ప్రభాతదర్శిని (కోవూరు-ప్రతినిధి) : ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసి రాష్ట ప్రభుత్వ రాజముద్రతో రైతులకు పట్టాదార్ పాస్ పుస్తకాలు అందచేసి ఎన్నికల నాటి హామిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమలు చేశారని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు. రైతులకు పట్టాదార్ పాస్ పుస్తకాలు అందచేసే కార్యక్రమంలో భాగంగా కోవూరు మండలం లేగుంటపాడు గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి కి స్థానిక టిడిపి నాయకులు ఘన స్వాగతం పలికారు. కోవూరు మండలానికి సంబంధించి 2 వేల 424 పట్టాదార్ పాస్ పుస్తకాలను రైతులకు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ తాను ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తున్నట్టు వెల్లడించారు. గత ప్రభుత్వం అన్నదాతల పాలిట శాపంగా తీసుకువచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసి రాష్ట ప్రభుత్వ రాజముద్రతో పట్టాదార్ పాస్ పుస్తకాలతో రైతుల భూములకు సిఎం చంద్రబాబు నాయుడు గారు రైతుల భూములకు భద్రత కల్పించారన్నారు. అత్యాధునిక సాంకేతికతో రూపొందించిన పట్టాదార్ పాస్ బుక్ పై గల క్యు ఆర్ కోడ్ స్కాన్ చేసి భూమి వివారాలు తెలుసుకోవచ్చని సర్వే నెంబర్లు, పేర్లలో ఏవైనా పొరపాట్లు దొర్లి వుంటే సరిదిద్దుకోవచ్చు అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చాక దశాబ్దాల తరబడి పూడికలు తీయని కాలువలను కొన్ని ప్రభుత్వ పరంగాను మరికొన్ని విపిఆర్ ఫౌండేషన్ ద్వారా బాగు చేసి ప్రతి ఎకరాకు సాగునీరు అందించామన్నారు. గతమెన్నడు లేనివిధంగా గిట్టుబాటు ధర కల్పించి, ధాన్య సేకరణ చేసిన 24 గంటలలో రైతుల ఖాతాలలో హమాలీ కూలీలతో సహా వేసిన ఘనత చంద్రబాబు నాయుడుకే దక్కుతుందన్నారు. మూడు విడతలుగా 7 వేల మెట్రిక్ టన్నుల యూరియా పంపిణి చేసి సన్నకారు రైతులను ఆదుకున్నాంమన్నారు. రైతుల అవసరాలను గుర్తించి యూరియా పంపిణి చేయడంలో వ్యవసాయశాఖ అధికారులు చూపిస్తున్న చొరవను ఆమె అభినందించారు. గత ఐదేళ్లలో తట్టెడు మట్టికి నోచుకోని గ్రామీణ ప్రాంత రోడ్ల దుస్థితికి నేటికీ ఎంతో మార్పు వుందన్నారు. కూటమి ప్రభుత్వ 19 నెలల పాలనలో 14 లక్షలతో సిసి రెండు సిసి రోడ్ల నిర్మాణం పూర్తయిందని 32 లక్షలతో తాగునీటి అవసరాల కోసం నిర్మిస్తున్న వాటర్ ట్యాంక్ నిర్మాణ దశలో ఉందన్నారు. 80 లక్షలతో లేగుంటపాడు జమ్మిపాలం లింక్ రోడ్డు నిర్మాణం, 36 లక్షలతో లేగుంటపాడులో విలేజ్ హెల్త్ సెంటర్ నిర్మాణాలు త్వరలోనే చేపట్ట బోతున్నామన్నారు. 65 లక్షలతో 15 వ ఆర్ధిక సంఘ, ఎంపి లాడ్స్, జాతీయ ఉపాధి హామి నిధులతో చేస్తున్న రోడ్లు, కల్వర్టులు మరియు డ్రైన్ల నిర్మాణాలు చేపట్టబోతున్నట్టు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి ప్రకటించారు. ఈ కార్యక్రమంలో కోవూరు తహసీల్దారు వెంకటసుబ్బయ్య , పెన్నాడెల్టా ఛైర్మెన్ జెట్టి రాజగోపాలరెడ్డి, జొన్నవాడ ఆలయ ఛైర్మెన్ తిరుమూరు అశోక్ రెడ్డి, ఎంపీపీ తుమ్మల పార్వతిలతో పాటు సర్పంచ్లు, ఎంపీటీసీలు స్థానిక టిడిపి యూనిట్, క్లస్టర్, బూత్ కమిటీ ఇంచార్జీలు పాల్గొన్నారు.

