువత సద్వినియోగం చేసుకునేలా కళాశాల స్థాయి నుంచే నైపుణ్యాలు, ఉద్యోగ, స్వయం ఉపాధి అవకాశాలపై విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. ‘వన్ ఫ్యామిలీ–వన్ ఎంటర్ప్రెనర్’, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్, MSME పార్కులు, స్థానిక పరిశ్రమలు, ఇంటర్న్‌షిప్‌లు, స్టార్టప్ అవకాశాలను విద్యార్థులకు చేరువ చేయాలని తెలిపారు. బీటెక్, డిగ్రీ విద్యార్థులకు రెండో, మూడో సంవత్సరం నుంచే పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నైపుణ్య శిక్షణ, కెరీర్ మార్గదర్శకత్వం, పరిశ్రమలతో ప్రత్యక్ష అనుసంధానం కల్పించాలని పేర్కొన్నారు. తిరుపతి ప్రాంతంలోని ఆధ్యాత్మిక, పర్యాటక అవకాశాలను వినియోగించుకుని హోమ్‌స్టేలను ప్రోత్సహించడం ద్వారా స్థానిక యువతకు స్వయం ఉపాధి, ఆదాయ అవకాశాలను పెంచవచ్చన్నారు. హోమ్‌స్టే నిర్వాహకులకు అతిథి నిర్వహణ, పర్యాటక సేవలపై శిక్షణ అందించాలని సూచించారు. ప్రభుత్వ శాఖలు, విద్యాసంస్థలు, పరిశ్రమలు, స్వచ్ఛంద సంస్థల సమన్వయంతో కళాశాలల వారీగా ఉపాధి–స్వయం ఉపాధి అవకాశాల మ్యాపింగ్ చేయాలని సూచించారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నైపుణ్య శిక్షణా కార్యక్రమాలు నిర్వహించి, ఇంటర్న్‌షిప్‌లు, ఉద్యోగ మేళాలు, స్టార్టప్ అవగాహన కార్యక్రమాలను క్రమం తప్పకుండా నిర్వహించాలన్నారు. స్థానిక పరిశ్రమలు, MSME పార్కులు, పర్యాటక రంగంతో విద్యార్థులను అనుసంధానించి శిక్షణ నుంచి ఉపాధి లేదా స్వయం ఉపాధి వరకు మార్గదర్శకత్వం అందించాలని సూచించారు. తిరుపతి ఎమ్మెల్యే మాట్లాడుతూ* తిరుపతి ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందని, తిరుమలతో పాటు శ్రీకాళహస్తి, కాణిపాకం వంటి పుణ్యక్షేత్రాలను అనుసంధానిస్తూ టెంపుల్ టూరిజం సర్క్యూట్‌ను మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. భక్తులు, పర్యాటకులు తిరుపతిలో ఒకటి రెండు రోజులకు మించి బస చేసేలా పర్యాటక మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాలని సూచించారు. రాయలసీమలోని అనంతపురం, కర్నూలు, కడప, చిత్తూరు తదితర ప్రాంతాల్లోని పర్యాటక ప్రాంతాలను కూడా సమగ్రంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. తిరుపతి – చిత్తూరు ప్రాంతంలో ఎలక్ట్రానిక్స్, ఈవీ, ఫుడ్ ప్రాసెసింగ్, ఐటీ, MSME రంగాలు, ఫుడ్ ప్రాసెసింగ్ పార్కులు అభివృద్ధి చేయాలని సూచించారు. స్థానిక యువతకు పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నైపుణ్య శిక్షణ అందించేందుకు ప్రత్యేక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల ఏర్పాటు అవసరమన్నారు. సూళ్లూరుపేట ఎం ఎల్ ఎ మాట్లాడుతూ* ఇరకం ఐలాండ్, బీవీ పాలెం, పులికాట్ సరస్సు, ఫ్లెమింగో ఫెస్టివల్, శ్రీహరికోట వంటి ప్రాంతాల పర్యాటక సామర్థ్యాన్ని వివరించారు. ఇరకం, బీవీ పాలెం తదితర ప్రాంతాల్లో పర్యాటక మౌలిక సదుపాయాలు, రిసార్టులు, బోటింగ్, ఎకో టూరిజం అభివృద్ధికి అవకాశం ఉన్నప్పటికీ అటవీ, పర్యావరణ అనుమతుల కారణంగా కొన్ని ప్రాజెక్టులు ముందుకు సాగడం లేదని తెలిపారు. మొత్తం పులికాట్ ప్రాంతాన్ని దృష్టిలో ఉంచుకుని సమగ్ర మాస్టర్ ప్లాన్ రూపొందించాలని సూచించారు. పులికాట్ ప్రాంతంలోని శ్రీహరికోట, పారిశ్రామిక ప్రాంతాలు, నాయుడుపేట, శ్రీ సిటీ, కృష్ణపట్నం తదితర ప్రాంతాలను పర్యాటక, పారిశ్రామిక, రవాణా అనుసంధానంతో అభివృద్ధి చేయాల్సిన అవసరాన్ని కూడా వివరించారు. సత్యవేడు ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో శ్రీ సిటీ SEZతో పాటు సుమారు 300 పరిశ్రమలు ఉన్నప్పటికీ వాటికి అనుగుణంగా రహదారి, ఆరోగ్యం, విద్య, సామాజిక మౌలిక సదుపాయాలు మరింతగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. శ్రీ సిటీకి వెళ్లే మార్గంలో రహదారి రద్దీ, ప్రమాదాల దృష్ట్యా బైపాస్ రహదారి అవసరమని, సత్యవేడు CHC ని ఏరియా ఆసుపత్రిగా అభివృద్ధి చేయాలని కోరారు. పారిశ్రామిక ప్రాంతాలకు అనుగుణంగా వైద్య సేవలను బలోపేతం చేయడం అత్యవసరమన్నారు. నియోజకవర్గంలోని డిగ్రీ కళాశాల భవనం, విద్యార్థుల వసతులు, SC/ST హాస్టళ్ల అభివృద్ధి, నారాయణవనం బాలికల వసతి గృహం, రహదారులు, తహశీల్దార్ కార్యాలయ భవనాలు తదితర మౌలిక సదుపాయాలపై కూడా సూచనలు చేశారు. గొల్లపల్లి ప్రాంతంలో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు, కాళంగి ప్రాజెక్టు ఆధునీకరణ, రైల్వే ట్రాక్ రక్షణ తదితర అంశాలను కూడా ప్రాంతీయ అభివృద్ధి ప్రణాళికలో పరిగణించాలని కోరారు. తమిళనాడు సరిహద్దు ప్రాంతంగా సత్యవేడు నియోజకవర్గానికి ఉన్న ప్రత్యేక భౌగోళిక ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని రహదారి, లాజిస్టిక్స్ కనెక్టివిటీని మెరుగుపరచాలని సూచించారు. నగరి ఎమ్మెల్యే మాట్లాడుతూ* తిరుపతి ఆర్థిక ప్రాంతం సమగ్ర అభివృద్ధిలో భాగంగా నగరి నియోజకవర్గంలో పారిశ్రామిక, సేవా, పర్యాటక రంగాల అభివృద్ధికి విస్తృత అవకాశాలు ఉన్నాయని తెలిపారు. రెండు విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు, చెన్నై మార్కెట్‌కు సమీపం, జాతీయ రహదారుల అనుసంధానం వంటి భౌగోళిక ప్రయోజనాలను వినియోగించుకుని పెట్టుబడులను ఆకర్షించాలన్నారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ఐటీఐలు, సాంకేతిక విద్యా సంస్థల్లో నైపుణ్య శిక్షణను బలోపేతం చేసి స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెంచాలని సూచించారు. తిరుపతితో అనుసంధానంగా పర్యాటక, సేవా రంగాలను అభివృద్ధి చేయడంతో పాటు రవాణా, మౌలిక వసతులను మెరుగుపరచాలని పేర్కొన్నారు. పారిశ్రామిక అభివృద్ధికి సుమారు 2,500 ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటులో ఉండగా, మరో 2,500 ఎకరాల భూమిని సేకరించేందుకు గుర్తించామని, మొత్తం సుమారు 5,000 ఎకరాలను పారిశ్రామిక అవసరాలకు వినియోగించే అవకాశం ఉందని తెలిపారు. APIIC పరిధిలోని ఈ భూమికి అవసరమైన మౌలిక వసతులు కల్పించి పరిశ్రమలను ఆకర్షించేందుకు చర్యలు చేపట్టాలని, భూమి స్థితిగతులు, భూసేకరణ, మౌలిక వసతులపై సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. అటవీ శాఖ అధికారులు మాట్లాడుతూ* పులికాట్ ప్రాంతం వన్యప్రాణి అభయారణ్యం పరిధిలోని ప్రాంతాలకు సంబంధించి చట్టపరమైన, పర్యావరణ పరిమితులను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. అభయారణ్యానికి ఆమోదించిన మేనేజ్మెంట్ ప్లాన్ ప్రకారం కార్యకలాపాలు చేపట్టాల్సి ఉంటుందని, అవసరమైన సందర్భాల్లో సంబంధిత రాష్ట్ర, కేంద్ర స్థాయి అనుమతులు పొందాల్సి ఉంటుందని వివరించారు. ఒడిశాలోని చిలికా ప్రాంత అభివృద్ధి నమూనాను పరిశీలించి తగిన అంశాలను పరిగణనలోకి తీసుకోవచ్చని సూచించారు. భాగస్వాముల సూచనలను నమోదు చేసుకున్న అధికారులు* మాట్లాడుతూ TER ప్రణాళికలో పరిశ్రమలతో పాటు ఆరోగ్యం, విద్య, పట్టణ–సామాజిక మౌలిక సదుపాయాలు, సేవారంగం, లాజిస్టిక్స్, నైపుణ్యాభివృద్ధి, ఆవిష్కరణలు వంటి రంగాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నామన్నారు. జిల్లాల అభివృద్ధి లోటుపాట్లను గుర్తించి, TER ప్రాంతంలో సుమారు 50–60 కీలక ప్రాజెక్టులను చేపట్టే లక్ష్యంతో ప్రణాళిక రూపొందిస్తున్నారన్నారు. KPMG ప్రజెంటేషన్‌లో స్పేస్, ఏరోస్పేస్, ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్లు, షిప్‌బిల్డింగ్, పునరుత్పాదక ఇంధనం, ఫుడ్ ప్రాసెసింగ్, హార్టీకల్చర్, విద్య – పరిశోధన వంటి భవిష్యత్ రంగాల అవకాశాలను వివరించారు. అలాగే పారిశ్రామిక కారిడార్లు, ఓడరేవులు, సౌర – పవన విద్యుత్, తిరుమల పర్యాటకం, వ్యవసాయం, ఆక్వాకల్చర్, విద్యా – పరిశోధనా సంస్థలను TERకు కీలక ఆస్తులుని తెలిపారు. అభివృద్ధిలో నీటి సంరక్షణ, వర్షపు నీటి సేకరణ, భూగర్భ జలాల పర్యవేక్షణ, సహజ వ్యవసాయం, వ్యర్థజలాల శుద్ధి, పట్టణ మౌలిక సదుపాయాలు, సామాజిక గృహాలు, ప్రైవేట్ పెట్టుబడుల ఆకర్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. సమావేశంలో పాల్గొన్న బాగస్వాములు మాట్లాడతూ తిరుపతి ప్రాంతంలో ఆధ్యాత్మికత, పర్యాటకాన్ని అనుసంధానించి యాత్రికులు, పర్యాటకులు 3 రాత్రులు, 4 రోజుల పాటు బస చేసేలా సమగ్ర పర్యాటక సర్క్యూట్లను అభివృద్ధి చేయాలన్నారు. తిరుపతి, తిరుమల, శ్రీకాళహస్తి, కాణిపాకం, తలకోన, హార్స్‌లీహిల్స్ తదితర ప్రాంతాలను అనుసంధానిస్తూ ప్రత్యేక పర్యాటక ప్యాకేజీలను రూపొందించి విస్తృత ప్రచారం కల్పించాలని పేర్కొన్నారు. పర్యాటక ప్రాంతాల్లో వసతి, రహదారులు, రవాణా, తాగునీరు వంటి మౌలిక వసతులను మెరుగుపరచడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు అనుగుణంగా పర్యాటకుల నిర్వహణకు చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రముఖ ఆధ్యాత్మిక ప్రాంతాలను ఒకే సర్క్యూట్‌గా అనుసంధానించి సమగ్ర సమాచారం, ఆన్లైన్ బుకింగ్ సదుపాయాలను అందుబాటులోకి తీసుకురావాలని తెలిపారు. శ్రీహరికోటలో ఏర్పాటు కానున్న అంతరిక్ష సంగ్రహాలయాన్ని పర్యాటక సర్క్యూట్లో భాగంగా చేర్చడంతో పాటు తిరుపతి నుంచి విమాన అనుసంధానాన్ని మరింత విస్తరించాలని భాగస్వాములు సూచించారు. పర్యాటకుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో నీరు, వసతి, రవాణా, ఇతర మౌలిక వసతుల సామర్థ్యాన్ని ముందస్తుగా పెంచాలని పేర్కొన్నారు. శ్రీహరికోట అంతరిక్ష రంగానికి అవసరమైన తయారీ, అనుబంధ పరిశ్రమలను తిరుపతి–నెల్లూరు ప్రాంతంలో ప్రోత్సహించడం ద్వారా అంతరిక్ష ఆధారిత పారిశ్రామిక కేంద్రాన్ని అభివృద్ధి చేయవచ్చని పారిశ్రామికవేత్తలు, ప్రతినిధులు సూచించారు. దీనివల్ల పెట్టుబడులు, పరిశ్రమలు, స్థానిక ఉపాధి అవకాశాలను పెంచే అవకాశం ఉందని తెలిపారు. పర్యాటక, పారిశ్రామిక రంగాల అభివృద్ధికి నీరు, పచ్చదనం, రవాణా, మౌలిక వసతులు, నైపుణ్యాభివృద్ధిని సమాంతరంగా బలోపేతం చేస్తూ తిరుపతి ప్రాంతాన్ని సమగ్ర పర్యాటక, పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి చేయాలని సమావేశంలో భాగస్వాములు అభిప్రాయపడ్డారు. అనంతరం మూడు జిల్లాలకు సంబంధించిన రంగాల వారీ అవకాశాలు, పెట్టుబడులు, ప్రస్తుత పారిశ్రామిక స్థావరాలు, వ్యవసాయ ఉత్పత్తి, ఎగుమతుల అవకాశాలు, మౌలిక సదుపాయాల అవసరాలపై ప్రజెంటేషన్ ఇచ్చి భాగస్వాముల అభిప్రాయాలను సేకరించారు. కార్యక్రమం ముగింపు సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ*, తిరుపతి ఎకనామిక్ రీజియన్ (TER) సమగ్ర అభివృద్ధికి పరిశ్రమలు, విద్యావేత్తలు, ప్రజాప్రతినిధులు, వివిధ రంగాల భాగస్వాములు అందించిన సూచనలు ఎంతో విలువైనవని తెలిపారు. సదస్సులో వచ్చిన సూచనలను పరిగణనలోకి తీసుకుని TER భవిష్యత్ అభివృద్ధి ప్రణాళికను రూపొందిస్తామని పేర్కొన్నారు. తయారీ, సేవా, లాజిస్టిక్స్, పర్యాటక రంగాల్లో TERకు విస్తృత అవకాశాలు ఉన్నాయని, మెరుగైన రోడ్డు, రైల్వే, పోర్టు, విమాన అనుసంధానం ఈ ప్రాంతానికి ప్రత్యేక బలమని తెలిపారు. అందుబాటులో ఉన్న మౌలిక వసతులను సమర్థంగా వినియోగించుకుని పెట్టుబడులు, ఉపాధి అవకాశాలను పెంచడంతో పాటు ప్రజల తలసరి ఆదాయం పెరిగేలా సమగ్ర ఆర్థిక ప్రణాళిక రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. TER అభివృద్ధికి వ్యూహాత్మక భాగస్వామిగా KPMG అందించిన సహకారం, వివిధ జిల్లాల అధికారులు పంచుకున్న ఉత్తమ విధానాలు, పరిశ్రమల ప్రతినిధులు అందించిన సూచనలు భవిష్యత్ కార్యాచరణకు ఉపయోగపడతాయని కలెక్టర్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి విజన్‌కు అనుగుణంగా TERను సమగ్ర ఆర్థిక అభివృద్ధి ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడతామని తెలిపారు. సదస్సులో విలువైన సూచనలు అందించిన పరిశ్రమల ప్రతినిధులు, విద్యావేత్తలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, KPMG బృందానికి జిల్లా కలెక్టర్ కృతజ్ఞతలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలిపారు.
.
