ప్రభాతదర్శిని, (నెల్లూరుప్రతినిధి): ఈ క్రాప్ నమోదును వేగంగా పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. బుధవారం ఇందుకూరుపేట మండలం కొరుటూరు పంచాయతీలో ఆన్లైన్లో నమోదు చేసిన పంట వివరాలను కలెక్టర్ పరిశీలించారు. రైతు గండవరపు అమర్నాద్ రెడ్డి పొలములో గ్రామ  వ్యవసాయ సహాయకురాలు ఝాన్సీ ఈ- పంట యాప్ నుండి రైతుల వివరాలను డౌన్లోడ్ చేసుకొని నమోదు చేసే విధానాన్ని కలెక్టర్ కు వివరించారు. భూమి యజమానులు కౌలు రైతుల నమోదు వివరాలను పరిశీలించారు. నమోదు చేయునపుడు రైతుల పంట విస్తీర్ణము, పంట రకము , నాటిన తేదీ, అధార్ నంబరు, ఫోన్ నెంబర్  తదితర అంశాలు కరెక్ట్గా ఉన్నయా అని పరిశీలించారు. ఆదార్ నెంబర్ నమోదు వలన కొనుగోలు కేంద్రానికి పంట వేసిన  రైతులే వచ్చే అవకాసం ఉందని సంతృప్తి వ్యక్తం చేసారు. ఈ సందర్భంగా రైతులు ధాన్యం ఆరబెట్టుకునేందుకు డ్రయ్యర్ ఏర్పాటు చేయవలసినది గా కలెక్టర్ దృష్టికి తీసుకురాగా ఏర్పాటు చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, బ్యాంకు గారంటీ , మిల్లుల టాగింగ్ లలో  రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు . సమయానుకూల వాతావరణ సమాచారాన్ని అందించడంలో ఆటోమేటిక్ వెదర్ స్టేషన్లు కీలక పాత్ర : జిల్లాలో ఏర్పాటు చేసిన ఆటోమేటిక్ వెదర్ స్టేషన్లు రైతులకు, ప్రజలకు సమయానుకూల వాతావరణ సమాచారాన్ని అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల తెలిపారు. బుధవారం ఇందుకూరుపేట మండలం కొరుటూరు గ్రామంలో ఏర్పాటు చేసిన ఆటోమేటిక్ వెదర్ స్టేషన్ ను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ డైరెక్టర్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టడీస్ వారి సూచనల మేరకు జిల్లాలో 9 నూతన ఆటోమెటిక్ వెదర్ స్టేషన్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.ఈ స్టేషన్ల ద్వారా ఉష్ణోగ్రత, వర్షపాతం, గాలి వేగం, ఆర్ద్రత, వాయు పీడనం వంటి వివరాలు రియల్ టైమ్‌లో నమోదవుతాయని, దీంతో రైతులు వాతావరణ అంచనాల ఆధారంగా పంటల సాగు, ఎరువుల వినియోగం, పురుగుమందుల పిచికారీ వంటి వ్యవసాయ కార్యకలాపాలను సమర్థవంతంగా నిర్వహించుకునే అవకాశం కలుగుతుందన్నారు. అలాగే తుఫానులు, భారీ వర్షాలు వంటి విపత్తుల సమయంలో ముందస్తు హెచ్చరికలు జారీ చేయడానికి ఈ డేటా ఎంతో ఉపయోగపడుతుంది. వాతావరణ మార్పుల నేపథ్యంలో ప్రజల ప్రాణ, ఆస్తి రక్షణ కోసం ఆధునిక సాంకేతికతను వినియోగిస్తున్నామని కలెక్టర్ పేర్కొన్నారు. కలెక్టర్ వెంట ఏఎస్ఓ ఏవి రమేష్, సాంకేతిక నిపుణులు తదితరులు ఉన్నారు.