ప్రసిద్ధ గాయకురాలు పి సుశీలమ్మ పుట్టినరోజు నేడు. సినీ నీలాకాశంలో అచ్చ తెలుగు పాటల పూదోటలో పదహారణాల తేట తెనుగు సాంప్రదాయలకు, కట్టుబొట్టులతో మాతృమూర్తికి నిలువుటద్దంగా ఎదుటివారు నమస్కరించే విధంగా తలపించే సుశీలమ్మ 89 సంవత్సరాలు పూర్తి చేసుకుని 90 సంవత్సరంలోకి అడుగుపెట్టనున్నారు.1935 నవంబరు 13 న పులపాక ముకుందరావు(క్రిమినల్ లాయర్)శేషావతారం పుణ్యదంపతులకు విజయనగరం లో జన్మించారు.విజయనగరం మహారాజా సంగీత కళాశాలలో డిప్లమో ఇన్ మ్యూజిక్ లో చాలా చిన్న వయసులోనే ప్రధమ శ్రేణిలో ఉత్తీర్ణులైనారు.1950 ఆల్ ఇండియా రేడియో పోటీల్లో సుశీల గాత్రాన్ని విన్నటువంటి సంగీత దర్శకులు పెండ్యాల నాగేశ్వరరావు సుశీల గారిచే మొదట 1952లో పెట్రథాయ్ అన్న తమిళ సినిమాలో మొదటిసారిగా గాయకులు ఏ ఎమ్ రాజాతో కలిసి పాడించారు. అదే చిత్రం తెలుగులో కన్నతల్లిగా పునర్నిర్మానం చేయగా అందులో ఘంటసాలతో కలిసి మొదటిసారిగా పాడారు. సుశీల అప్పటి నుంచి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం,హిందీ, బెంగాలీ,ఒరియా,సంస్కృతం, తుళు,బడుగ, సింహాళ, లాంటి ఎన్నో భాషలలో1950-1990 మధ్యకాలంలో సుమారు 40 వేల పైగా పాటలు పాడి సంగీత అభిమానులను అలరించారు. శుద్ధ స్పటిక నాదంలా రవంత దోషంలేని వెణుగాన రవళి లా ఉంటుంది ఆమె మధుర గాత్రం. వాణి పలుకుల్లా,శుకవాణి కిసలయ సొబగుల్లగా భక్తి పారవశ్య ప్రాకారం,సంగీత శాస్త్ర స్వర మధురిమల సాకారం అంటారు సుశీల గాత్రం గురించి సంగీత కోవిధులు, సామవేద జనిత సంగీతానికి ఎన్నెన్నో సొబగులు, సోయగాలు ,ప్రయోగాలు, రసాత్మక ధోరణులు, చిత్ర విచిత్ర బాణీ విన్యాసాలు అవన్నీ అవలీలగా అలవరచుకున్న గాయనిమణి సుశీలమ్మ నేడు 89వ సంవత్సవరం లోకి అడుగిడుచున్న ఆ గాన సరస్వతి కి జన్మదిన శుభాకాంక్షలతో… ఉగ్రారపు నరసింహులు వ్యవస్థాపక అధ్యక్షులు ఘంటసాల కళాసమితి-కోట-తిరుపతి జిల్లా.