ప్రభాతదర్శిని,(తిరుపతి – ప్రతినిధి): సెప్టెంబర్ 30: తిరుపతి ఎకనామిక్ రీజియన్ పరిధిలోని జిల్లాలన్నీ పరస్పర సమన్వయంతో పనిచేసినప్పుడే సమగ్ర పారిశ్రామిక, ప్రాంతీయ ప్రగతి సాధ్యమవుతుందని నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా పేర్కొన్నారు. బుధవారం ఉదయం తిరుపతి కలెక్టరేట్లో తిరుపతి ఎకనామిక్ రీజియన్ సీఈఓ ముకేశ్ కుమార్ మీనా ఆధ్వర్యంలో జరిగిన భాగస్వాముల సదస్సులో కలెక్టర్ పాల్గొని జిల్లాలోని అభివృద్ధి అవకాశాలు, మౌలిక వసతుల అవసరాలు, పారిశ్రామిక రంగానికి సంబంధించిన అంశాలను వివరించారు. 2047 నాటికి తిరుపతి ఎకనామిక్ రీజియన్‌ను రూ.80 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే లక్ష్యానికి అనుగుణంగా ప్రాంతీయ వనరులు, ప్రత్యేకతలను సమర్థవంతంగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని సీఈఓ ముకేశ్ కుమార్ మీనా తెలిపారు. పరిశ్రమలు, పర్యాటకం, వ్యవసాయం, లాజిస్టిక్స్, సేవల రంగాల్లో సమన్వయంతో అభివృద్ధి ప్రణాళికలను అమలు చేయడం ద్వారా పెట్టుబడులు, ఉపాధి అవకాశాలను పెంచవచ్చన్నారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతులు, కనెక్టివిటీ, నైపుణ్యాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా మీడియా సమావేశంలో మాట్లాడుతూ జిల్లాల సరిహద్దులకు పరిమితం కాకుండా నెల్లూరు, తిరుపతి, చిత్తూరు తదితర జిల్లాలను ఒకే ఆర్థిక రీజియన్‌గా పరిగణించి అభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. నెల్లూరు జిల్లాలోని పోర్టును కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల ఎగుమతులు, దిగుమతులకు గేట్‌వేగా వినియోగించుకునే అవకాశం ఉందన్నారు. పారిశ్రామికవేత్తలు ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యలను రీజియన్ స్థాయిలో పరిష్కరించేందుకు 400 కేవీ సబ్‌స్టేషన్లు వంటి మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించాల్సి ఉందన్నారు. అలాగే శ్రీశైలం, సోమశిల, కండలేరు ప్రాజెక్టుల ద్వారా నీటి సరఫరాపైనా జిల్లాల మధ్య సమన్వయం అవసరమని తెలిపారు. ముఖ్యమంత్రి నిర్దేశించిన 15 శాతం వృద్ధి రేటును సాధించేందుకు జిల్లాల కలెక్టర్లు, అధికారులు పరస్పరం సహకరించుకుంటూ ఒకే దిశగా పనిచేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. స్థానిక పరిశ్రమలు, ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన సమస్యలు, ఫీడ్‌బ్యాక్‌ను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి అమరావతి స్థాయిలో త్వరితగతిన పరిష్కరించేందుకు ఈ సదస్సు దోహదపడుతుందని తెలిపారు. తిరుపతి ఎకనామిక్ రీజియన్‌లో భాగస్వామ్య జిల్లాల వనరులు, అవకాశాలను సమన్వయంతో వినియోగించుకోవడం ద్వారా పారిశ్రామిక అభివృద్ధి, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలకు మరింత ఊతం లభిస్తుందని అధికారులు పేర్కొన్నారు.
