కందుకూరును తిరిగి ప్రకాశం జిల్లాలో కలపాలి
సి.ఎం.చంద్రబాబు, మంత్రి లోకేష్ తో చర్చించిన ఎమ్మెల్యే నాగేశ్వరరావు

ప్రభాతదర్శిని (కందుకూరు – ప్రతినిధి): కందుకూరు నియోజకవర్గంలో సాగు, తాగునీటి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత నివ్వాలని కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ లను కలిసి విన్నవించారు. ఎమ్మెల్యే నాగేశ్వరరావు, సచివాలయంలో ఇద్దరినీ విడివిడిగా కలిసి వివిధ సమస్యలపై వినతి పత్రం ఇచ్చారు. కందుకూరు ప్రాంత రైతుల సాగునీటి అవసరాలు తీర్చే రాళ్లపాడు రిజర్వాయరు కు, సోమశిల ప్రాజెక్టు నుంచి నీరు సక్రమంగా విడుదల కావడం లేదని నాగేశ్వరరావు, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. ప్రతి ఏటా సోమశిల నుంచి 1.5 టీఎంసీల నీరు విడుదల కావాల్సి ఉండగా, కొన్నేళ్ల నుంచి నీటి సరఫరా సరిగా లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. రాళ్లపాడు రిజర్వాయర్ పూర్తిస్థాయిలో నిండితే ఖరీఫ్, రబీ సీజన్లలో రైతులకు ఎంతో ఉపయోగంగా ఉంటుందన్నారు. తక్షణం రాళ్లపాడు ప్రాజెక్ట్ రిజర్వాయర్ కు నీటిని విడుదల చేసేలా ఆదేశాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబును ఎమ్మెల్యే కోరారు. మరోవైపు పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు నుంచి కందుకూరు నియోజకవర్గానికి ప్రత్యేక కెనాల్ ద్వారా నీటిని తరలించే అవకాశాన్ని పరిశీలించాలని ఎమ్మెల్యే నాగేశ్వరరావు, ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ లను అభ్యర్థించారు. వెలిగొండ తూర్పు ప్రధాన కాలువ నుంచి, ప్రత్యేకంగా కెనాల్ ఏర్పాటు చేస్తే  కందుకూరు నియోజకవర్గం లోని లింగసముద్రం, వలేటివారి పాలెం, కందుకూరు మండలాలకు సాగు,తాగునీరు అందించవచ్చని చెప్పారు. మూడు మండలాల్లోని 40 చెరువులను కృష్ణా జలాలతో నింపడం ద్వారా, సుమారు 35 వేల ఎకరాలను కొత్తగా సాగులోకి తీసుకువచ్చే అవకాశం ఉందని వివరించారు. దీనివల్ల తాగునీటి సమస్య కూడా పూర్తిగా తీరుతుందన్నారు. వెంటనే ఈ కెనాల్ నిర్మాణానికి అవసరమైన ప్రక్రియను మొదలు పెట్టేలా చూడాలని ఎమ్మెల్యే నాగేశ్వరరావు చంద్రబాబును కోరారు. ఇందుకు సంబంధించిన  వివరాలను మ్యాప్ రూపంలో ఇద్దరికీ నాగేశ్వరరావు వివరించారు.కందుకూరు నియోజకవర్గానికి ఉపయోగపడే ఈ అంశంపై వెంటనే దృష్టి పెడతామని వారిద్దరూ నాగేశ్వరరావుకు హామీ ఇచ్చారు. అలాగే ఎన్నికలకు ముందు హామీ ఇచ్చినట్టుగా, కందుకూరు నియోజక వర్గాన్ని తిరిగి ప్రకాశం జిల్లాలో కలిపే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా నాగేశ్వరరావు విన్నవించారు.