ఏపీ ఎస్సీ కమిషన్ చైర్మన్ కె ఎస్ జవహర్ ప్రభాతదర్శిని, (విజయవాడ-ప్రతినిధి): రాజ్యాంగబద్ధ పదవిని స్వీకరించిన సభ్యులు డాక్టర్ బి. ఆర్ . అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ, అణగారిన కులాల గొంతుకగా నిలవాలని ఏపీ ఎస్సీ కమిషన్ చైర్మన్ కె ఎస్ జవహర్ పిలుపు ఇచ్చారు. విజయవాడ లోని జింఖానా గ్రౌండ్స్ లోని కందుకూరి కళ్యాణ మండపంలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్సీ కమిషన్ సభ్యుల ప్రమాణ స్వీకారమహోత్సం బుధవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా సభ్యులు మేకల బిక్షం (బాబు), ఎన్టీ రామాంజినమ్మ, రావాడ సీతారామ్, పి. గౌతమ్ రాజ్, డాక్టర్ శ్రీపతి బాబుల చేత ఎస్సీ కమిషన్ ఛైర్మన్ కే.ఎస్. జవహర్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఎస్సీ కమిషన్ ఛైర్మన్ జవహర్ మాట్లాడుతూ రాజ్యాంగబద్ధ పదవిని స్వీకరించిన సభ్యులు డాక్టర్ బి. ఆర్ . అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ, అణగారిన కులాల గొంతుకగా ఎస్సీ కమిషన్ నిలవాలన్నారు. ఎస్సీ ల్లోని 59 కులాలకు పక్షపాత దోరణి లేకండా నిష్పక్షపాతంగా సేవలు అందించాలన్నారు. దళితుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ వారి ఉన్నతికి పాటు పడటమే ఎస్సీ కమిషన్ లక్ష్యంగా ఉండాలన్నారు. షెడ్యూల్డ్ కులాల హక్కుల కోసం పనిచేస్తూనే, వివక్ష లేని కులరహిత సమాజమే లక్ష్యంగా ఎస్సీ కమిషన్ పనిచేస్తుందని ఆయన అన్నారు.ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మనపై ఉంచిన నమ్మకాన్ని అంతే బాధ్యతగా నిర్వహిద్దామని పిలుపునిచ్చారు. రాజకీయాలకు అతీతంగా కమిషన్ పనిచేస్తుందని, బాధితులకు న్యాయం చేయటమే కమిషన్ లక్ష్యమన్నారు. కమిషన్ సభ్యులు తమ హక్కులు, బాధ్యతలు తెలుసుకుని వ్యవహరించాలని కోరారు. కుల అహంకారులు, రెండు గ్లాసుల విధానం పాటించే వారిపై అంకుశం ఎక్కుపెట్టాలని సమసమాజ స్థాపనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. వ్యవస్థలో సమూల మార్పు కోసం ఎస్సీ కమిషన్ శ్రమిస్తుందని హామీ ఇచ్చారు. దళితులు రాజకీయంగా ఎదగాలని, ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షిస్తున్నా మన్నారు. మాజీ మంత్రి, వినియోగదారుల రక్షణ మండలి ఛైర్ పర్సన్ పీతల సుజాత మాట్లాడుతూ దళితుల సమస్యల కోసం నిరంతరం పోరాడాలని పిలుపునిచ్చారు. కార్యకర్తలు, నాయకులు తమ కోసం కాకుండా సమాజంలోని అసమానతలను తొలగించడానికి పోరాడితే చరిత్రలో నిలిచిపోతారన్నారు. డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధనే లక్ష్యంగా ఎస్సీ కమిషన్ పనిచేయాలని పిలుపునిచ్చారు. శాసనసభ్యులు, టిటిడీ బోర్డు సభ్యులు ఎం.ఎస్. రాజు మాట్లాడుతూ దళితులకు రక్షణ, ఆత్మగౌరవం, సంక్షేమం కూటమి పాలనలోనే దక్కాయన్నారు. ఎస్సీలకు న్యాయం జరిగేలా రక్షణ హక్కుల కోసం ఎస్సీ కమిషన్ అండగా నిలవాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగ విలువలతో పదవీబాధ్యతలు నిర్వహించే చైర్మన్ కేఎస్ జవహర్ ఎస్సీ కమిషన్ ఛైర్మన్ గా ఉండటం రాష్ట్రంలో ఎస్సీలకు రాజకీయాలకు అతీతంగా ఖచ్చితంగా న్యాయం జరుగుతుం దన్నారు. గత ఐదేళ్లలో ఎస్సీలపై అఘాయిత్యాలు, దాడులు పెరిగిపోయాయని, కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుండి ఎస్సీలకు సంపూర్ణ న్యాయం జరుగుతుందన్నారు. శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం బలహీన వర్గాల హక్కుల కోసం పోరాడుతుందని, వారి ఉజ్వల భవిష్యత్ కు పునాది వేస్తూ వారి ఉన్నతికి నిరంతరం పాటుపడుతుందన్నారు. పార్లమెంట్, శాసనసభ స్పీకర్ లుగా బాలయోగి, ప్రతిభా భారతి లను ఎన్నుకున్న చరిత్ర ముఖ్యమంత్రికే దక్కుతుందన్నారు. దళితుల హక్కుల కాపాడటంలో ఎస్సీ కమిషన్ సభ్యులు గురుతర బాధ్యతలు నిర్వహించాలని ఆకాంక్షించారు. పల్నాడు జిల్లా పిన్నెల్లిలో ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన గొడవను పార్టీలకు చుట్టి రాజకీయం చేయాలని చూస్తున్న సంఘటనపై నిజ నిర్ధారణ కమిటీ వేయాలని ఎస్సీ కమిషన్ ఛైర్మన్ జవహర్ ను శాసనసభ్యులు కోరారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సభ్యులు మేకల భిక్షం (దాసు) మాట్లాడుతూ శక్తి వంచన లేకుండా పనిచేసి దళితుల ఆత్మగౌరవాన్ని కాపాడుతామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఎక్కడ దళితులకు ఎవరికి అన్యాయం జరిగినా వారికి న్యాయం జరిగేలా నా వంతు కృషి చేస్తామన్నారు. అనంతరం నూతనంగా ఎస్సీ కమిషన్ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసి, బాధ్యతలు స్వీకరించిన సభ్యులను నాయకులు, అభిమానులు శాలువాలు, పూలమాలలతో ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, దళిత కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

