ఓజిలిలో ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు
ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఐటీ , మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ బాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం ఖాయమని ఓజిలి మండల టీడీపీ కన్వీనర్ విజయ్ కుమార్ నాయుడు ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం ఓజిలిలో నారా లోకేష్ జన్మదిన వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ సందర్బంగా మండల కన్వీనర్ విజయ్ కుమార్ నాయుడు మాట్లాడుతూ దేశంలోనే తొలిసారిగా పార్టీ కార్యకర్తల కోసం సంక్షేమ నిధిని ఏర్పాటు చేసిన ఘనత లోకేష్‌దేనని కొనియాడారు. పాదయాత్రలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ లోకేష్ ప్రజల గుండెల్లో చోటు సంపాదించుకున్నారని, ఆయన మరిన్ని ఉన్నత పదవులు చేపట్టి పేద ప్రజలకు సేవ చేయాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో కాబోయే ముఖ్యమంత్రి లోకేష్ బాబు అని యువ కెరటంగా అభివర్ణించారు. ఆయన యువగళం పాదయాత్ర ద్వారా పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించి, తండ్రికి తగ్గ తనయుడిగా నిరూపించుకున్నారని ఆయన కొనియాడారు. యువగళం పాదయాత్ర ద్వారా లోకేష్ బాబు సామాన్య ప్రజల కష్టాలను స్వయంగా తెలుసుకున్నారని, ఎండనక, వాననక వేల కిలోమీటర్లు నడిచి ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్నారని పేర్కొన్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కార్యకర్తలకు అండగా నిలవడంలోనూ, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడటంలోనూ లోకేష్ బాబు చూపిస్తున్న ధైర్యం అభినందనీయమన్నారు. రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు లోకేష్ ఒక ఆశాకిరణమని, ఐటీ రంగంలో పెట్టుబడులు తీసుకురావడంలో ఉపాధి కల్పనలో ఆయనకు ఉన్న పట్టు రాష్ట్రానికి ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలోప్రధాన కార్యదర్శి దాసరి నిరంజన్, టీడీపీ సీనియర్ నేతలు పాడి వెంకటసుబ్బయ్య, మల్లి మోహన్, రఫీ, అల్లాభక్షు, కమలాకర్, సుబ్రహ్మణ్యం రాజు, ఖలీల్, దారా అంకయ్య, అమరేంద్ర, వెంకటేశ్వర్లు, మస్తాన్ రెడ్డి, సుబ్బారావు, కురుగొండ పద్మమ్మ తదితరులు పాల్గొన్నారు.
