ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణ గ్రామదేవత శ్రీశ్రీశ్రీ పోలేరమ్మ అమ్మవారి జాతర మహోత్సవం ఆదివారం (27-09-2026) నుండి అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. అక్టోబర్ 1వ తేదీ గురువారం వరకు 5 రోజుల పాటు రాష్ట్ర పండుగగా జరుగనుంది. జాతర సందర్భంగా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేసి పర్యవేక్షిస్తూ ఎలాంటి ఆవాంఛనీయ సంఘటనలు జరగకుండా భక్తులకు సౌకర్యాలు కల్పిస్తున్నారు. వేలాదిమంది తరలివచ్చే ఈ జాతరకు ఈ ప్రాంతంలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. భక్తి పరవశంతో భక్తులు అమ్మవారిని దర్శించుకోవడం, మొక్కుబడులు తీర్చుకోవడం కోసం దేశంలోని వివిధ ప్రాంతాల నుండి విదేశాల నుంచి భక్తులు రావడం విశేషం.
చారిత్రక నేపథ్యం: ఈ జాతరకు 300 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. 1714 నాటికే జాతర జరిగినట్లు ఆధారాలు ఉన్నాయి. 1917లో వెంకటగిరి సంస్థానంలో కలరా, మశూచి మహమ్మారి వ్యాపించి వందలాది మంది మరణించారు. అప్పటి వెంకటగిరి రాజా వారు ప్రజలను కాపాడేందుకు శీతలా యాగం చేసి, పట్టణం నలువైపులా అష్టదిగ్బంధన యంత్రాలను, గ్రామశిలలను ఏర్పాటు చేశారు. వ్యాధి తగ్గినందుకు కృతజ్ఞతగా 1919లో ఘనంగా జాతర నిర్వహించారు. అప్పటి నుండి ఆనవాయితీగా మారింది. వెంకటగిరి రాజవంశానికి చెందిన 33 తరాల పాలకులు ఈ జాతరను నిర్వహించడం విశేషం. 1992 నుండి దేవాదాయ శాఖ పరిధిలోకి వచ్చింది. 2022లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దీనిని రాష్ట్ర పండుగగా ప్రకటించారు.
జాతర విశిష్టత:వినాయక చవితి తర్వాత వచ్చే మొదటి బుధవారం మొదటి చాటింపు, రెండో బుధవారం రెండో చాటింపు వేస్తారు. చాటింపు వేసిన తర్వాత వెంకటగిరి ప్రజలు ఎలాంటి శుభకార్యాలు చేయరు. జాతరలో కుమ్మరివీధిలో పుట్టమట్టితో అమ్మవారి విగ్రహాన్ని కళ్లు లేకుండా తయారు చేస్తారు. ఆ తర్వాత ముసుగు కప్పి, పల్లకీలో అత్తవారిల్లుగా భావించే జీనిగవారి వీధికి తీసుకెళ్తారు. అర్ధరాత్రి తర్వాత అద్దంలో చూస్తూ వెనుక నుండి కళ్లు, దిష్టి చుక్క పెడతారు. అమ్మవారి ఉగ్రరూపాన్ని నేరుగా చూడలేరని నమ్మకం. తెల్లవారుజాము నుండి భక్తులకు దర్శనం, పురవీధుల్లో ఊరేగింపు, చివరి రోజు నిమజ్జనం జరుగుతుంది. నిమజ్జన మట్టిని భక్తులు పవిత్ర ప్రసాదంగా ఇంటికి తీసుకెళ్తారు. సోమవారం రాత్రి 7 గంటలకు వెంకటగిరి శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో పోలేరమ్మ ఆర్చ్ సెంటర్ నుండి ద్వారకా సెంటర్, పాత ఎమ్మార్వో ఆఫీస్, పాత బస్టాండ్ వరకు భారీ సాంస్కృతిక కార్యక్రమం నిర్వహించనున్నారు. దేవస్థాన చైర్మన్ గొల్లగుంట మురళీకృష్ణ, కార్యనిర్వహణ అధికారి ఆర్యభూమి వెంకట శ్రీనివాసులు రెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. భక్తులకు ఇబ్బంది లేకుండా క్యూలైన్లు, పార్కింగ్ ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.
