
ప్రభాతదర్శిని, (తిరుపతి-ప్రతినిధి): జిల్లాలోని ఎస్సీ వర్గానికి చెందిన ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను బాధ్యతాయుతంగా ఉంచాలని అలాగే సమాజంలో సమానత్వం స్థాపన కోసం అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలనీ రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్ పేర్కొన్నారు. బుధవారం ఉదయం స్థానిక జిల్లా కలెక్టరేట్ పి జి ఆర్ ఎస్ హాల్ నందు ఎస్.సి లకు సంబందించిన పి.జి.ఆర్.ఎస్. కార్యక్రమంలో పాల్గొని అర్జీదారుల నుండి ఆర్జీలను స్వీకరించిన అనంతరం వీడియో కాన్ఫెరెన్స్ హాల్ నందు ఎస్సీలపై జరుగుతున్న అఘాయిత్యాల కేసులు మరియు సంక్షేమ పథకాల అమలుకు సంబంధించి ఎస్.సి. కమిషన్ సెక్రటరీ చిన్న రాముడు, సభ్యులు శ్రీపతి బాబు, ఎం బిక్షం, ఎన్టీ రామాంజనేయమ్మ, మాజీ మంత్రి పరసారత్నం, జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్, జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు, జాయింట్ కలెక్టర్ ఆర్ గోవిందరావు, డి.ఆర్.ఓ. నరసింహులు, ఆర్ డి ఓ లు తిరుపతి, శ్రీకాళహస్తి, సూళ్ళూరుపేట రాం మోహన్, భాను ప్రకాష్ రెడ్డి, దేవేంద్ర రెడ్డి లతో కలసి సంబందిత జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ సి కమిషన్ చైర్మన్ మాట్లాడుతూ… ప్రత్యేకంగా పోలీస్ కేసులు, ల్యాండ్ రెవెన్యూ కేసుల్లో జిల్లా కలెక్టర్ ఇచ్చిన ఆదేశాలు కింద స్థాయిలో సరిగా అమలు కావడం లేదని గమనించామని తెలిపారు. ఈ అంశాలను కలెక్టర్ గారితో ప్రత్యేకంగా చర్చించి తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు. గతంలో తాను మంత్రిగా పనిచేశానని, ప్రస్తుతం ఎస్సీ కమిషన్ చైర్మన్‌గా రాష్ట్రంలోని దాదాపు 22 శాతం జనాభాకు సంబంధించిన సంక్షేమ పథకాల అమలుపై దృష్టి సారించడం అనే బాధ్యతను ప్రభుత్వం తనకు అప్పగించిందని తెలిపారు. గత 10 నెలలుగా అన్ని జిల్లాలు పర్యటిస్తూ దళితులపై జరుగుతున్న దాడులు, భూమి, ఆస్తి, ఆర్థిక సమస్యలను పరిశీలిస్తున్నామని తెలిపారు. సాధారణంగా ఈ కేసులను 15 నుంచి 20 రోజుల్లో పరిష్కరించాలని జిల్లా అధికారులను ఆదేశించామని చెప్పారు. కమిషన్ నుంచి పంపిన ఫిర్యాదులు సంబంధిత ఉన్నతాధికారుల దాకా చేరకముందే కింది స్థాయిలోనే పరిష్కరించి పంపుతున్న పరిస్థితి ఉందని, కొన్ని సందర్భాల్లో సరైన విధానాలు పాటించకుండా ‘ఫాల్స్ కేసులు’గా పేర్కొనడం జరుగుతోందని తెలిపారు. ఇది సరైన పద్ధతి కాదని స్పష్టం చేశారు. ఇంకా, సమాజంలో కుల వివక్ష పూర్తిగా తొలగిపోలేదని, పట్టణ ప్రాంతాల్లో తగ్గినా గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా కొనసాగుతోందని అన్నారు. ఈ పరిస్థితులను మార్చడానికి పోలీస్ మరియు రెవెన్యూ వ్యవస్థలపై ముఖ్య బాధ్యత ఉందని, చట్టాల అమలు కఠినంగా జరగాలని అన్నారు. తమ వద్దకు వచ్చిన సమస్యలను అలసత్వం లేకుండా పరిష్కరించాల్సిన బాధ్యత సంబంధిత శాఖల అధికారులపై ఉందని తెలిపారు. ముఖ్యంగా కమిషన్ నుంచి పంపిన అంశాలకు సమయానికి సమాధానాలు ఇవ్వడం, సరైన చర్యలు తీసుకోవడం అత్యంత అవసరమని పేర్కొన్నారు. ఎస్.సి కమిషన్ సెక్రటరీ మాటలాడుతూ జిల్లాలో ప్రజలకు సమర్థవంతమైన, సమయానికి న్యాయసమ్మత సేవలు అందించడానికి పోలీసులు మరియు ఇతర అధికారులు కృషి చేస్తున్నారని తెలిపారు. జిల్లా పోలీస్ డిపార్ట్మెంట్ 24 గంటల అలర్ట్ గా ఉండటం, ప్రతి సమస్యను చట్ట పరిధిలో పరిష్కరించడం, బాధితులకు సాంత్వన మరియు మద్దతు అందించడం ముఖ్యమని తెలిపారు. పోలీస్ స్టేషన్లలో వచ్చిన ప్రజలను మర్యాదగా, స్నేహపూర్వంగా స్వీకరించడం, సమస్యలను వినడం ద్వారా సౌకర్యాలను కల్పించడం ద్వారా ప్రజల విశ్వాసాన్ని పెంచే విధంగా పనిచేయాలని సూచించారు. ఎస్సీ కమ్యూనిటీకి ఉన్న ప్రత్యేక ప్రివిలేజెస్కి సంబంధించిన సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించుకోవాలని, ల్యాండ్, ఫైనాన్స్ మరియు ఇతర అట్రాసిటీ కేసుల ఎక్కువగా వస్తున్నాయని వీటి విషయంలో చట్టప్రకారం సరైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నేడు జరిగిన పి జి ఆర్ ఎస్ కార్యక్రమంలో ప్రజల నుండి వచ్చిన ఆర్జీలను ఎస్.సి. కమిషన్ చైర్మన్, కమిషన్ సభ్యుల స్వీకరించడం జరిగిందని ఇందులో మొత్తం 105 అర్జీలు రావడం జరిగిందన్నారు. ఈ ఆర్జీలకు సంబంధించి జిల్లాలోని సంబందిత శాఖల అధికారులు పరిశీలించి వాటికి నాణ్యమైన పరిష్కారం చూపాలని తెలిపారు. జిల్లా ఎస్.పి మాట్లాడుతూ కమిషన్ దృష్టికి వచ్చిన అన్ని సమస్యలను 15 రోజుల్లో పరిష్కరించి సమగ్ర నివేదికను అందిస్తామని తెలిపారు. నివేదికలు కేవలం డాక్యుమెంటరీగా కాకుండా, క్షేత్రస్థాయిలో వాస్తవాలను పరిశీలించిన ఆధారాలతో రూపొందించబడతాయన్నారు. జిల్లా డిఎస్పీ మరియు అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారులు ప్రతి కేసును క్షుణ్ణంగా పరిశీలించి సరైన పరిష్కారం చూపుతారని, అవసరమైతే రీ-ఓపెన్ చేసి విచారణ జరుపుతారని పేర్కొన్నారు. ప్రత్యేకంగా శాంతిభద్రతలు కాపాడుతూ, ప్రజలు భయపడకుండా, న్యాయం జరిగేదనే నమ్మకంతో అధికారులు పని చేస్తారని తెలిపారు. ప్రతి రెండు నెలలకు ఒకసారి విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశాలు జరుపుతూ, క్షేత్రస్థాయిలో సరిగా స్పందించని అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటూ, బాధితులకు చట్టప్రకారం న్యాయం అందిస్తామని తెలిపారు. ఎస్.సి. కమిషన్ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సోమవారం కలెక్టర్ సమక్షంలో అన్ని విభాగాలు సమావేశమై పి.జి.ఆర్.ఎస్. నందు ప్రజల నుండి వినతులను స్వీకరిస్తున్నాయని, వీటికి నిర్ణీత సమయంలో పరిష్కారం చూపడం లేదని తెలిపారు. ఆర్జీదరులతో స్నేహపూర్వకంగా సమయానికి ఫాలో-అప్ మరియు సమస్య పరిష్కారం ద్వారా మాత్రమే సంతృప్తి మరియు విశ్వాసం పెరుగుతుందన్నారు. అడంగల్ లోపాలు, పాస్‌బుక్ లోపాలు, భూమి నంబర్ల సమస్యలపై సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలన్నారు. PGRS ద్వారా సమర్థవంతమైన సేవలందించడం ద్వారా ప్రభుత్వంపై ప్రజల విశ్వాసం పెరుగుతుంది మరియు మంచి పేరు వస్తుందని తెలిపారు. జిల్లాలోని ఎస్.సి. కాలనీలకు సంబంధించి స్థల కేటాయింపు మరియు రోడ్డు నిర్మాణం ఏర్పాటు చేయాలని తెలిపారు. ప్రతి నెల సివిల్ రైట్స్ ప్రజలకు అందుబాటులో నిర్వహించాలని తెలిపారు. జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ….జిల్లాలో ప్రధానంగా రెవెన్యూ మరియు పోలీస్ విభాగాల సమస్యలను సమగ్రంగా పరిష్కరించడానికి, కలెక్టర్ సూచనల మేరకు సమన్వయ సమావేశాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సమావేశాల్లో తాసిల్దార్లు, ఎంపీడీవోలు, ఎస్.హెచ్.వోలు, మండల మరియు డివిజనల్ లెవెల్ అధికారులు, డీఎస్పీలు, ఆర్డీవోలు మరియు జిల్లా స్థాయి అధికారులు పాల్గొని, సమస్యల పరిష్కారం కోసం కమిటీలు ఏర్పరిచారని తద్వారా ఎస్.సి వర్గానికి చెందిన ప్రజలకు సమయానికి న్యాయం జరిగేలా చూస్తామని తెలిపారు. పిటిషనర్లు, ఎస్సీ కమిషన్ నుండి వచ్చిన ఇష్యూస్, మరియు ఇతర ఫీడ్‌బ్యాక్‌లు కలెక్టర్ కంట్రోల్లో పరిగణించబడతాయని, ప్రతి సమస్యకు సమయం కేటాయించి, పరిష్కారం లేదా కారణాలను వివరించి, తప్పనిసరిగా రిపోర్ట్‌గా పంపడం జరుగుతుందన్నారు. జిల్లా యంత్రాంగం తరపున కమీషన్ వారి ఆదేశాలను పాటించడానికి ఉన్నామని జిల్లా ప్రజలకు సమర్థవంతమైన, పారదర్శక, సమయానికి న్యాయసమ్మత సేవలు అందించడం సాధ్యమవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లాసాంఘిక సంక్షేమ అధికారి భరత్ కుమార్ రెడ్డి, డి.ఎస్.పి. లు, జిల్లా అధికారులు, పాల్గొన్నారు.
జిల్లాలో ఎస్ సి ల దాడులు, ప్రతిదాడులు తగ్గుముఖం పట్టాయి:రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్

ఎస్.సి కమిషన్ ఛైర్మన్ కె.ఎస్. జవహర్, : సమర్థవంతమైన జిల్లా కలెక్టర్ ఎస్ పి ల పర్యవేక్షణలో ఎస్. సి ల సమస్యల పరిష్కారం అవుతున్నదని, ఎస్ సి ల దాడులు, ప్రతిదాడులు తగ్గుముఖం పట్టాయని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఎస్ సి కమిషన్ ఛైర్మన్ కె. ఎస్. జవహర్ పేర్కొన్నారు. గురువారం జిల్లా కలెక్టరేట్ లో షెడ్యూల్ కులాల పై వివక్ష, వేదింపుల పై నిర్వహించిన సమీక్షా సమావేశం అనంతరం మీడియా ప్రతినిధులతో కమిషన్ చైర్మన్ మాట్లాడుతూ జిల్లాలో వివక్షాపూరిత ఘటనలు తక్కువగా ఉన్నాయని, కొద్దిపాటి భూ వివాదాలు, ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ దాడులు, ప్రతిదాడులు తగ్గుముఖం పట్టినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం జిల్లాలో ఎస్. సి లకు సంబంధించి మొత్తం 68 కేసులు పెండింగ్‌లో ఉండగా, అందులో 18 ఎట్రాసిటీ కేసులు ఉన్నాయని వెల్లడించారు. వీటిని డివిజన్ ల వారీగా వర్గీకరించి త్వరితగతిన పరిష్కరించాలని పోలీస్ అధికారులకు సూచించారు. ప్రతి గ్రామంలో స్మశాన వాటికల నిర్మాణం చేపట్టి జిల్లాను మోడల్ జిల్లాగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. నేషనల్ లైవ్‌స్టాక్ మిషన్, ముద్రా లోన్లు తదితర సంక్షేమ పథకాలపై దళితులకు విస్తృత అవగాహన కల్పించాలని సంబంధిత శాఖలకు ఆదేశించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్ష మేరకు కమిషన్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించినట్లు తెలిపారు. జిల్లాలో 22 శాతం పైగా ఉన్న దళితులకు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు సమర్థవంతంగా అందేలా చేయడం తమ ప్రధాన లక్ష్యమని చెప్పారు. సామాజికంగా వెనుకబడిన వర్గాలు ఎదుర్కొనే సమస్యల పరిష్కారానికి కట్టుబడి పనిచేస్తున్నామని స్పష్టం చేశారు. రాబోయే రెండు నెలల్లో మళ్లీ జిల్లాను సందర్శిస్తానని, పెండింగ్‌లో ఉన్న అన్ని ఫిర్యాదులు పరిష్కారం అవుతాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు. కొన్ని శాఖల్లో సమాచారం లోపం కారణంగా పనుల్లో ఆలస్యం జరుగుతోందని గుర్తించామన్నారు. ముఖ్యంగా పశుసంవర్ధక, వైద్య, విద్యా శాఖల్లో ఈ సమస్య ఉందని తెలిపారు. అలాగే 15 శాతం రిజర్వేషన్ల అమలులో వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు.

