కౌన్సిలర్ల పరిచయ వేదికలో తంబిరెడ్డి మోహన్ రెడ్డి
ప్రభాతదర్శిని, నాయుడుపేట-ప్రతినిధి: సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య అధ్యక్షతన జరిగిన కౌన్సిలర్ల పరిచయ చర్చావేదికలో మోహన్ రెడ్డి మాట్లాడుతూ నాయుడుపేట మున్సిపాలిటీలో గెలిచినవారు, ఓడినవారు అనే తేడా లేదని, 32 మంది అభ్యర్థులూ మనవారేనని అన్నారు. నాయుడుపేటలోని మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య క్యాంప్ కార్యాలయంలో నాయుడుపేట మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులందరినీ ఒకే వేదికపై సత్కరించి అభినందించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గెలిచిన 13 మంది కౌన్సిలర్లతో పాటు, స్వల్ప ఓట్ల తేడాతో వెనుకబడిన 19 మంది అభ్యర్థులనూ సమానంగా గౌరవించుకోవడం అభినందనీయమని పేర్కొన్నారు. నాయుడుపేట మున్సిపాలిటీలో 32 వార్డులకు పోటీ చేసిన అభ్యర్థుల్లో 13 మంది కౌన్సిలర్లుగా విజయం సాధించగా, మిగిలిన 19 మంది స్వల్ప ఓట్ల తేడాతో వెనుకబడ్డారని మోహన్ రెడ్డి తెలిపారు. కొన్నిచోట్ల 5, 6 ఓట్ల నుంచి 100 లోపు ఓట్ల తేడాతో ఫలితాలు వచ్చాయని పేర్కొన్నారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమని, ప్రజల కోసం పనిచేయాలనే సంకల్పంతో పోటీ చేసిన ప్రతి ఒక్కరికీ సమాన గౌరవం ఉండాలని అన్నారు. మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య నాయకత్వంలో గెలిచిన వారితో పాటు, వెనుకబడిన అభ్యర్థులందరినీ ఒకే వేదికపైకి తీసుకువచ్చి సత్కరించడం ఐక్యతకు నిదర్శనమని పేర్కొన్నారు. నాయుడుపేట మున్సిపల్ చైర్ పర్సన్ గా తంబిరెడ్డి రాజేశ్వరమ్మను ఎంపిక చేయడం వెనుక కిలివేటి సంజీవయ్య చొరవ, నిర్ణయం కీలకమని మోహన్ రెడ్డి వెల్లడించారు. తమ కుటుంబం నుంచి చైర్ పర్సన్ అభ్యర్థి ఎంపిక విషయంలో మొదట కొంత ఆలోచన చేసినప్పటికీ, 74 ఏళ్ల వయసులోనూ రాజేశ్వరమ్మకు ప్రజాసేవ చేసే అవకాశం కల్పించాలన్న సంజీవయ్య అభిప్రాయానికి అంగీకరించామని తెలిపారు. చైర్ పర్సన్ గా బాధ్యతలు చేపట్టిన రాజేశ్వరమ్మకు గెలిచిన 13 మంది కౌన్సిలర్లతో పాటు, మిగిలిన 19 మంది అభ్యర్థులు కూడా సమన్వయంతో సహకరించాలని కోరారు. నాయుడుపేట అభివృద్ధి కోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని మోహన్ రెడ్డి తెలిపారు. మాధవరెడ్డి, రాజారెడ్డి, సుబ్రహ్మణ్యరెడ్డి, సంజయ్ తదితర నాయకులను హౌస్ అరెస్టులు చేయడం, కేసులు నమోదు చేయడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయని ఆయన ఆరోపించారు. ప్రధాన నాయకులతో పాటు ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ పార్టీ నాయకులు, కార్యకర్తలు ధైర్యంగా నిలబడి ఎన్నికల్లో పాల్గొన్నారని, కష్టకాలంలో పార్టీ కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికీ తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఇకపై గెలిచిన 13 మంది కౌన్సిలర్లు, మిగిలిన 19 మంది అభ్యర్థులు అనే తేడా లేకుండా మొత్తం 32 వార్డుల్లోనూ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు.
