సైకిల్ కు ఓటేశారు…అభివృద్ధికి చోటిచ్చారు
ప్రజా సంక్షేమమే కూటమికి పరమావధి
అభివృద్ధి కార్యక్రమాలకు కుప్పమే ప్రయోగశాల
కుప్పంలో పేదల సేవలో కార్యక్రమం ప్రజావేదికలో ముఖ్యమంత్రి

ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): గత ఎన్నికల్లో సైకిల్ కు ఓటేసి ప్రజలు అభివృద్ధికి చోటిచ్చారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ప్రజా సంక్షేమమే పరమావధిగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన స్పష్టం చేశారు. కుప్పం నియోజకవర్గం గుడిపల్లె మండలం బెగ్గిలపల్లెలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. బెగ్గిలపల్లెలో ముగ్గురు లబ్దిదారుల నివాసాలకు వెళ్లిన సీఎం మునెమ్మ అనే వృద్ధురాలికి వృద్ధాప్య పింఛను, చిన్న తాయమ్మ అనే మహిళకు వితంతు పింఛను, వెంకట రామప్ప అనే లబ్ధిదారుకు వృద్ధాప్య పింఛను అందించారు. లబ్ధిదారుల కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. ఆ గ్రామానికి వెళ్లే మార్గంలో తనను చూసేందుకు తరలి వచ్చిన మహిళలకు సీఎం చంద్రబాబు అప్యాయంగా పలకరించారు. గ్రామస్థుల నుంచి వినతిపత్రాలను స్వీకరించారు. అంతకుముందు బెగ్గిలపల్లె మండల పరిషత్ పాఠశాల విద్యార్ధులతో సీఎం ముచ్చటించారు. అనంతరం పేదల సేవలో ప్రజా వేదిక బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. దేశంలోని ఏ రాష్ట్రమూ ఇవ్వనంత సంక్షేమాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందిస్తున్నామని సీఎం వివరించారు. ప్రతీ నెలా రూ. 2730 కోట్ల మేర పెన్షన్ల రూపంలో లబ్దిదారులకు అందిస్తున్నామని స్పష్టం చేశారు. పొరుగున తమిళనాడులో నెలకు రూ. 315 కోట్లు, కర్ణాటకలో రూ. 392 కోట్లు పెన్షన్లు నిమిత్తం ఖర్చు చేస్తున్నారని సీఎం అన్నారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని ఏపీలో పేదలకు ఏ స్థాయిలో పెన్షన్ అందచేస్తున్నామనేది గుర్తించాలన్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక అమలు చేసిన సూపర్ సిక్స్ పథకాలు సూపర్ హిట్ అయ్యాయని అన్నారు. ఎంత మంది పిల్లలున్నా అందరికీ తల్లికి వందనం పథకం వర్తింప చేశామన్నారు. దీపం-2.0 పథకం కింద గ్యాస్ సిలిండర్లు ఇచ్చామని వివరించారు. అన్ని రంగాల్లోనూ మహిళలకు ప్రాధాన్యం కల్పించింది టీడీపీనే అని అన్నారు. ఆస్తిలో సమాన హక్కు ఎన్టీఆర్ కల్పిస్తే తాను 33 శాతం రిజర్వేషన్లను ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో అమలు చేసినట్టు వివరించారు. త్వరలో చట్ట సభల్లో 33 శాతం రిజర్వేషన్లు రానున్నాయన్నారు. సమీప భవిష్యత్తులో మహిళలు ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులుగా ఎదుగుతారని అన్నారు. వన్ ఫ్యామిలీ వన్ ఎంట్రప్రెన్యూర్ ద్వారా లక్ష మంది మహిళా పారిశ్రామిక వేత్తలను తయారు చేసే లక్ష్యాన్ని మరింత పెంచుతామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. డ్వాక్రా సంఘాల్లోని మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని సీఎం ఆకాంక్షించారు.
అభివృద్ధి కార్యక్రమాలకు కుప్పం ఓ ప్రయోగశాల: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు కుప్పం నియోజకవర్గమే ఓ ప్రయోగశాల అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. అక్కడ అమలు చేసి విజయవంతమైన మోడళ్లను రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసి విజయం సాధిస్తున్నామని తెలిపారు. కుప్పంలో పైలట్ గా ప్రారంభించి విజయవంతమైన డిజిటల్ హెల్త్ రికార్డుల ప్రాజెక్టు సంజీవనిని ఈ ఏడాదిలో రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తామని సీఎం అన్నారు. మెరుగైన వైద్యాన్ని సేలవను ప్రజల ఇంటి వద్దకే అందుబాటులోకి తెచ్చేలా ఈ సంజీవని ప్రాజెక్టు అమలు చేయాలని నిర్ణయించినట్టు స్పష్టం చేశారు. ఫోన్ల ద్వారా వైద్యుల అప్పాయింట్మెంట్లు, నాణ్యమైన వైద్య సేవలు అందేలా ఈ ప్రాజెక్టు ఉపకరిస్తుందన్నారు. సోలార్ రూఫ్ టాప్ ద్వారా ప్రజలకు విద్యుత్ భారం తగ్గేలా చూస్తున్నామని.. కుప్పం నియోజకవర్గంలో ఈ ప్రాజెక్టును సమర్ధంగా అమలు చేస్తామన్నారు. హంద్రీనీవా ద్వారా కృష్ణా జలాలను తీసుకువచ్చి రైతులకు నీళ్లు అందించామని సీఎం అన్నారు. నియోజకవర్గంలో వర్షపు నీటిని కూడా సద్వినియోగం చేసుకునేలా లింక్ కెనాల్స్, చెరువులను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించామని వివరించారు. కుప్పంలోని యువత ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లకుండా ఇండస్ట్రియల్ పార్కును ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. రూ. 7088 కోట్ల పెట్టుబడులతో 16 పరిశ్రమలు వచ్చాయని వీటి ద్వారా 34 వేల పైచిలుకు మందికి ఉద్యోగాలు వస్తాయన్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా 70 వేల మందికి ఉపాధి లభించేలా చేస్తున్నామని సీఎం స్పష్టం చేశారు. ప్రస్తుత పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా ఆదిత్య బిర్లా సంస్థతో కలిసి మల్టీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను ప్రారంభించామని తెలిపారు. వర్క్ ఫ్రం హోం చేసుకునే వారికి… ఆఫీసు స్పేస్ లేని వారికి ఉపయోగపడేలా కుప్పంలో రాష్ట్రంలోనే తొలి కో-వర్కింగ్ స్పేస్ ను ఏర్పాటు చేశామని అన్నారు. కంగుంది ప్రాంతాన్ని పర్యాటకంగా తీర్చిదిద్దుతున్నామని అన్నారు. రాక్ క్లైబింగ్ పార్కును కూడా అభివృద్ధి చేశామన్నారు. ఫ్లవర్ ఫెస్టివల్ ద్వారా పర్యాటకానికి దారులు తెరిచామని.. ఇక్కడ హోం స్టేలు కూడా అద్భుతంగా తీర్చిదిద్దారన్నారు. మొత్తంగా కుప్పంలో ప్రతీ ఒక్కరికీ ఉపాధి కల్పించే ప్రయత్నం చేస్తున్నామని దానిని సద్వినియోగం చేసుకోవాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. హంద్రీనీవా, గాలేరు నగరి సహా రాయలసీమలోని అన్ని ప్రాజెక్టులూ పూర్తి చేస్తామన్నారు. స్వర్ణాంధ్ర విజన్ తో ఏపీని అగ్రస్థానంలో నిలబెడతామని కుప్పం అభివృద్దే దానికి మొదటి మెట్టని ముఖ్యమంత్రి వివరించారు.
ఐదేళ్ల పాటు పట్టి పీడించటం వల్లే రాష్ట్రానికి కష్టాలు: విధ్వంస పాలనతో రాష్ట్ర అభివృద్ధిని వెనక్కు నెట్టారని.. వైసీపీ ఐదేళ్ల పాలన కారణంగానే కూటమి ప్రభుత్వానికి వారసత్వ సమస్యలు వచ్చాయని ముఖ్యమంత్రి ఆక్షేపించారు. ప్రజల ఆస్తులపై ఫొటోలు వేసుకున్నారని, గెలాక్సీ గ్రానైట్ తో సరిహద్దు రాళ్లు తయారు చేయించి వాటిపై బొమ్మలు ముద్రించారని అన్నారు. దీనికోసం రూ.700 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేశారన్నారు. దుర్మార్గం చేసింది చాలక తమ పాలనే బెటర్ అంటూ ఇప్పుడు మాట్లాడుతున్నారని ముఖ్యమంత్రి ఎద్దేవా చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్టు పేరుతో ఓ నల్ల చట్టం తెచ్చారని.. భూ వివాదాలు వస్తే స్థానిక కోర్టులకు వెళ్లే అవకాశం లేకుండా చేశారన్నారు. ప్రజల ఆస్తులు కాజేసే ఘోరమైన చట్టం చేసి తనదే గొప్ప చట్టం అంటూ బుకాయిస్తున్నారని సీఎం అన్నారు. 22 ఏ పేరుతో భూ వివాదాలు సృష్టించారని ఆ వివాదాలు పరిష్కరించేందుకు ఆయన పెట్టుకున్న గుమస్తాకే అప్పగించేలా చట్టం చేసుకున్నారని ఆక్షేపించారు. గత ప్రభుత్వం చేసిన నల్ల చట్టాన్ని రద్దు చేసి… ఆ పాలనలో జరిగిన సర్వే తప్పిదాలను సరిచేస్తున్నామని అన్నారు. ఎవరూ ట్యాంపర్ చేయలేని విధంగా ఆధునిక టెక్నాలజీని వినియోగించి పట్టాదారు పాస్ పుస్తకాలను ముద్రించి అందిస్తున్నామని అన్నారు. పేదలకు అండగా ఉండేలా వివిధ రకాల కార్యక్రమాలను కూటమి ప్రభుత్వం చేపట్టిందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు, జిల్లా కలెక్టర్ సహా ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
పర్యావరణ పరిరక్షణ- మహిళా సాధికారిత లక్ష్యంగా ఇ-సైకిళ్ల పంపిణీ: పర్యావరణ పరిరక్షణ- సాధికారత లక్ష్యంగా మహిళలకు ఇ-సైకిళ్లను ముఖ్యమంత్రి పంపిణీ చేశారు. 24 గంటల వ్యవధిలో 5555 సైకిళ్లను లబ్దిదారులకు పంపిణీ చేసి గిన్నీస్ వరల్డ్ రికార్డును కుప్పం నియోజకవర్గం నమోదు చేసింది. ఇ-సైకిళ్లను ఇంత పెద్ద సంఖ్యలో పంపిణీ చేయటంపై ఈ రికార్డు నమోదు అయినట్టు గిన్నీస్ వరల్డ్ బుక్ అజుడికేటర్ ప్రకటించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, సైకిళ్ల తయారీ సంస్థ ఇ-మోటరాడ్ ప్రతినిధులకు సర్టిఫికెట్ అందించారు. కుప్పాన్ని కాలుష్య రహితంగా చేసేందుకు తీసుకున్న చర్యల్లో భాగంగా 5555 ఇ-సైకిళ్లను పంపిణీ చేసినట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఇ- సైకిళ్లకు సూపర్ సైకిల్ అని పేరుపెట్టినట్టు సీఎం వివరించారు. 60 కిలోమీటర్ల వరకూ సైకిల్ పైనే ప్రయాణించి పనులు చేసుకోవచ్చని సీఎం తెలిపారు. వీటి ద్వారా ప్రజారోగ్యాన్ని కాపాడటంతో పాటు కాలుష్యాన్ని కూడా తగ్గించేలా చూస్తున్నామని అన్నారు. ఇ-సైకిళ్ల వినియోగం ద్వారా ప్రతీ కుటుంబం రూ.1000 నుంచి 1500 వరకూ ఆదా చేసుకోవచ్చని అన్నారు. స్కూటర్ ద్వారా ప్రతీ కిలోమీటరు ప్రయాణానికి 68 గ్రాముల మేర కార్బన్ డై ఆక్సైడ్ విడుదలై కలుషితం అవుతుందని.. ఇ-సైకిల్ ద్వారా కేవలం 15 గ్రాములు మాత్రమే పరోక్షంగా వస్తుందని తద్వారా 75 శాతం ఉద్గారాలు తగ్గుతాయన్నారు. ప్రతీ వెయ్యి ఇ- సైకిళ్ల ద్వారా ఏడాదికి 37 టన్నుల కార్బన్ డై ఆక్సైడ్ తగ్గుతుందని ముఖ్యమంత్రి అన్నారు. సైకిల్ అంటే పురోగతికి చిహ్నమని.. ఇ-సైకిల్ ఈ తరానికి సింబల్ గా నిలుస్తుందని అన్నారు. కడుపల్లెలోని తన నివాసం నుంచి ముఖ్యమంత్రి ఇ- సైకిళ్లపై ర్యాలీగా ప్రజా వేదిక వద్దకు చేరుకున్నారు. దాదాపు ఏడు కిలోమీటర్ల మేర హుషారుగా సైకిల్ తొక్కిన ముఖ్యమంత్రి మార్గమధ్యంలో ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు.