ప్రభాతదర్శిని,(తిరుపతి-ప్రతినిధి): జాగృతి యాత్రా బృందానికి చెందిన 525 మంది సభ్యులు గురువారం శ్రీసిటీ సందర్శించారు. ఔత్సాహక పారిశ్రామికవేత్తలను తయారుచేసే లక్ష్యంతో ముంబై కి చెందిన జాగృతి సేవా సంస్థాన్ స్వచ్చంద సంస్థ ఏటా చేపట్టే ఈ జాగృతి యాత్ర,ప్రత్యేక రైలు ప్రయాణం ద్వారా దేశమంతా 8 వేల కిలోమీటర్లు పర్యటించి, వివిధ రంగాలలో ఆదర్శవంతులను రోల్ మోడల్‌లు కలుసుకుని వారితో సంభాషించడం ద్వారా యాత్రికులలో స్ఫూర్తి నింపుతుంది.శ్రీసిటీ డైరెక్టర్ సిఎస్ఆర్ నిరీషా సన్నారెడ్డి యాత్రా బృందానికి సాదర స్వాగతం పలికి,పారిశ్రామిక కేంద్రం ప్రగతి, ప్రత్యేకతలను వివరించారు.పర్యటనలో భాగంగా యాత్రికులు శ్రీసిటీ పరిసరాలు,పారిశ్రామిక పురోగతిని నేరుగా వీక్షించడంతో పాటు పలు బ్యాచ్ లుగా విడిపోయి డైకిన్,బ్లూ స్టార్, లావాజ్జా,ఈ ప్యాక్,పెప్సికో,అంబర్,రాక్‌వర్త్, బెర్గెన్ పైప్‌ సపోర్ట్స్,ఏ ఎల్ ఎఫ్,ఆర్ ఎస్ బి ట్రాన్స్‌మిషన్, ఎం ఎం డి బ్రేక్స్ ఇండియా,డైకి అల్యూమినియం పరిశ్రమలను సందర్శించారు.శ్రీసిటీ ప్రపంచ స్థాయి మౌళిక సదుపాయాలు,వ్యాపారానుకూల వాతావరణం,సుస్థిర పర్యావరణ వ్యవస్థ, ఉపాధి,వివిధ రకాల ఉత్పత్తులు వారిని ఎంతగానో ఆకట్టుకున్నాయి.తమ బృందానికి సందర్శన అవకాశం కల్పించిన శ్రీసిటీ యాజమాన్యానికి జాగృతి సంస్థ సీఈఓ అశుతోష్ కుమార్ ప్రత్యేక కృతఙ్ఞతలు తెలిపారు.పెట్టుబడులు మరియు ఔత్సాహక పారిశ్రామికవేత్తలకు అపార అవకాశాలు వున్న సంపూర్ణ వ్యాపార నగరానికి శ్రీసిటీ ఒక చక్కటి ఉదాహరణగా ఆయన పేర్కొన్నారు.2016 నుంచి నేటి వరకు 8 పర్యాయాలు తమ బృందం శ్రీసిటీని సందర్శించిందని, ప్రతిసారి సభ్యులందరిలో శ్రీసిటీ చెరగని ముద్ర వేసిందని వ్యాఖ్యానించారు.పరిశ్రమల సందర్శన అనంతరం బుధవారం రాత్రి వారి రోల్ మోడల్ గా ఎంచుకున్న డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి జాగృతి సభ్యులతో సమావేశమయ్యారు ప్రపంచ స్థాయి తయారీ కేంద్రంగా శ్రీసిటీ ప్రయాణం,దార్శనికత, సవాళ్లు,మైలురాళ్లను వివరిస్తూ స్ఫూర్తిదాయక ప్రసంగం చేశారు.