అర్జీదారునికి స్పష్టంగా ఎండార్స్మెంట్ చేసి ఇవ్వాలి, తప్పుడు ఎండార్స్మెంట్ ఇవ్వరాదు తిరుపతి జిల్లా కలెక్టర్ డా ఎస్. వెంకటేశ్వర్
ప్రభాతదర్శిని ( తిరుపతి – ప్రతినిధి):ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వచ్చే అర్జీలను నిర్ణీత గడువులోగా రీ ఓపెన్ కి ఆస్కారం లేకుండా నాణ్యతతో పరిష్కారం చూపేలా సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ డా ఎస్. వెంకటేశ్వర్ ఆదేశించారు. మంగళవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా అధికారులతో ప్రత్యక్షంగా,మునిసిపల్ కమిషనర్లు, రెవెన్యూ డివిజన్, మండల, తదితర అధికారులతో వర్చువల్ గా ప్రజా సమస్యల పరిష్కార వేదిక అర్జీలు పరిష్కారంపై జిల్లా రెవెన్యూ అధికారి జి. నరసింహులు తో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సంధర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నదని లో వచ్చిన అర్జీలను నాణ్యతతో గడువులోగా పరిష్కారం చూపాలని, ఎలాంటి అలసత్వం ఉండరాదని తెలిపారు. పరిష్కారo చూపలేని అర్జీదారునికి స్పష్టంగా ఎండార్స్మెంట్ చేసి తెలపాలని, తప్పుడు ఎండార్స్మెంట్ ఇవ్వరాదని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే ను జిల్లాలో పూర్తి ఖచ్చితత్వంతో, ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా నిర్వహించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రతి కుటుంబానికి సంబంధించిన వివరాలు సక్రమంగా నమోదు కావడం ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలు నిజమైన అర్హులకు చేరుతాయని తెలిపారు.యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే సందర్భంగా కుటుంబ సభ్యుల వివరాలు, ఆదాయ సమాచారం, సామాజిక–ఆర్థిక స్థితిగతులు పూర్తిగా పరిశీలించి నమోదు చేయాలి,డూప్లికేట్ ఎంట్రీలు, తప్పు సమాచారం నమోదు కాకుండా క్రాస్ వెరిఫికేషన్ తప్పనిసరిగా చేయాలి,ప్రజలకు సర్వే ఉద్దేశ్యం, ప్రయోజనాలపై స్పష్టమైన అవగాహన కల్పించాలి అని సూచించారు. సర్వే ప్రక్రియలో నిర్లక్ష్యం, తప్పుడు నమోదు జరిగితే సంబంధిత సిబ్బంది, అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ హెచ్చరించారు. యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే ప్రభుత్వ విధానాలకు పునాది లాంటిదని, దీన్ని అత్యంత బాధ్యతగా చేపట్టాలని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అక్షర ఆంధ్ర”అక్షరాస్యతను ప్రోత్సహించి ప్రతి పౌరుడిని చదువుకునే సామర్థ్యం కలిగినవారిగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “అక్షర ఆంధ్ర” కార్యక్రమం సమర్థవంతంగా అమలవుతుందని ఈ కార్యక్రమం ద్వారా నిరక్షరాస్యత నిర్మూలనతో పాటు సామాజిక, ఆర్థిక అభివృద్ధికి దోహదపడే దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. అక్షరాస్యత ఒక వ్యక్తి జీవితాన్ని మాత్రమే కాక సమాజాన్ని కూడా అభివృద్ధి పథంలో నడిపించే కీలక సాధనమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యువత, స్వచ్ఛంద సంస్థలు, మహిళా సంఘాలు చురుకుగా పాల్గొని సహకరించాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పి 4 విధానాన్ని జిల్లాలో ప్రజల భాగస్వామ్యంతో మరింత బలంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం, ప్రైవేట్ సంస్థలు, ప్రజలు కలిసి అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములయ్యేలా కార్యాచరణ రూపొందించాలని సూచించారు. అమలులో గ్రామ, మండల స్థాయిలో ప్రజల చురుకైన భాగస్వామ్యం ఉండాలి,స్థానిక అవసరాలకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించాలి, పారదర్శకత, బాధ్యతతో సమన్వయముతో నిర్వహించాలి అని తెలిపారు.పి 4 ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా ముందుకు సాగుతాయని, ప్రజల నమ్మకం పెరుగుతుందని పేర్కొంటూ, అందరూ ఆర్డీఓలు, తహసీల్దార్లు ఈ విధానాన్ని ప్రాధాన్యతగా తీసుకొని అమలు చేయాలని తెలిపారు. ఈ సమావేశంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రోజ్ మాండ్, ఖజానా అధికారి డిడిఓ నారాయణ రెడ్డి, జి ఎస్ డబ్ల్యూ ఎస్ కోఆర్డినేటర్ జగదీష్, సి పి ఓ రాజశేఖర్, వ్యవసాయ శాఖ అధికారి, ప్రసాదరావు, డిఎంఅండ్ హెచ్ ఓ బాలకృష్ణ నాయక్, డి సి హెచ్ ఎస్ ఆనందమూర్తి, ఆర్ అండ్ బి ఎస్ ఈ రాజా నాయక్,కార్మిక శాఖ అధికారి లాలు నాయక్, డి ఎస్ ఓ రాజు,అనిమల్ హస్బండ్రీ జెడి డాక్టర్ రవికుమార్, ల్యాండ్ అండ్ సర్వే అధికారి అరుణ కుమార్, భూగర్భ శాఖ అధికారి, బాలాజీ నాయక్, డి ఈ ఓ కుమార్, ఐ సి డి ఎస్ పిడి వసంతా బాయి, సంబందిత జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
