- పవన్ కళ్యాణ్, చంద్రబాబుల రాకతో జనసంద్రమైన నెల్లూరు నగరం
- కేవీఆర్ నుంచి నర్తకి సెంటర్ వరకు భారీ ర్యాలీ
- అడుగడుగునా బ్రహ్మరథం పట్టిన నాయకులు, ప్రజలు, అభిమానులు
- నర్తకీ సెంటర్లో భారీ జనసందోహం నడుమ బహిరంగసభ
- వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన చంద్రబాబు, పవన్‌కళ్యాణ్
- ఎన్నికల్లో వేమిరెడ్డి, నారాయణ, శ్రీధర్ రెడ్డి విజయం ఎంతో అవసరం
ప్రభాతదర్శిని,:(నెల్లూరు-ప్రతినిధి): సింహపురి సీమ జనసంద్రమైంది. నగరమంతా మూడు పార్టీల జెండాలతో, తరలివచ్చిన అభిమానగణంతో చరిత్ర సృష్టించింది. కనివీని ఎగురని రీతిలో తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన రోడ్‌షో నభూతో న భవిష్యతి అనిపించింది. ముందుగా నెల్లూరులోని నారాయణ మెడికల్ కాలేజీ గ్రౌండ్‌కు హెలికాప్టర్ లో చేరుకున్న చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌లకు నెల్లూరు పార్లమెంటు ఎన్డీఏ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, టిడిపి జిల్లా అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ గారు, సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి పొంగూరు నారాయణ గారు, రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీధర్ రెడ్డి గారు, టీడీపీ అగ్రనేతలు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఇక్కడి నుంచి నెల్లూరు కేవీఆర్ పెట్రోల్ బంక్ కూడలికి చేరుకుని.. ఆర్టీసీ, వీఆర్సీ సెంటర్, గాంధీబొమ్మ మీదుగా నర్తకీసెంటర్ వరకు జనసంద్రం మధ్య భారీ రోడ్ షో నిర్వహించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లకు అడుగడుగునా కూటమి శ్రేణులు, అభిమానులు బ్రహ్మరథం పట్టారు. పూలవర్షం కురిపిస్తూ, భారీ గజమాలలతో సత్కరిస్తూ ఆహ్వానం పలికారు. ఈ రోడ్ షోకి…జనసేన, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో… నెల్లూరు నగరం జనసంద్రంగా మారింది. ఈ సందర్భంగా టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు మాట్లాడుతూ సింహపురి సింహగర్జన అదిరిపోయిందన్నారు. నెల్లూరులో గల్లీగల్లీ తిరిగిన వ్యక్తి పవన్‌కళ్యాణ్ అని అన్నారు. నాకు తిరుపతిలో గల్లీ గల్లీ తెలుసు, పవన్ మీకు నెల్లూరులో గల్లీగల్లీ తెలుసని మాట్లాడుకున్నారు. సింహపురిలో కూటమి ప్రభంజనంలో వైసీపీ కొట్టుకుపోతోందని, ముగ్గురు కలిసిన తర్వాత ఏమవుతుంది తమ్ముళ్లు… అడ్డం వస్తే తొక్కుకుంటూపోవడమేనని చెప్పారు. మే 13వ తేదీన వైసీపీకి డిపాజిట్లు కూడా రావని ఎద్దేవాచేశారు. ఈ రాష్ట్రంలో ఓ అహంకారి, సైకో, విద్వంసకుడు, బందిపోటుదొంగ ఉన్నారని, 13న ఆయనకు అంతం పలికేందుకు సిద్ధమా తముళ్లు అని ప్రశ్నించారు. సింహపురిలో ఉన్న పరిస్థితే రాష్ట్రమంతా ఉంది. 13న ఎన్నికలు జరుగుతాయి, జూన్ 4న ఫలితాలు వస్తాయి 25కి 24 వీలైతే 25 పార్లమెంట్ సీట్లు, 160కి పైగా అసెంబ్లీ సీట్లు కూడా మనమే గెలుస్తున్నామని స్పష్టం చేశారు. రాష్ట్రం బాగుపడాలన్నా, తెలుగుజాతి ముందుకుపోవాలంటే సైకోను రాష్ట్రం నుంచి పంపించేయడమే మన లక్ష్యమని చెప్పారు. జరగనున్న ఎన్నికలు ధర్మానికి, అధర్మానికి, విధ్వంసానికి – అభివృద్ధికి జరుగుతున్న ఎన్నికలు అని అభివర్ణించారు. రాతియుగం పోవాలి, స్వర్ణయుగం రావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. బందిపోటుకు ఐదు కోట్ల ప్రజానికానికి జరుగుతున్న యుద్ధమే రానున్న ఎన్నికలు అని అన్నారు. రేపటి నుంచి పోస్టల్ బ్యాలెట్లు ప్రారంభమవుతున్నాయని, ఉద్యోగస్తులంతా కూటమి విజయానికి సహకరించాలని చంద్రబాబు కోరారు. డబ్బులు, కుట్రలతో వైసీపీ వాళ్లు రాజకీయం చేయాలని చూస్తున్నారని విమర్శించారు. వాళ్లు ఖర్చుపెట్టే డబ్బులు ప్రజాధనమేనని చెప్పారు. జలగ జగనన్న మీకు పది రూపాయిలు ఇచ్చి… మీ వద్ద నుంచి వెయ్యి రూపాయలు కొట్టేస్తున్నారని మండిపడ్డారు. భూమి మనది.. చుట్టూ ఉన్న హద్దు రాళ్లు, పట్టాదార్ పాస్‌బుక్‌పై ఫొటో జగన్‌ది. ఒక మనిషి అరాచకానికి పరాకాష్ట ఇది. రేపట్నుంచి మీ భూమికి ఒరిజినల్ దస్తావేజులు, పాస్ బుక్, అడంగల్ ఉండవు.. అన్నీ ఆన్లైన్లోనే. ఇదంతా జగన్ మాయ. మీ ఆస్తి ఇతరులకు రాయొచ్చు, తాకట్టు పెట్టి అప్పు తెచ్చుకోవచ్చు. జవాబుదారీ తనం ఉండదు. మీరు ఆత్మహత్యలు చేసుకున్నా పట్టించుకునే వారే ఉండరు. ల్యాండ్ టైటిలింగ్ యాక్టు వల్ల ఉపయోగం లేదు. ఈ చట్టం రైతు మెడకు ఉరితాడుగా మారుతుంది. కూటమి అధికారంలో రాగానే మొదటి సంతకం డిఎస్సీ పైన పెడితే… రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేసేందుకు పెడుతామని చంద్రబాబు హామీ ఇచ్చారు. నెల్లూరులో ముస్లీంసోదర సోదరీమణులు చూపిన అభిమానం మరువలేనిదన్నారు. గతంలో కూడా ఎన్డీఏతో పొత్తులో ఉన్నప్పుడు మైనార్టీలకు ఎలాంటి అపకారం చేయలేదని చెప్పారు. ముస్లీంలకు 4 శాతం రిజర్వేషన్ ఇస్తామని, ఓ ప్రత్యేక బడ్జెట్ తీస్తామని, మక్కాకు వెళ్లేందుకు లక్ష రూపాయలు ఇస్తామని, హాజ్‌హౌస్ పూర్తిచేస్తామని, దుల్హాన్ పథకం అమలు చేస్తాం, రంజాన్‌తోఫా ఇస్తామని, మౌజామ్, ఇమామ్‌లకు ఐదు వేల నుంచి పది వేల వరకు గౌరవ వేతనం ఇస్తామని, మసీదుల మరమ్మత్తులకు నిధులు ఇస్తామని హామీ ఇచ్చారు. కూటమి ఎన్నికల మేనిఫెస్టో రాష్ట్రభవిష్యత్‌కు అన్నీ విధాలా ఉపయోగపడుతుందన్నారు. రాష్ట్రాన్ని వైసీపీ రహితంగా తీర్చేందుకు తొలుత నిర్ణయం తీసుకున్న వ్యక్తి పవన్‌కళ్యాణ్ అని చెప్పారు. ఆ మేరకు టీడీపీ, బీజేపీ, జనసేన సంయుక్తంగా పోటీకి చేస్తున్నామని, రాష్ట్రం కోసం త్యాగం చేశామన్నారు. సింహపురితో పాటు రాష్ట్రంలో వార్ వన్ సైడ్ అయిందని తెలియజేశారు. జగన్ శవ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. సచివాలయాలకు పింఛన్‌దారులను పిలిచి 33 మంది వృద్ధులను జగన్ చంపేశారన్నారు. రాష్ట్రంలో పింఛను దారుల మరణాలన్నీ ప్రభుత్వ హత్యలేనని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో 1.5లక్షల మంది సచివాలయ ఉద్యోగులు ఉన్నారని, ఒక్కో ఉద్యోగి 40 మందికి పింఛను ఇచ్చినా ఇంటింటికే వెళ్లి ఇచ్చే అవకాశం ఉందన్నారు. కానీ, అలా చేయకుండా సచివాలయానికి రమ్మని చెప్పి, అక్కడ కూడా ఇవ్వకుండా పండుటాకుల్లాంటి ముసలివాళ్లను బ్యాంకుల చుట్టూ తిప్పుతూ నరకం చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ రాజకీయ కుట్రలో సీఎస్ భాగం కావడం దారుణమన్నారు. కూటమి ప్రభుత్వం రాగానే నెలకు రూ.4వేల పింఛను ఇంటి వద్దే ఇచ్చే బాధ్యత తమదేనని హామీ ఇచ్చారు. చంద్రన్నభీమా, ఆరోగ్యభీమా అమలు చేస్తామని, అన్నీ వర్గాల ప్రజలకు న్యాయం చేస్తామని మాటిచ్చారు. రాష్ట్రాభివృద్ధే, ప్రజాసంక్షేమమే ధ్యేయంగా కూటమి పని చేస్తుందని చంద్రబాబు హామీ ఇచ్చారు. పవన్‌కళ్యాణ్ సూచనల మేరకు స్కిల్‌డెవలప్‌మెంట్ సెంటర్లను విస్తృతం చేస్తామని చెప్పారు. ఒడిదుడుకులను ఎదుర్కోని తిరుగులేని నేతగా పవన్‌కళ్యాణ్ నిలబడ్డారని ప్రసంశించారు. నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన పొంగూరు నారాయణ నేడు ఓ బ్రాండ్‌గా తయారయ్యారంటే అదీ కమిట్మెంట్ అని కొనియాడారు. వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి డబ్బుల కోసం రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి కాదన్నారు. వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డికి, ఏ2 విజయసాయిరెడ్డికి ఏమైనా వ్యత్యాసం ఉందా తమ్ముళ్లు అని అన్నారు. నెల్లూరురూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీదర్‌రెడ్డి… జగన్ చేసే అరాచకాలు చూసి తిరుగుబాటు చేసిన వ్యక్తని చెప్పారు. నారాయణ మీదే అయితే ఎన్ని కేసులు పెట్టిన లెక్క చేయని వ్యక్తి అని అన్నారు. అలాంటి వారి పోరాటం వల్లనే నేడు రాష్ట్రంలో నిలదొక్కుకోగలిగామన్నారు. జగన్ అరాచకాలపై మొట్ట మొదట తిరగబడింది నెల్లూరుజిల్లానేనని గుర్తు చేశారు. నెల్లూరు స్పూర్తిని రాష్ట్రం మొత్తం తీసుకుందని పేర్కొన్నారు. నెల్లూరు, చెన్నైను అనుసంధానం చేస్తూ సీటీని అభివృద్ది చేస్తానన్నారు. నెల్లూరును అద్భుతమైన సీటీగా తీర్చిదిద్దుతామని, అధికారంలోకి రాగానే టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. నెల్లూరులో పోర్టు ఉందని, దగదర్తిలో ఏయిర్పోర్టు తెచ్చేందుకు ఫౌండేషన్ వేసింది తానేనన్నారు. నేడు ఆ ఫౌండేషన్ వెలవెలబోతోందన్నారు. నెల్లూరు, తిరుపతి, చెన్నైని ట్రైసిటీగా డెవలప్మెంట్ చేస్తామన్నారు. పోర్టు ఉందని, మూడు ఎయిర్‌పోర్టులు ఉన్నాయని, శ్రీసిటీ ఉందని, దాంతో ఎలక్ట్రానిక్ హబ్‌గా మారుస్తామని, దానిద్వారా ఇక్కడ యువత బయటకు వెళ్లే పరిస్థితి ఉండదని హామీ ఇచ్చారు. నెల్లూరు, తిరుపతి బాలాజీ జిల్లాలను అన్నీ విధాలా అభివృద్ధి చేస్తామని చెప్పారు. రానున్న ఎన్నికల్లో ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిని, సిటీ ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణను, రూరల్ ఎమ్మెల్యేగా కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని గెలిపించాలని నారా చంద్రబాబునాయుడు ప్రజలను కోరారు. సింహపురి ప్రజలు చూపుతున్న అభిమానానికి ఎన్ని జన్మలెత్తినా రుణం తీర్చుకోలేమని ఆయన భావోద్వేగానికి గురయ్యారు. అనంతరం హలో ఏపీ… బైబై జగన్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ… ఒక రాజకీయ నాయకుడికి ముందు తరం కోసం ఆలోచించే జ్ఞానం ఉండాలన్నారు. జగన్ ఎన్నికల కోసం మాత్రమే ఆలోచించగలడని ఎద్దేవా చేశారు. మీకు అండగా ఉండడానికి… ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలుసుకున్నానని చెప్పారు. పిఠాపురంలో పోటీ చేస్తున్నాను అసెంబ్లీలో అడుగు పెడుతున్నానని తనదైన శైలిలో హెచ్చరించారు. ఈ ప్రభుత్వం సిపిఎస్ రద్దు చేయలేదని… ఫీజు రీయింబర్స్ మెంట్ ఇవ్వలేదన్నారు. కేవలం రంగులు మార్చడానికి 13 వందల కోట్లు ఖర్చు పెట్టిందని మండిపడ్డారు. జగన్ ఓటు వెయ్యమని సిద్ధమా అని బెదిరిస్తూ అడుగుతాడన్నారు. ఇది విప్లవం పుట్టిన నేల.. క్లాస్ వార్ మీద పోరాడిన నేల ఇది అని తెలిపారు. ఇది పుచ్చలపల్లి సుందరయ్య నడిచిన నేల అన్నారు. హక్కుల్ని సాధించుకునేందుకు ఎంతవరకైన పోరాడుతామని యువతకు పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు.