ప్రభాతదర్శిని (తిరుపతి-ప్రతినిధి):తిరుపతి జిల్లా పులికాట్ ప్రాంతంలో కొనసాగుతున్న అంతర్రాష్ట్ర జల వివాదం సమస్య గురించి స్థానిక మత్స్యకారులు తిరుపతి ఎంపీ గురుమూర్తి దృష్టికి తీసుకెళ్లారు. జిల్లాలోని సుమారు 24 గ్రామాల మత్స్యకారులకు పులికాట్ సరస్సు,దాని పరిసర తీర ప్రాంతాల్లో చేపల వేటే ప్రధాన జీవనాధారమని,అందులో ఐదు గ్రామాలు పూర్తిగా మత్స్యవృత్తిపైనే ఆధారపడి ఉన్నాయని వారు ఎంపీకి వివరించారు.పన్నంగాడు ప్రాంతంలో ఉన్న పులికాట్ సరస్సు పబ్లిక్ పులికాట్ మ్యాప్స్ ప్రకారం పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిధిలోనే ఉందని, ఈ ప్రాంతం అంతర్రాష్ట్ర సరిహద్దుకు సుమారు 3.34 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ తమిళనాడు రాష్ట్రానికి చెందిన మత్స్యకారులు సరిహద్దులు మార్చేశారని అందువలన చేపల వేట కొనసాగించడం సమస్యగా మారిందని మత్స్యకారులు తెలిపారు.దీనివల్ల తరచు ఘర్షణలు చోటుచేసుకుంటూ,స్థానిక మత్స్యకారులు భయభ్రాంతులకు గురవుతూ జీవనాధారం కోల్పోయే పరిస్థితి నెలకొందని ఎంపీకి తెలియజేశారు.ఈ అంశం గురించి వారితో మాట్లాడిన ఎంపీ ఈ సమస్య గురించి గతంలో పార్లమెంటు సమావేశాలలో మాట్లాడిన విషయాన్ని గుర్తు చేశారు.ఈ విషయమై మరోసారి పార్లమెంటులో ప్రస్తావిస్తానని వారికి తెలిపారు.ఈ సమస్యపై జిల్లా కలెక్టర్‌తో మాట్లాడిన ఎంపీ గురుమూర్తి అక్రమ చొరబాట్లను అరికట్టి స్థానిక మత్స్యకారులకు రక్షణ కల్పించాలని,వారి సంప్రదాయ మత్స్యకార హక్కులను కాపాడేలా శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు.