విజయనగరంలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ హత్య కేసును చేయించిన పోలీసులు
ప్రభాతదర్శిని, (ప్రత్యేక ప్రతినిధి):విజయనగరంలో సంచలనం సృష్టించిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కోనారి ప్రసాద్ హత్య కేసును పోలీసులు చేధించారు. ప్రసాద్ హత్యకు వివాహేతర సంబంధమే కారణంగా తేల్చారు పోలీసులు. ఈ నెల 10న తెర్లాం మండలం భూరిపేట సమీపంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ కోనారి ప్రసాద్ దారుణ హత్యకు గురయ్యాడు. తెర్లాం మండలం నెమలాం గ్రామానికి చెందిన సన్యాసి, అపయమ్మలకు ప్రసాద్, అచ్యుత్ అనే ఇద్దరు అబ్బాయిలతో పాటు స్వాతి అనే కుమార్తె కూడా ఉంది. స్వాతికి వివాహం కాగా ప్రసాద్, అచ్యుత్ లు బెంగళూరులో షాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు. వీరిలో ప్రసాద్ ట్రిపుల్ ఐటి ఇడుపులపాయలో ఇంజనీరింగ్ పూర్తి చేసి అనంతరం బెంగళూరు ఐబిఎం కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. బెంగుళూరు నుంచి తరచూ తన సొంత ఊరు వచ్చి గ్రామమంతా తిరిగి అందరినీ పేరు పెట్టి పిలుస్తూ సరదా సరదాగా గడుపుతుంటాడు. అందరితో కలుపుగోలుగా ఉంటూ వివాదాలకు దూరంగా ఉంటాడు. అయితే ప్రసాద్ పెద్ద కుమారుడు కావడంతో వివాహం చేయాలని నిర్ణయించుకున్నారు తల్లిదండ్రులు. అందులో భాగంగా పెళ్లిచూపులు నిమిత్తం బెంగళూరు నుంచి కుమారుడు ప్రసాద్ ను ఇంటికి పిలిచారు. ఇందులో భాగంగా ఈనెల 5న బెంగుళూరు నుండి నెమలాంలోని తన ఇంటికి చేరుకున్నాడు ప్రసాద్. ఇంటి దగ్గర నుండే వర్క్ ఫ్రం హోం జాబ్ చేసుకుంటూ ఉంటున్నాడు. మరో రెండు రోజుల్లో పెళ్లిచూపులు ఉన్న నేపథ్యంలో కుటుంబ సభ్యులు కూడా సంతోషంగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఈనెల 10వ తేదీ రాత్రి 8:30 గంటల ప్రాంతంలో తమ ప్రక్క గ్రామం బూరిపేటలో ఉంటున్న అమ్మమ్మ వారింటికి వెళ్లి పెళ్లిచూపులు విషయం చెప్పి వస్తానని ఇంటి వద్ద నుండి బైక్ పై బయలుదేరి వెళ్ళాడు ప్రసాద్. అలా అమ్మమ్మ వారి ఇంటికి వెళ్లిన ప్రసాద్ తిరిగి 9:30 గంటల ప్రాంతంలో ఇంటికి బయలుదేరాడు. అనంతరం కొద్దిసేపటి తర్వాత ప్రసాద్ ఫోన్ స్విచ్చాఫ్ అయ్యింది. తల్లిదండ్రులు కొంత సేపు ఫోన్ చేసి అమ్మమ్మ వారి దగ్గర ఉండి ఉంటాడని అనుకున్నారు. అయితే తెల్లవారుజామున అదే రోడ్డు పై అటుగా వస్తున్న స్థానికులు విగతజీవిగా పడి ఉన్న ప్రసాద్ ను చూసి ఒకింత భయాందోళనకు గురయ్యారు. వెంటనే తేరుకొని కుటుంబ సభ్యులకు మరియు పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న ప్రసాద్ తల్లిదండ్రులు ఘటనాస్థలానికి చేరుకొని ప్రసాద్ మృతదేహం చూసి గుండెలవిసేలా రోదించారు. అందరితో సరదాగా ఉండే తమ కుమారుడిని హత్య చేయాల్సిన అవసరం ఎవరికి వచ్చిందో అని భోరున విలపిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కూడా సంఘటనా స్థలానికి వచ్చారు. వెంటనే డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్ సహాయంతో ప్రాథమిక ఆధారాలు సేకరించారు. తమకు దొరికిన ఆధారాలతో ప్రసాద్ ను రోడ్డు పక్కన ఉన్న పంటపొలాల్లో మొహం పై రాయితో మోది, అత్యంత కిరాతకంగా దాడి చేసి హతమార్చినట్లు తేల్చారు పోలీసులు. అనంతరం ప్రసాద్ మృతిని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు బైక్ ను క్రింద పడేసి, మృతదేహాన్ని రోడ్డు పై వేశారు నిందితులు. టెక్కీ ప్రసాద్ హత్యకు కారణమేంటి? నెమలాం గ్రామంలోనే కోనారి అచ్యుత్, కోనారి శివకృష్ణ అనే ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. అచ్యుత్ కు వెంకటలక్ష్మి అనే మహిళతో వివాహం కాగా శివకృష్ణ గ్రూప్ 2 పరీక్ష కోసం వైజాగ్ లో కోచింగ్ తీసుకుంటున్నాడు. ఈ ఇద్దరు అన్నదమ్ములు మృతుడు ప్రసాద్ కు సమీప బంధువులు. ఈ నేపథ్యంలోనే అచ్యుత్ భార్య వెంకటలక్ష్మి తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ఇద్దరి మధ్య అక్రమ సంబంధానికి దారి తీసింది. ప్రతిరోజు ఇద్దరు ఫోన్లో మాట్లాడుకోవడం, వాట్స్అప్ ద్వారా చాటింగ్ చేసుకోవటం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే వెంకటలక్ష్మి మరిది శివకృష్ణ వీరి మధ్య ఉన్న పరిచయాన్ని పసిగట్టాడు. వెంకటలక్ష్మి వాడుతున్న ఫోన్ వాట్సాప్ ను తమ ల్యాప్ టాప్ లోని వెబ్ లింక్ అయ్యి చాటింగ్ అంతా చూస్తూ ఉండేవాడు. ఈ క్రమంలోనే ప్రసాద్, వెంకట లక్ష్మీ మధ్య జరుగుతున్న చాటింగ్, అశ్లీల మెసేజ్ లు శివకృష్ణ స్క్రీన్ షాట్ తీసి తన అన్న అచ్యుత్ కి పంపి ఇద్దరి మధ్య ఉన్న వివాహేతర సంబంధాన్ని తెలియజేస్తూ ఉండేవాడు. అయితే అప్పటికే వెంకటలక్ష్మికి మరిది శివకృష్ణ తో కూడా వివాహేతర సంబంధం కొనసాగుతుంది. అలా తనతో ఉంటూ ప్రసాద్ తో కూడా వివాహేతర సంబంధం పెట్టుకోవడం జీర్ణించుకోలేకపోయాడు మరిది శివకృష్ణ. ఈ క్రమంలోనే పెళ్లిచూపులు నిమిత్తం ఈ నెల ఏడో తేదీన గ్రామానికి వస్తున్నట్లు తెలియజేశాడు ప్రసాద్. ఆ విషయం వాట్సాప్ ద్వారా చూసిన శివకృష్ణ అన్న అచ్యుత్ కూడా మాట్లాడి ఎలాగైనా ప్రసాద్ ను చంపాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నట్లే 7 వ తేదీ ప్రసాద్ గ్రామానికి చేరుకోగా విషయం తెలుసుకున్న శివకృష్ణ 9 వ తేదీన వైజాగ్ నుండి నెమలాం చేరుకున్నాడు. అనంతరం మరుసటి రోజు అయిన పదవ తేదీన హత్యకు పన్నాగం పన్నారు. 10వ తేదీ రాత్రి 8 గంటల సమయంలో ప్రసాద్ అమ్మమ్మ గారి ఊరు అయిన బూరిపేట వెళ్తూ శివకృష్ణకు కనిపించాడు. దీంతో ఈ సమయంలో ఎక్కడికి వెళ్తున్నావ్ అని ప్రసాద్ ను అడిగాడు శివకృష్ణ. తన అమ్మమ్మ గారి దగ్గరకు వెళ్తున్నట్లు తెలియజేశాడు ప్రసాద్. అయితే తాను, తన అన్న కలిసి పొలం వెళ్తున్నామని బూరిపేట నుండి తిరుగు ప్రయాణంలో దారిలో ఉన్న పొలంలో తమని కలవమని, అక్కడ కాసేపు ఉండి వద్దామని నమ్మించాడు. ప్రసాద్ కూడా సరేనని అక్కడ నుండి వెళ్లిపోయాడు. దీంతో ఇదే సరైన సమయం అనుకున్న శివకృష్ణ తన అన్న అచ్యుత్ తో కలిసి ప్లాన్ ప్రకారం కర్రలతో పొలం వద్దకు వెళ్లారు. కొద్దిసేపటికి అనుకున్నట్లే ప్రసాద్ ఫోన్ చేసి వీరిద్దరూ ఉన్న పొలం వద్దకు వచ్చాడు. అలా పొలం దగ్గరకు వచ్చిన ప్రసాద్ ను మాటల్లో పెట్టి వెనుకనుంచి కర్రలతో దాడి చేశారు. వీటిని గమనించి పారిపోవడానికి ప్రయత్నించిన ప్రసాద్ ను వెంబడించి మరీ కర్రలతో కొట్టి కొట్టి కిరాతకంగా హత్య చేశారు. అనంతరం యాక్సిడెంట్ గా చిత్రీకరించేందుకు ప్రసాద్ డెడ్ బాడీని పొలం నుండి తీసుకువచ్చి రోడ్డుపై పడవేసి, తరువాత ప్రసాద్ బైకును కూడా ధ్వంసం చేశారు. మరుసటి రోజు ఉదయం విగత జీవిగా ఉన్న ప్రసాద్ ను చూసి కుటుంబసభ్యులకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. అలా పోలీసులు ప్రసాద్ మృతి పై దర్యాప్తు చేసి ఇద్దరిని అరెస్ట్ చేసి దాడికి వాడిన కర్రలు, సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. పవిత్రం గా భర్తనే ప్రత్యక్ష దైవం గా భావించే భార్యలకు ఇలాంటి స్త్రీ లు మచ్చ తెస్తున్నారు.