భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్
ప్రభాతదర్శిని, (తిరుపతి – ప్రతినిధి):న్యాయ సేవల కోసం కోర్టు తలుపులు తట్టే వేలాది మందికి న్యాయం లభిస్తుందన్న విశ్వాసం కల్పించాల్సిన భాద్యత న్యాయమూర్తులందరి పై ఉందని గౌ. భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. ఆదివారం తిరుపతి రూరల్ మండలం దామినేడు వద్ద భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జె.కె.మహేశ్వరి, జస్టిస్ పి.ఎస్.నరసింహ, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ ఎస్.వి.ఎన్. భట్టి, జస్టిస్ జాయ్ మాల్య బాగ్చీ లతో కలసి 16 కోర్టు భవనాల నూతన కోర్టు సముదాయ భూమి పూజ మరియు శిలాఫలకాన్ని ఆవిష్కరణ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ కోర్టు సముదాయాలు ఆసుపత్రుల్లా పనిచేయాలని నేను ఎప్పటి నుంచో చెబుతున్నాని, ఆసుపత్రికి వెళ్లిన రోగికి మొదట ప్రాథమిక చికిత్స అందించినట్లే, కోర్టుకు వచ్చే ప్రతి వ్యక్తికి కూడా భద్రత మరియు న్యాయం లభిస్తుందనే నమ్మకం కలగాలన్నారు. ఈ బాధ్యత బార్ మరియు బెంచ్ రెండింటి పై సమానంగా ఉంటుందన్నారు. ఈ కొత్త న్యాయస్థాన సముదాయం కూడా “న్యాయ దేవాలయం”గా మారాలని నేను కోరుకుంటున్నానని, ఇక్కడికి వచ్చే ప్రతి వ్యక్తి న్యాయం పొందిన ఆనందంతో వెళ్లాలన్నారు. తిరుపతి బార్‌ కు ఉన్న మేధస్సు, చారిత్రాత్మక వారసత్వం, మేధో సంపత్తి తో మరింత వికసించాలని ఆకాంక్షించారు. న్యాయ వ్యవస్థలో బార్ అసోసియేషన్ ఒక అవిభాజ్య భాగమని, న్యాయం అందించడం కేవలం బెంచ్ బాధ్యత మాత్రమే అనే భావన ఒక అపోహన్నారు. ముఖ్యంగా గర్వించదగిన సంప్రదాయం కలిగిన తిరుపతి బార్ అసోసియేషన్ వారికి ప్రత్యేకంగా చెబుతున్నానన్నారు. బార్ మరియు బెంచ్ ప్రత్యర్థులు కావని, అవి ఒకే సంస్థకు చెందిన రెండు చేతులన్నారు. బలమైన బార్ అసోసియేషన్ మంచి వాదనలను అందిస్తుందని, మంచి వాదన న్యాయమూర్తులను మరింత లోతుగా ఆలోచించడానికి, జాగ్రత్తగా విశ్లేషించడానికి, స్పష్టంగా తీర్పులు రాయడానికి ప్రేరేపిస్తుందన్నారు. బార్ అసోసియేషన్ అందించే సహకారం ఎంత నాణ్యమైనదైతే, న్యాయమూర్తి పనితీరు కూడా అంతే మెరుగ్గా ప్రతిఫలిస్తుందన్నారు. మీరు ఎంత బాగా వాదిస్తే, తీర్పుల నాణ్యత అంత మెరుగ్గా ఉంటుందన్నారు. మంచి కారణాలతో ఇచ్చిన తీర్పులు ప్రజల్లో న్యాయవ్యవస్థపై విశ్వాసాన్ని పెంచుతాయని, త్వరలో నిర్మించబడనున్న ఈ కొత్త కోర్టు సముదాయం న్యాయవాదులకు తగిన పని వాతావరణాన్ని కల్పిస్తుందన్నారు. జస్టిస్ ఎ.కె. మహేశ్వరి న్యాయ మౌలిక సదుపాయాల ప్రాముఖ్యత, విలువ మరియు అవసరాన్ని వివరించారన్నారు. కోర్టు భవన నిర్మాణం పూర్తయ్యాక కేవలం రాళ్లు, గోడలు లేదా భవనం మాత్రమే ముఖ్యమైనవి కావని, నా దృష్టిలో, భవనం నిర్మాణం పూర్తై, ఆధునిక మౌలిక సదుపాయాలు, సాంకేతిక పరికరాలు ఏర్పడి, బార్ సభ్యులు, న్యాయవ్యవస్థ, సిబ్బంది అందరూ సాంకేతికతో సిద్ధంగా ఉన్నప్పుడు సవాళ్ళు ప్రారంభం అవుతాయన్నారు. ఇందులో అందుబాటులో ఉండే ఖర్చుతో న్యాయాన్ని ప్రజలకు చేరవేయడం ఒకటైతే నిర్దిష్ట కాలపట్టికతో, ముందుగా ఊహించగలిగే విధంగా న్యాయ నిర్ణయ వ్యవస్థను అమలు చేయడం రెండవ సవాలు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు భవిష్యత్తు 50–100 సంవత్సరాల అవసరాలను దృష్టిలో పెట్టుకొని న్యాయ మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నానన్నారు. దేశం అభివృద్ధి చెందుతోందని, జనాభా పెరుగుతోందని, పట్టణీకరణ వేగంగా జరుగుతోందని, భవిష్యత్తులో న్యాయ మౌలిక సదుపాయాల కోసం పెద్ద భూభాగాలు లభించడం కష్టతరం కానున్న నేపథ్యంలో దూరదృష్టితో ఆలోచించి భూమిని కేటాయించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందిస్తున్నానన్నారు. ఈ కోర్టు సముదాయంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ భవన సముదాయం సమయానికి పూర్తవుతుందని నాకు పూర్తి విశ్వాసం ఉందని, మళ్లీ తాను శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించడానికి వచ్చినప్పుడు, ఈ న్యాయ సముదాయం విజయవంతంగా పనిచేస్తుండడం చూసి గర్వపడతానన్నారు. ఆంధ్రప్రదేశ్ హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి ధీరజ్ సింగ్ ఠాకూర్ మాట్లాడుతూ పరిస్థితులు అత్యంత క్లిష్టంగా ఉన్న సమయంలో కూడా జస్టిస్ మిశ్రా, జస్టిస్ మహేశ్వరి లు ప్రధాన న్యాయమూర్తులుగా బాధ్యతలు నిర్వహించారు. “పరిస్థితులు కఠినంగా మారినప్పుడు ధైర్యవంతులు ముందుకు వస్తారు” అనే సామెతను వారు నిజం చేశారన్నారు. విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ మౌలిక సదుపాయాల అభివృద్ధికి బలమైన పునాది వేయడం వారి ప్రధాన బాధ్యతగా ఉండగా, వారు ఆ బాధ్యతను నిబద్ధతతో నిర్వర్తించారన్నారు. సుప్రీంకోర్టు ఢిల్లీలో ఉన్నప్పటికీ, దేశవ్యాప్తంగా న్యాయ మౌలిక సదుపాయాల అభివృద్ధిపై చూపుతున్న శ్రద్ధ స్పష్టంగా కనిపిస్తోందని, దేశవ్యాప్తంగా కోర్టుల సమర్థవంతమైన నిర్వహణకు అవసరమైన మౌలిక సదుపాయాలపై నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తున్నారన్నారు. ఇది పవిత్రక్షేత్రమైన నగరం అయినప్పటికీ, దేశవ్యాప్తంగా న్యాయవ్యవస్థ అభివృద్ధిపై కూడా వారు సమాన శ్రద్ధ చూపుతున్నారని, గతంలో న్యాయమూర్తులు చాలా క్లిష్ట పరిస్థితుల్లో పనిచేసిన విషయం మనందరికీ తెలుసని, అనేక కోర్టు భవనాల్లో సరైన సదుపాయాలు లేకపోయేవని, కొన్ని చోట్ల మరుగుదొడ్లు కూడా ఉండేవి కాదని, మహిళా న్యాయవాదుల కోసం ప్రత్యేక సదుపాయాలు ఉండేవి కాదన్నారు. కోర్టు గదులు, న్యాయమూర్తుల ఛాంబర్లు కూడా తగిన స్థాయిలో ఉండేవి కాదన్నారు. ఇతర ప్రభుత్వ కార్యాలయాలతో పోలిస్తే న్యాయవ్యవస్థ మౌలిక సదుపాయాలు అత్యంత వెనుకబడి ఉండేవన్నారు. ప్రభుత్వాధికారులకు అధికారిక వాహనాలు ఉండేవి. అలాంటి కష్టకాలాన్ని మనం చూసామని, కానీ కాలక్రమేణా పరిస్థితులు మెరుగుపడ్డాయన్నారు. ఒకప్పుడు “మౌలిక సదుపాయాలు లేకపోయినా న్యాయమూర్తి చెట్టు కింద కూర్చొని కూడా న్యాయం చేయగలడు” అని చెప్పేవారని, దానికి సంకల్పం ఉండాలన్నారు. 2014–15 సంవత్సరాల్లో కాశ్మీర్‌లో వరదలు సంభవించినప్పుడు మొత్తం నగరం నీటిలో మునిగిపోయింది. హైకోర్టు భవనం కూడా దాదాపు ఒకటిన్నర అంతస్తు వరకు నీటిలో మునిగిపోయిందని, రికార్డులు నాశనమయ్యాయని, అయినప్పటికీ ఒక న్యాయమూర్తి నివాసంలో తాత్కాలిక హైకోర్టు ఏర్పాటు చేసి, టెంట్ వేసి నగరం మునిగిపోయినా న్యాయం ఆగదు అనే సందేశాన్ని ఇచ్చారన్నారు. అదే న్యాయమూర్తుల ఆత్మస్ఫూర్తి అన్నారు. పెండింగ్ కేసుల సంఖ్య పెరగడంతో సాంకేతికతను స్వీకరించడం అత్యవసరమైందని, పాత భవనాల్లో ఆధునిక సాంకేతిక వ్యవస్థలను అమలు చేయడం సాధ్యం కాదని, స్థలం కొరత వల్ల పాత కోర్టుల్లో పనిచేయడం కష్టమైందని బార్ అధ్యక్షులు కూడా చెప్పారన్నారు. అదనపు జిల్లా న్యాయమూర్తి శ్రీ గురునాథ్ గారు తెలిపినట్లుగా, పాత కోర్టు భవనానికి వెళ్లే మార్గం కూడా ఇరుకుగా ఉండి పనితీరును ప్రభావితం చేస్తోందన్నారు. హైకోర్టు మరియు నివాసాల్లో మేము సౌకర్యంగా ఉండగా, జిల్లా న్యాయవ్యవస్థ క్లిష్ట పరిస్థితుల్లో పనిచేస్తుండటం చూసి వెంటనే ఒక ప్రణాళిక రూపొందించామని, దీనివల్ల న్యాయమూర్తులు, న్యాయవాదులు, వాదిదారులు అందరికీ సౌకర్యం పెరిగి పనితీరు మెరుగుపడిందన్నారు. మంచి మౌలిక సదుపాయాలు ఉంటే పనితీరు కూడా పెరుగుతుందన్నారు. జస్టిస్ జె.కె.మహేశ్వరి* మాట్లాడుతూ తిరుమల కొండ కేవలం ఆధ్యాత్మికతకే కాదు, ధర్మానికి ప్రతీకని, న్యాయ సంప్రదాయంలో కోర్టును “న్యాయ దేవాలయం”గా పేర్కొంటామని, తిరుపతిలో దేవాలయం మరియు న్యాయస్థానం మధ్య ఉన్న భావన మరింత దగ్గరగా అనిపిస్తుందని, రెండింటి పునాది సత్యాన్వేషణ మరియు సమాజంలో సమతుల్యతను పునరుద్ధరించడమేనన్నారు. కోర్టు గొప్పదనం దాని నిర్మాణంలో కాదని, దాని లోపల జరిగే న్యాయ ప్రక్రియ నిష్పక్షపాత తీర్పులలో ఉంటుందన్నారు. భగవద్గీతలో చెప్పిన శ్లోకాన్ని పేర్కొంటూ . . “కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన…” న్యాయ వృత్తికి మార్గదర్శకమని, కర్తవ్యాన్ని ఫలాపేక్ష లేకుండా చేయాలని, న్యాయం అధికారానికి సాధనంగా కాకుండా సమానత్వానికి రక్షకుడిగా ఉండాలన్నారు. అభివృద్ధితో పాటు బలమైన సంస్థాగత వ్యవస్థ అవసరమని, కోర్టు బలహీనులకు చివరి ఆశ్రయం, హక్కులను రక్షించుకోవాలనుకునేవారికి మొదటి ఆశ్రయం కావాలన్నారు. తిరుపతికి సమీపంలో సుమారు 14.49 ఎకరాల విస్తీర్ణంలో జిల్లా కోర్టు నూతన న్యాయ సముదాయం నిర్మితమవుతోందని, మొత్తం 2,40,904 చదరపు అడుగుల నిర్మాణంలో కేవలం 9% మాత్రమే భవన నిర్మాణానికి ఉపయోగించబడగా, 57% భవిష్యత్ విస్తరణకు కేటాయించబడిందని, 16.6% పార్కింగ్ సదుపాయాల కోసం కేటాయించబడిందని, ఈ నిర్మాణ శైలి తిరుపతి గోపురం స్ఫూర్తితో రూపొందించబడిందని, న్యాయ శాఖ మరియు సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం 16 కోర్టు హాళ్లు, మెడికల్ రూమ్, వంటి సౌకర్యాలు, భవనం గ్రౌండ్ ఫ్లోర్ మరియు ఐదు అంతస్తులతో నిర్మించబడనుందని, దేశంలో మొదటిసారిగా కోర్టు సముదాయంలో ఎస్కలేటర్లు ఏర్పాటు చేయడం ద్వారా ప్రజల రాకపోకలను సులభతరం చేశారని, కేంద్ర ప్రాంగణం చుట్టూ కోర్టు హాళ్లు ఏర్పాటు చేయడం ద్వారా సహజ కాంతి, గాలి ప్రసరణకు ప్రాధాన్యత ఇచ్చారని, ఐదవ అంతస్తులో గ్రంథాలయం, ఆడిటోరియం, సమావేశ మందిరాలు ఏర్పాటు కానున్నాయని వీడియో ద్వారా సభలో ప్రదర్శించారు. ఆంధ్ర ప్రదేశ్ హై కోర్టు న్యాయమూర్తి మరియు జిల్లా పరిపాలనా న్యాయమూర్తి జస్టిస్ నినాల జయ సూర్య మాట్లాడుతూ ఇది నిజంగా మరపురాని సందర్భమని, జిల్లా న్యాయవ్యవస్థ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. ఈ మహత్తర రోజున గౌరవ ప్రధాన న్యాయమూర్తి సహా సుప్రీంకోర్టు గౌరవ న్యాయమూర్తులందరూ మన మధ్య ఉండటం మనందరికీ గౌరవ సూచకమన్నారు. ప్రస్తుతం కార్యక్రమంలో పాల్గొన్న లార్డ్‌షిప్‌లు సుప్రీంకోర్టు స్థాయికి చేరుకున్న విశిష్ట ప్రయాణం బార్ మరియు బెంచ్ సభ్యులందరికీ ప్రేరణ దీపస్తంభంలా నిలుస్తుందన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఉన్న ఈ పవిత్ర భూమి ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుంటే, జిల్లా న్యాయవ్యవస్థ చారిత్రకంగా మతపరమైన దానధర్మాలు, ధార్మిక సంస్థలు, ట్రస్ట్ ఆస్తులు, ఇనాం రద్దు చట్టం, ఎస్టేట్ రద్దు చట్టం వంటి అంశాలకు సంబంధించిన విస్తృతమైన న్యాయపోరాటాలను పరిష్కరించిందని మరియు న్యాయ అభివృద్ధికి విశేషంగా తోడ్పడిందన్నారు. ఈ పవిత్ర భూమిని పరిశుద్ధం చేసే దివ్య సాన్నిధ్యంతో ప్రేరణ పొందుతూ, న్యాయం మరియు ధర్మం అనే శాశ్వత సిద్ధాంతాల మార్గదర్శకత్వంలో, కొత్త కోర్టు సముదాయం నిర్మాణం జిల్లా న్యాయవ్యవస్థ నిరంతర ప్రయాణంలో మరో కీలక మైలురాయిగా నిలుస్తుందన్నారు. ఇది వాదీలు మరియు న్యాయవాదుల అవసరాలను తీర్చడమే కాకుండా, న్యాయాధికారులు తమ పవిత్ర కర్తవ్యాలను నిర్వర్తించడానికి అనుకూలమైన, సౌహార్దపూరిత వాతావరణాన్ని కూడా కల్పిస్తుందన్నారు. ఈ శుభ సందర్భంలో, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మరియు జిల్లా న్యాయవ్యవస్థ తరపున, సమస్త గౌరవనీయులకు మరోసారి హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తున్నానన్నారు. తిరుపతి జిల్లా బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జి.గజేంద్ర మాట్లాడుతూ తిరుపతి బార్ అసోసియేషన్ తరఫున, పదహారు కోర్టు హాళ్లతో నిర్మించబోయే ప్రతిష్ఠాత్మకమైన కొత్త కోర్టు సముదాయం భూమిపూజ కార్యక్రమానికి విచ్చేసిన విశిష్ట అతిధులందరికీ హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నానన్నారు. తిరుపతి అనేది ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు దర్శించుకునే పవిత్ర నగరమని అందరికీ తెలుసని, అయితే కోర్టులు మరియు న్యాయ వసతుల విషయానికి వస్తే, ఈ రోజు వరకు ఇది ఒక చిన్న నగరంలానే ఉండేదని, కానీ ఈ రోజు మా జీవితాల్లో ఒక అత్యంత ముఖ్యమైన రోజుగా మారిందని, ఎందుకంటే పదహారు కోర్టు హాళ్లతో కూడిన కొత్త భవనానికి ఈ రోజు భూమిపూజ జరుగుతోందని ఇది మేము ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న సందర్భం అని అన్నారు. తిరుపతి కోర్టులు మరియు బార్ అసోసియేషన్‌కు వంద సంవత్సరాలకుపైగా చరిత్ర ఉంది. అయితే భారత ప్రధాన న్యాయమూర్తి స్వయంగా, సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో కలిసి మా నగరాన్ని సందర్శించడం ఇదే మొదటిసారని, ఇదే ఈ రోజును చారిత్రాత్మకంగా మార్చిందన్నారు. సంవత్సరాలుగా న్యాయవాదులు, న్యాయస్థానాలకు వచ్చే ప్రజలు పాత, కిక్కిరిసిన భవనాల్లో ఎన్నో ఇబ్బందులు పడ్డారు. సరిపడా కోర్టు హాళ్లు లేవు, వసతులు తక్కువగా ఉన్నాయి. కానీ ఈ రోజు జరుగుతున్న ఈ భూమిపూజతో ఆ పరిస్థితి మారబోతోందన్నారు. ఈ భారీ కోర్టు సముదాయానికి అనుమతి ఇచ్చినందుకు మీ లార్డ్‌షిప్ కి మేము ఎంతో కృతజ్ఞులమని, ఇది సామాన్య ప్రజలకు న్యాయం సులభంగా అందుబాటులోకి తీసుకురావాలనే మీ ఆలోచనకు నిదర్శనమన్నారు. మీరు ఎప్పుడూ చెప్పినట్లుగా, న్యాయం పొందే అవకాశం ప్రజాస్వామ్య దేశంలో అత్యంత ముఖ్యమైన హక్కు అని , ఆధునిక సదుపాయాలతో కూడిన కోర్టు భవనం ఈ ప్రాంత ప్రజలకు త్వరితగతిన న్యాయం అందించడంలో ఎంతో దోహదపడుతుందన్నారు. తిరుపతి న్యాయవాదులుగా మేము నిజాయితీతో, అంకితభావంతో మా విధులు నిర్వర్తిస్తామని హామీ ఇస్తున్నామని, న్యాయం వేగంగా, న్యాయంగా అందేలా కోర్టులకు అన్ని విధాలుగా సహకరిస్తామన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి, జిల్లా కలెక్టర్ కి, పోలీస్ శాఖకు, జిల్లా పరిపాలనకు వారి సహకారానికి ధన్యవాదాలు. కార్యక్రమంలో పాల్గొన్న భారత ప్రధాన న్యాయమూర్తి, భారత సుప్రీం కోర్టు న్యాయమూర్తులు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులు, న్యాయాధికారులు, జిల్లా యంత్రాంగం, న్యాయవాదులు తదితరులకు ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రినిసిపల్ జడ్జి అరుణ సారిక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా భారత ప్రధాన న్యాయమూర్తి, భారత సుప్రీం కోర్టు న్యాయమూర్తులు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులకు శాలువాలతో సత్కరించి పూలమాలలు వేసి శ్రీవారి ప్రతిమలను బహుకరించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం న్యాయమూర్తి జస్టిస్ డొనాది రమేష్, ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం న్యాయమూర్తి జస్టిస్ మహేశ్వరరావు కుంచం, ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం న్యాయమూర్తి జస్టిస్ టి.సి.డి. శేఖర్, డిఐజీ షిమోజి బాయ్, చిత్తూరు జిల్లా ఉమ్మడి డిస్ట్రిక్ట్ ప్రిన్సిపల్ జడ్జి అరుణ సారిక, అడిషనల్ జిల్లా జడ్జి గురునాధం, తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్, జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు, ట్రైనీ కలెక్టర్ సందీప్ రఘువాన్షి, అడిషనల్ ఎస్పీ రవి మనోహరాచారి, తిరుపతి ఆర్టీవో రామ్మోహన్ ,బార్ అసోసియేషన్ సభ్యులు, న్యాయాధికారులు, న్యాయవాదులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.