– జలాశయ అభివృద్ధే లక్ష్యంగా పర్యటన

ప్రభాతదర్శిని, (నెల్లూరు-ప్రతినిధి): నెల్లూరు జిల్లా వరప్రసాదిని అయిన సోమశిల జలాశయంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులను స్వయంగా పరిశీలించేందుకు నెల్లూరు జిల్లాకు చెందిన మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, పొంగూరు నారాయణ ఆహ్వానం మేరకు రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సోమశిల సందర్శనకు విచ్చేయనున్నారు. ఆదివారం ఉదయం సోమశిల జలాశయాన్ని రాష్ట్ర దేవాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణతో కలిసి మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించనున్నారు. అనంతరం సోమేశ్వరాలయం, కండలేరు రిజర్వాయరును మంత్రులు పరిశీలించనున్నారు. సోమశిల, కండలేరు జలాశయాల అభివృద్ధి, పురాతన సోమేశ్వరాలయ అభివృద్ధికి చేపట్టాల్సిన పనులను మంత్రులు ఆనం, నారాయణ జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడి దృష్టికి తీసుకెళ్లి ప్రాథమికంగా చేపట్టాల్సిన పనులను మంత్రికి వివరించనున్నారు. అనంతరం కండలేరు జలాశాయ అతిథి భవనంలో మంత్రులు జలవనరులశాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ప్రధానంగా సోమశిల ఆఫ్రాన్‌, రక్షణ గోడ నిర్మాణ పనులు, గేట్ల మరమ్మతులు చేపట్టేందుకు నిధులు మంజూరు చేసేలా మంత్రులు జలవనరులశాఖ మంత్రికి వివరించనున్నారు.