రైతులు సమస్యలు పరిష్కారానికి టోల్ ఫ్రీ నెంబర్ 1967 లేదా జిల్లా ఫిర్యాదు కేంద్రం నెంబర్ 8520879979 ను సంప్రదించగలరు: జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు

నెల్లూరు, ఏప్రిల్ 16: జిల్లాలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు ప్రక్రియ నిరాటంకంగా కొనసాగుతోందని జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో పండించే ఆర్ఎన్ఆర్ 15048, కేఎన్ఎమ్ 1638, కేఎన్ఎమ్ 733 మరియు బిపిటి 5204 రకాల ధాన్యాన్ని స్కూల్ మరియు హాస్టల్ విద్యార్థుల అవసరాల కోసం విస్తృతంగా కొనుగోలు చేయాలని ప్రభుత్వం సూచించిందన్నారు. దానికి అనుగుణంగా ఖరీఫ్ సీజన్‌లో ఇప్పటివరకు 74,353 మెట్రిక్ టన్నులు, రబీ సీజన్‌లో 57 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందని తెలిపారు. ఇంకా కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణ కొనసాగుతుందని, రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని తమ ధాన్యాన్ని ప్రభుత్వానికి విక్రయించి మద్దతు ధర పొందాలని సూచించారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ఏర్పాటు వల్ల బహిరంగ మార్కెట్‌లో కూడా ధాన్యం ధరలు పెరిగాయని, ఆర్ఎన్ఆర్ 15048 మరియు కేఎన్ఎమ్ 1638 రకాల ధాన్యాన్ని రైతులు గిట్టుబాటు ధరకు విక్రయించగలిగారని చెప్పారు. బిపిటి 5204 రకం ధాన్యం ఎక్కువగా కొనుగోలు కేంద్రాల ద్వారానే కొనుగోలు చేసినట్లు తెలిపారు. మార్కెట్‌లో ధరలు తగ్గిన సందర్భాల్లో కూడా కొనుగోలు కేంద్రాల ద్వారా రైతులకు మద్దతు ధర లభించిందన్నారు. రైస్ మిల్లర్ల నుండి రూ.100 కోట్ల బ్యాంకు గ్యారంటీ వసూలు చేయడంతో పాటు, మరింత మొత్తాన్ని బీజీల రూపంలో సేకరించేందుకు నిరంతరం సమీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రైతులు తమ వద్ద ఉన్న ధాన్యాన్ని సమీపంలోని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి ప్రభుత్వానికి విక్రయిస్తే, 24 గంటల్లోనే వారి బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ అయ్యేలా చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. గోనిసంచులు, జీపీఎస్ అమర్చిన వాహనాలు అందుబాటులో ఉంచి రైతులకు మెరుగైన సేవలు అందిస్తున్నామన్నారు. దళారులు, మధ్యవర్తులను నమ్మి తక్కువ ధరకు ధాన్యం అమ్ముకోవాల్సిన అవసరం లేదని, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను ఉపయోగించుకోవాలని రైతులకు సూచించారు. ప్రస్తుతం ఆర్ఎన్ఆర్ 15048 రకం ధాన్యం పుట్టి ధర రూ.22,000, కేఎన్ఎమ్ 1638 రకం రూ.21,000 వరకు బహిరంగ మార్కెట్‌లో ఉండటంతో రైతులు గిట్టుబాటు ధర పొందుతున్నారని తెలిపారు. బహిరంగ మార్కెట్‌లో ధరలు తగ్గినా ప్రభుత్వం ఎంత ధాన్యమైనా కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. రైతులు ఎటువంటి సమస్యలు ఎదుర్కొన్నా టోల్ ఫ్రీ నెంబర్ 1967 లేదా జిల్లా ఫిర్యాదు కేంద్రం నెంబర్ 8520879979 ను సంప్రదించి తమ సమస్యలను పరిష్కరించుకోవచ్చన్నారు. జిల్లాలో ఎవరైనా రైతుల నుండి తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేసినట్లు ఫిర్యాదులు వస్తే, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతుల ధాన్యాన్ని ప్రభుత్వం పూర్తిగా కొనుగోలు చేస్తుందని భరోసా ఇచ్చిందని జేసి ఆ ప్రకటనలో తెలిపారు.