శ్రావ్స్ అసోసియేషన్ ప్రారంభోత్సవంలో ఎస్వీవియు మాజీ రెక్టార్ భాస్కర్
ప్రభాతదర్శిని, (తిరుపతి-ప్రతినిధి):సాటి మనిషికి సాయపడటం పౌరులందరి సామాజిక బాధ్యత అని శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం మాజీ రెక్టార్ ఆచార్య మచ్చా భాస్కర్ పేర్కొన్నారు. డాక్టర్ సోమేసుల స్వప్నరేఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన శ్రావ్స్ అసోసియేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమం మంగళవారం తిరుపతి యూత్ హాస్టల్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆచార్య మచ్చా భాస్కర్ మాట్లాడుతూ శ్రావ్స్ ఆధ్వర్యంలో సేవ, పరిశోధన అనే రెండు అంశాలతో కార్యక్రమాలు రూపకల్పన చేయడం అభినందనీయమన్నారు. అభయక్షేత్రం నిర్వాహకులు డాక్టర్ తస్లీమా మాట్లాడుతూ నిరాదరణకు గురౌతున్న వర్గాల సంక్షేమంలో స్వచ్ఛంద సంస్థల పాత్ర గురించి తెలియజేశారు. శారీరక, మానసిక ఎదుగుదల లేని వారిలో సైతం నైపుణ్యాలను వెలికితీసే కార్యక్రమాలను స్వచ్ఛంద సంస్థలు చేపట్టాలని కోరారు. శ్రావ్స్ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ సోమేసుల స్వప్నరేఖ మాట్లాడుతూ రెండు దశాబ్దాల క్రితం తాను సంకల్పించిన సంస్థ ప్రస్తుతం ఆవిర్భవించడం సంతోషంగా ఉందన్నారు. నిరుద్యోగం, పేదరికం, వైద్యసేవలు, మహిళా సాధికారత, నిరాధార వర్గాల సంక్షేమం, ఆధునిక వ్యవసాయం, పర్యావరణ పరిరక్షణ తదితర అంశాల్లో శ్రావ్స్ సంస్థ భవిష్యత్తులో సేవ, చైతన్య, పరిశోధన కార్యక్రమాలను నిర్వహిస్తుందని పేర్కొన్నారు. తాము చేపట్టే పరిశోధన ప్రాజెక్టుల నివేదికలను ఎప్పటికప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అందజేసి సమాజ శ్రేయస్సుకు కృషి చేస్తామన్నారు. సీనియర్ జర్నలిస్ట్ కల్లుపల్లి సురేందర్ రెడ్డి మాట్లాడుతూ మానవ సేవయే మాధవ సేవగా ముందుకెలుతున్న సంస్థలో పనిచేసే అందరికి ధన్యవాదములని, శ్రావ్స్ సంస్థ అసోసియేషన్ కు అభినందనలు తెలియజేస్తూ భవిషత్తులో వీరికి ప్రతి ఒక్కరు అండగా వుండాలన్నారు. న్యాయవాది రాజశేఖర్ రాజు మాట్లాడుతూ వివిధ వ్యసనాలకు బానిసలైన వ్యక్తులకు కౌన్సిలింగ్ ఇచ్చే కార్యక్రమాలను శ్రావ్స్ సంస్థ చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో పారంపర్య వైద్య మహాసంఘం కోశాధికారి బాలకృష్ణ, ఆదరణ సంస్థ నిర్వాహకులు వసంతమ్మ, రాజా, హరికృష్ణ, హమీద, ఉదయ్, మౌలాలి తదితరులు పాల్గొన్నారు.