ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): దేశవ్యాప్తంగా ప్రస్తుతం పనిచేస్తున్న ఎరువుల ప్రయోగశాలల బలోపేతానికి ఎన్ని నిధులు ఖర్చు చేశారని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ఆరా తీశారు. ఈ మేరకు శుక్రవారం లోక్‌సభలో ఆయన పలు అంశాలపై ప్రశ్నించారు. దేశంలో ప్రస్తుతం పనిచేస్తున్న ఎరువుల పరీక్ష ప్రయోగశాలలు, వాటి సామర్థ్యం, గత ఐదేళ్లలో ప్రయోగశాలలు పరీక్షించిన మొత్తం ఎరువుల నమూనాల సంఖ్య, దేశవ్యాప్తంగా సకాలంలో పరీక్షలు, నాణ్యత అమలును నిర్ధారించడానికి తీసుకున్న చర్యలు, ఖాళీల భర్తీ వివరాలపై వివరాలు కోరారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ప్రశ్నలకు కేంద్ర రసాయనాలు మరియు ఎరువుల శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్‌ సమాధానం ఇచ్చారు. దేశవ్యాప్తంగా 84(కేంద్ర ప్రభుత్వం 4, రాష్ట్ర ప్రభుత్వాలు 80) ఎరువుల పరీక్షల ప్రయోగశాలలు ఉన్నాయని, వాటి 2024-25 వార్షిక సామర్థ్యం 1,88,236 అన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 3 ఎరువుల ప్రయోగశాలలు ( అనంతపురం, బాపట్ల, తాడేపల్లిగూడెం) ఒక్కోదాని సామర్థ్యం 3500 అన్నారు. దేశవ్యాప్తంగా 2024-2025 సంవత్సరానికి గాను దేశవ్యాప్తంగా ప్రయోశాలల నిర్వహణకు రూ.202.25 కోట్లు మంజూరు చేయగా.. ఇప్పటివరకు ఖర్చు చేయలేదన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని 3 ప్రయోగశాలలకు రూ.8.81 కోట్లు మంజూరు చేశామన్నారు. ఇక ఏపీకి 2020-21లో రూ.8.92 కోట్లు, 2021-22లో రూ.1.68 కోట్లు, 2022-23లో రూ. 4.37 కోట్లు, 2023-24లో రూ.9.52 కోట్లు మంజూరు చేయగా.. రూ. 4.20 కోట్లు ఖర్చు చేశారన్నారు. మిగతా ఏ సంవత్సరంలోనూ ఖర్చు చేసిన దాఖలాలు లేవన్నారు. ప్రయోగశాలల్లో ఖాళీలను భర్తీ చేయడానికి తీసుకున్న చర్యలు రాష్ట్రానికి రాష్ట్రానికి మారుతూ ఉంటాయని, స్థానిక రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రయోగశాలల లక్ష్యం, సిబ్బంది, ఖాళీలను భర్తీ చేసే విధానాన్ని నిర్ణయించే అధికారం ఉందన్నారు. ఎరువుల సకాలంలో పరీక్ష కోసం, వ్యవసాయం మరియు రైతు సంక్షేమ శాఖ (DA&FW) ఎరువుల నియంత్రణ ఉత్తర్వును నోటిఫై చేసిందని, 1985లో ప్రయోగశాలలకు పరీక్షా ప్రోటోకాల్, విశ్లేషణ పరికరాల సమయ పరిమితిని నిర్దేశించారన్నారు. కేంద్ర ప్రభుత్వం & రాష్ట్ర ప్రభుత్వం నోటిఫై చేసిన అన్ని ప్రయోగశాలలు ఎరువుల విశ్లేషణ కోసం ఇలాంటి పరీక్షా ప్రోటోకాల్‌ను అనుసరించాల్సి ఉంటుందని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎరువుల నియంత్రణ ఉత్తర్వు,-1985 ప్రకారం రైతులకు పంపిణీ చేసిన ఎరువుల నాణ్యతను తనిఖీ చేయడానికి/నిర్ధారించడానికి ఎరువుల తనిఖీదారులను నియమిస్తాయని, ఎరువులు తయారు చేయబడిన/దిగుమతి చేయబడిన లేదా నిల్వ చేయబడిన, అమ్మకానికి ప్రదర్శించబడిన ఏదైనా ప్రాంగణంలోకి ప్రవేశించి శోధించడానికి ఎరువుల తనిఖీదారులకు అధికారం ఉంటుందన్నారు. నాణ్యత నియంత్రణను ఉల్లంఘిస్తే తప్పకుండా తగిన చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఎరువుల నియంత్రణ ఉత్తర్వు,-1985 ఉల్లంఘనకు జరిమానాలు, 3 నెలలు లేదా అంతకంటే ఎక్కువ ఏడు సంవత్సరాల వరకు జరిమానాతో లేదా లేకుండా జైలు శిక్ష విధించవచ్చన్నారు.