ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి):దేశంలో ప్రమాదకరమైన రాజకీయాలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిర్వహిస్తుందని దేశ ప్రయోజనాలు దెబ్బతినే విధంగా బహుళజాతి సంస్థలకు మోడీ ప్రభుత్వం ఊడిగం చేస్తుందని భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ)జాతీయ కార్యదర్శి జి.ఈశ్వరయ్య విమర్శించారు. మంగళవారం ఉదయం స్థానిక సూర్యకళామందిరం లో సీపీఐ పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జి ఈశ్వరయ్య మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను, అభివృద్ధిపై దృష్టి చూపకుండా తిరుమల లడ్డు చుట్టూ రాజకీయాన్ని నిర్వహిస్తున్నారన్నారు. కల్తీ జరిగిందని నివేదిక వస్తే దానికి సంబంధించిన బాధ్యులపైన, అక్రమంగా కోట్లాది రూపాయలు దోపిడీ చేసిన వ్యక్తులపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సుమారు 30 ఏళ్ల క్రితం 4000 కోట్లతో వెలుగోడు ప్రాజెక్టును సీఎం చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా ప్రారంభించారని అది నేటికీ పూర్తికాలేదన్నారు. ఈ విధంగా ఎన్నో సాగు నీటి ప్రాజెక్టులు అసంపూర్తిగానే ఆగి ఉన్నాయన్నారు. అలాగే ఇంకా ఎన్నో సాగునీటి ప్రాజెక్టులు ఒరిస్సా సరిహద్దుల్లో ఆగిపోయన్నారు. రంగ అభివృద్ధికి స్వాగినేటి ప్రాజెక్టులు పూర్తి చేయాలని ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఆయిల్ నిక్షేపాలు ఉన్నాయని అది రాష్ట్రానికి వినియోగించుకోని యువతకు ఉపాధి కల్పనకు ప్రణాళికలను రూపొందించాలన్నారు. తిరుమల లడ్డుపై చంద్రబాబు, జగన్, పవన్ నాటకాలు ఆపి త్వరితగతిన చర్యలను బాధ్యులపై చేపట్టాలన్నారు. రాష్ట్రంలో నాలుగు సమ్మెట్ల ద్వారా 80 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయని చెబుతున్న ప్రభుత్వాలు అవి ఎంతవరకు అమలు జరిగాయో బహిర్గతం చేయాలన్నారు. రాష్ట్రంలో మహిళ, యువత, కార్మిక, సమస్యలను పరిష్కారం కోసం పోరాటం చేసి సీపీఐ బలోపేతానికి కృషి చేస్తామని ఈశ్వరయ్య చెప్పారు. సిపిఐ సీనియర్ నేత కె రామకృష్ణ మాట్లాడుతూ పూర్తి వ్యవసాయ ఆధారితమైన దేశంలో వ్యవసాయానికి తీవ్ర నష్టం చేసే విధంగా మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు. అమెరికా నుండి దిగుమతి చేసుకునే వ్యవసాయ ఉత్పత్తులకు సుంకం లేకుండా గాను అనుమతిచ్చి రైతులను, రైతు ఉత్పత్తులను నాశనం చేస్తుందన్నారు. అమెరికాకు తొత్తుగా మోడీ వ్యవహరిస్తున్నారని ఆయన చెప్పారు. మన దేశ నిర్ణయాలను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటన చేయడం దానికి మోడీ ఖండించకపోవడం పలు అనుమానాలు తావిస్తోందన్నారు. ప్రపంచాన్ని కుదిపేసిన ఎఫ్స్టీన్ ఫైల్స్ బహిర్గత అయిన తర్వాత మోడీపై ట్రంప్ మాటల దాడిని పెంచినా అతను స్పందించడం లేదన్నారు. కేంద్ర బడ్జెట్ 53 లక్షల నలభై వేల కోట్లతో ప్రవేశపెట్టారని అందులో 14 లక్షల కోట్లు వడ్డీ కట్టడాన్ని బట్టి చూస్తే దేశం మరింత అప్పుల ఊబిలోకి కూరుకు పోతుందని చెప్పారు. 2014లో దేశం అప్పు 55 లక్షల కోట్లు ఉండగా అది ప్రస్తుతం 214 లక్షల కోట్లకు చేరిందన్నారు. దీన్ని బట్టి చూస్తే దేశం ఏ విధంగా ముందుకు పోతుందో అర్థం చేసుకోవాలన్నారు. రాష్ట్రంలో సీఎం చంద్రబాబు పేదలకు అవసరమయ్యే వైద్యాన్ని ప్రైవేటుపరం చేయడం తగదన్నారు. ప్రభుత్వం తరఫున అన్ని వసతుల కల్పించి మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం ఎక్కడా లేదన్నారు. త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలపై ఈనెల 25, 26 తేదీల్లో ఢిల్లీలో జాతీయ కార్యవర్గంలో జరిగే సమావేశం చర్చిస్తామన్నారు. అలాగే గ్రామీణ ఉపాధి హామీని నిర్వీర్యం చేయడాన్ని నిరసిస్తూ 25, 26 తేదీల్లో అనంతపురం జిల్లా బండ్లపల్లిలో ఆందోళన నిర్వహిస్తామని రామకృష్ణ చెప్పారు. ఈ సమావేశంలో సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు రావుల వెంకయ్య అక్కినేని వనజ, ముప్పాళ్ల నాగేశ్వరావు రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తాటిపాక మధు, జిల్లా కార్యదర్శి కే బోడకొండ, సహాయ కార్యదర్శి తోకల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.