ప్రభాతదర్శిని,(తిరుపతి-ప్రతినిధి): ఏపీలోని దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఈ నెల 14 నుండి 16 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని విపత్తు నిర్వహణ సంస్థ అలర్ట్ సందేశం మేరకు మన తిరుపతి జిల్లాలోని జిల్లా, డివిజన్, మునిసిపల్, మండల అధికారులు అందరూ సమన్వయంతో ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం వాటిల్లకుండా ముందస్తు చర్యలు చేపట్టి సంసిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ నుండి అందిన సందేశం మేరకు తిరుపతి జిల్లాలో అక్టోబర్ 14 నుండి 16 వరకు భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికల నేపథ్యంలో జిల్లాలోని అందరు మండల రెవెన్యూ అధికారులు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, ఆర్ అండ్ బి, అగ్రికల్చర్, పంచాయతీరాజ్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ తదితర సంబంధిత శాఖల వారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బియ్యము, కందిపప్పు తదితరాలు తగినంత స్టాక్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సివిల్ సప్లైస్ అధికారులను ఆదేశించారు. విద్యుత్ శాఖ వారు జనరేటర్లు అందుబాటులో ఉండేలా, అలాగే శిథిలావస్థలో ఉన్న భవనాలు, పూరి గుడిసెలో ఉన్న లోతట్టు ప్రాంతాల ప్రజలను అవసరం మేరకు పునరావాస కేంద్రాలలో తరలించేలా, పునరావాస కేంద్రాలను గుర్తించి తగిన ఏర్పాట్లు ఉండేలా చూడాలని ఆదేశించారు. పంచాయతీరాజ్ మున్సిపల్ శాఖ వారు పారిశుద్ధ్య నిర్వహణ చర్యలు చేపట్టాల్సి ఉంటుందని తెలిపారు. అలాగే అందరు జిల్లా అధికారులు అప్రమత్తంగా ఉండాలని, అన్ని స్థాయిలలో సమన్వయం చేసుకుంటూ ఎక్కడ కూడా ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా చూడాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.