ప్రభాతదర్శిని, శ్రీకాళహస్తి-ప్రతినిధి: శ్రీకాళహస్తిలోని శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయంలో అదనపు లడ్డూ పోటులో జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయాల్లో భక్తుల భద్రత విషయంలో నిర్లక్ష్యం ఎంతమాత్రం సహించేది లేదని హెచ్చరించారు. శుక్రవారం మంత్రి ఆనం శ్రీకాళహస్తి ఆలయాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకున్నారు. దేవస్థానం అధికారులు, అర్చకులు, సిబ్బంది ఆయనకు ఘనస్వాగతం పలికారు. దర్శనం అనంతరం వేద పండితులు వేదాశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం గురువారం అదనపు లడ్డూ పోటులో షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిన అగ్ని ప్రమాద ప్రాంతాన్ని మంత్రి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరు, ఘటనకు దారితీసిన పరిస్థితులు, ప్రస్తుతం చేపట్టిన భద్రతా చర్యలపై దేవస్థానం అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడుతూ ఆలయాలకు వచ్చే లక్షలాది మంది భక్తుల భద్రత దేవస్థాన అధికారుల ప్రథమ బాధ్యత అని స్పష్టం చేశారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు వారి భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. అదనపు లడ్డూ పోటులో అగ్ని ప్రమాదం జరగడంపై అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. భక్తుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించినా, భద్రతా ప్రమాణాల అమలులో అలసత్వం ప్రదర్శించినా ఉపేక్షించే ప్రసక్తే లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి ఘటనలు పునరావృతమైతే సంబంధిత బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. విద్యుత్ వైరింగ్, విద్యుత్ పరికరాలు, అగ్నిమాపక వ్యవస్థలను పూర్తిస్థాయిలో తనిఖీ చేయాలని ఆదేశించారు. వంటశాలలు, లడ్డూ తయారీ కేంద్రాలు, ప్రసాదాల తయారీ ప్రదేశాల్లో భద్రతా ప్రమాణాలను మరింత పటిష్టం చేయాలని సూచించారు. అగ్నిమాపక పరికరాలు అందుబాటులో ఉండటమే కాకుండా ఎల్లప్పుడూ పనిచేసే స్థితిలో ఉండేలా చూడాలన్నారు. భక్తులకు నాణ్యమైన ప్రసాదాలను సురక్షిత వాతావరణంలో తయారు చేసి అందించేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన క్లౌడ్ కిచెన్ విధానాన్ని ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించి, అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. వంటశాలలు, ప్రసాదాల తయారీ కేంద్రాల నిర్వహణలో పరిశుభ్రత, నాణ్యత, భద్రతకు పెద్దపీట వేయాలన్నారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయిన అనంతరం మరోసారి దేవస్థాన అధికారులతో సమగ్ర సమీక్షా సమావేశం నిర్వహిస్తామని మంత్రి తెలిపారు. అగ్ని ప్రమాద ఘటనకు దారితీసిన కారణాలు, భద్రతా ఏర్పాట్లలో లోపాలను పూర్తిస్థాయిలో పరిశీలించి, బాధ్యులుగా తేలిన వారిపై తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. భక్తులు ఎంతో విశ్వాసంతో ఆలయాలకు వస్తారని, వారి విశ్వాసానికి భంగం కలగకుండా అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని మంత్రి ఆదేశించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం, ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ మెట్టు సాయికుమార్, కార్యనిర్వహణాధికారి, దేవస్థానం పాలకమండలి సభ్యులు, స్థానిక బీజేపీ నాయకులు కోలా ఆనంద్, దేవస్థానం అధికారులు, ఆలయ సిబ్బంది, దేవాదాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.

